తిండి కరువు..దూసుకొస్తున్న కడుపుకాల్చే కాలం ! మోడీ జీ ఏం చేస్తున్నారో..తెలుసా?

  • రాబోయే 6 నెలల్లో ఏం జరగబోతోంది?
  • జైశంకర్ సంచలన హెచ్చరిక
  • ప్రపంచ ఆహార వ్యవస్థ కుప్పకూలబోతోందా?
  • ‘సూపర్ ఎల్ నినో’ సైరన్
  • వంటింట్లో మొదలైన ధరల మంట!
  • 100 కోట్ల మందికి తిండి కరువు?
  • చరిత్ర పునరావృతం కానుందా!
  • కడుపుకాల్చే గడ్డుకాలం వస్తాందా?

ఒకవైపు యుద్ధాల సెగలు, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తున్న ఎరువుల కొరత… దీనికి తోడు వాతావరణాన్ని అతలాకుతలం చేసే ‘సూపర్ ఎల్ నినో’ భయాలు! విశ్వం అంచులను తాకే సాంకేతికత చేతుల్లో ఉన్నా, నేల తల్లి ఇచ్చే ఒక్క ముద్ద మెతుకు కోసం యావత్ ప్రపంచం బిక్కుబిక్కుమంటూ చూడాల్సిన దుస్థితి ఇది! రాబోయే రోజుల్లో ప్రపంచం ఒక పెను ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ న్యూయార్క్‌లోని ఆసియా సొసైటీ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెరవెనుక అసలు కారణాలు ఏంటి?

ప్రపంచం ఆకలి కోరల్లోకి చిక్కుకోవడానికి ఏ ఒక్క సమస్యో కారణం కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన మూడు సంక్షోభాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచ ధాన్యపు గిడ్డంగులైన నల్ల సముద్ర వాణిజ్య మార్గాలను దిగ్బంధించాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించినట్లుగా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఇంధన సంక్షోభం రవాణా వ్యయాలను రెట్టింపు చేసింది.

పంట దిగుబడికి ప్రాణాధారమైన యూరియా, డీఏపీ, పొటాష్ వంటి రసాయన ఎరువుల ఉత్పత్తి, ఎగుమతుల్లో రష్యా, బెలారస్ కీలక పాత్రధారులు. యుద్ధం వల్ల సరఫరాలు నిలిచిపోయి ధరలు మండిపోతున్నాయి. ఇక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. ఒకచోట ఎండలు, మరోచోట అకాల వర్షాలు ప్రపంచ పంట దిగుబడులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అయితే, మానవాళి ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గత అర్ధ శతాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాలు, చమురు షాక్‌లు, రవాణా ఆంక్షలు ప్రపంచాన్ని ఎలా కడుపు మార్చేలా చేశాయో కీలక చారిత్రక ఘట్టాలు ఉన్నాయి.

1970ల తొలినాళ్లలో సోవియట్ యూనియన్, చైనా, భారత ఉపఖండం, ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లి అంతర్జాతీయంగా ధాన్యపు నిల్వలు పడిపోయాయి. 1973 యోమ్ కిప్పుర్ యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చిన దేశాలపై అరబ్ దేశాలు విధించిన చమురు ఆంక్షలు ఇంధనం, రవాణా, ఎరువుల ధరలను ఆకాశానికి చేర్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం చూసిన అత్యంత సంక్లిష్టమైన ఆహార పరిస్థితిగా దీనిని FAO పేర్కొంది. ఆహార భద్రతను అంతర్జాతీయ ఎజెండాలోకి తెస్తూ 1974లో రోమ్‌‌లో తొలి ‘ప్రపంచ ఆహార సదస్సు’ ఏర్పాటైంది.

తగ్గిపోయిన నిల్వలు, పెరిగిన ఇంధన ధరలు, బయో-ఇంధనాల వైపు మళ్లిన పంటలు, ఎగుమతులపై దేశాల ఆంక్షలు వెరసి బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ధరలు చుక్కలనంటాయి. సంపాదనలో సగానికి పైగా తిండికే ఖర్చు చేసే పేద దేశాల్లో ఇది పెను సంక్షోభాన్ని తెచ్చింది. కెమరూన్, సెనెగల్, ఈజిప్ట్, మెక్సికో, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంకతో సహా అనేక దేశాల్లో ఆహార అల్లర్లు చెలరేగాయి. 1970 తర్వాత మొదటిసారిగా ఆకలితో అలమటించే వారి సంఖ్య 100 కోట్లు దాటిందని FAO, WFP నివేదికలు వెల్లడించాయి. సుమారు 13 కోట్ల నుంచి 15.5 కోట్ల మంది తీవ్ర దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు.

2008 నాటి పరిస్థితుల నుంచి ప్రపంచం తేరుకోకముందే, ప్రధాన ఉత్పత్తి దేశాల్లో కరువులు విరుచుకుపడ్డాయి.రష్యాలో వచ్చిన తీవ్రమైన ఎండలు, కార్చిచ్చుల కారణంగా గోధుమ ఎగుమతులపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. 2011 జనవరి నాటికి FAO ఆహార ధరల సూచీ 231 పాయింట్లకు చేరుకుని, 1990లో లెక్కలు ప్రారంభించిన నాటి నుంచి అత్యధిక రికార్డును నమోదు చేసింది. 2020లో కోవిడ్-19 తెచ్చిన గ్లోబల్ లాక్‌డౌన్ సంక్షోభంతో ఉత్పత్తి ఉన్నా రవాణా వ్యవస్థలు, ఉపాధి స్తంభించిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా నిలిచిపోవడం, లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం, పాఠశాలల మూసివేతతో చిన్నారులకు పౌష్టికాహారం అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగించింది. తీవ్ర ఆహార అభద్రత ఎదుర్కొంటున్న వారి సంఖ్య 15.5 కోట్లకు పెరగగా, దీర్ఘకాలిక ఆకలి బాధితులు ఏకంగా 16.1 కోట్లు పెరిగారు.

నల్ల సముద్ర వాణిజ్యం మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్ కుదేలైంది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. తీవ్ర ఆహార అభద్రత ఎదుర్కొనే వారి సంఖ్య ఏకంగా 25.8 కోట్లకు ఎగబాకింది; దీనిని ఐక్యరాజ్యసమితి ‘ఆకలి తుఫాను’గా అభివర్ణించింది. గోధుమలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనె ఎగుమతులకు కేంద్రమైన బ్లాక్‌ సీ ప్రాంతంలో యుద్ధం మొదలవడంతో అంతర్జాతీయ మార్కెట్ కుదేలైంది. రష్యా ఎరువుల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి కావడంతో, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీనిపై UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ “ఆకలి తుఫాను, ప్రపంచ ఆహార వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ముంచుకొస్తోంది” అని హెచ్చరించారు. 2022 నాటికి తీవ్ర ఆహార అభద్రత ఎదుర్కొంటున్న వారి సంఖ్య 25.8 కోట్లకు ఎగబాకింది.

అయితే, ప్రపంచం మొత్తం వణుకుతున్న సమయంలో భారత్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. స్వదేశీ అవసరాలకు పెద్దపీట వేస్తూ గోధుమలు, బాస్మతీయేతర తెల్ల బియ్యం, చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం పరిమితులు విధించింది. మన దేశంలో ఆకలి కేకలు రాకుండా నిల్వలను పటిష్టం చేసుకుంటోంది. ఎరువుల కోసం రష్యా, మధ్యప్రాచ్య దేశాలు, కెనడాతో భారత్ ముందస్తు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని రైతులకు రాయితీలను భరిస్తూ నిరంతర సరఫరాకు ప్రయత్నిస్తోంది. వ్యవసాయం ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న జూదంగా మారింది. డీజిల్ ధరలు, విత్తనాలు, పురుగుమందుల భారం పెరగడంతో పెట్టుబడి వ్యయం తడిసిమోపెడవుతోంది. వర్షాలు సమయానికి పడక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక మన రైతులు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. భారత్‌లో భారీ బఫర్ స్టాక్‌లు, ఉచిత రేషన్ పథకాలు ఉన్నందున ప్రస్తుతానికి కరవు ముప్పు లేనప్పటికీ, ద్రవ్యోల్బణం వల్ల సామాన్యుడి వంటింట్లో కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు మండిపోతున్నాయి. అయితే, భారత్‌పై ఆధారపడే పొరుగు దేశాలు, పేద ఆఫ్రికా దేశాల్లో మాత్రం ‘తీవ్ర ఆకలి కేకలు’ వినిపించే ప్రమాదం పొంచి ఉంది.

సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా పంట దిగుబడులు కుప్పకూలి, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది. భారతదేశంలో సుమారు 50% వ్యవసాయ భూములు రుతుపవనాల వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. గత 130 ఏళ్లలో భారతదేశం ఎదుర్కొన్న తీవ్ర కరవులలో దాదాపు 60% కంటే ఎక్కువ కరవులు ఎల్ నినో ప్రభావంతోనే ఏర్పడ్డాయి. వర్షాలు ఆలస్యమైతే విత్తనాలు వేసే విస్తీర్ణం తగ్గి ఉత్పత్తి తగ్గుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులలో నీరు లేక విద్యుదుత్పత్తి, శీతాకాల పంటలు దెబ్బతింటాయి. ఆహార ధాన్యాల కొరత దేశీయంగా నిత్యావసరాల ధరలను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది.

మనిషి ఆకాశంలోకి రాకెట్లను పంపగల సాంకేతికతను సాధించినప్పటికీ, పూట గడవడానికి కావాల్సిన పిడికెడు ధాన్యం కోసం ఇప్పటికీ ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన సున్నితమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. యుద్ధాలు, భూతాపం, భౌగోళిక రాజకీయ కక్షలు చివరకు సామాన్యుడి కంచాన్ని ఖాళీ చేస్తున్నాయని చరిత్ర పదే పదే రుజువు చేస్తోంది. ఆధునిక మానవుడు చంద్రుడిపై కాలనీలు కట్టే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, జీవించడానికి కనీస అవసరమైన ‘ఒక్క పూట తిండి’ కోసం ప్రకృతిపై, పరస్పర సహకారంపై ఆధారపడక తప్పదని చరిత్ర నిరూపిస్తోంది. యుద్ధ క్షేత్రాల్లో కురిసే బాంబుల పొగలు ఆయుధ కర్మాగారాలకు లాభాలు తెచ్చిపెట్టవచ్చోమో గానీ, చివరకు అవి మసి చేసేది పచ్చని పంట పొలాలను, ఖాళీ చేసేది అమాయక సామాన్యుడి కంచాన్ని! భౌగోళిక రాజకీయ స్వార్థాలను విడనాడి, గ్లోబల్ సప్లై చైన్‌లను కాపాడుకోకపోతే… రాబోయే రోజుల్లో సంక్షోభం కేవలం సరిహద్దులకే పరిమితం కాదు, సమస్త మానవాళి అస్తిత్వాన్నే ప్రశ్నిస్తుంది!

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్