- నో’ అంటే.. ఖాతా ఖాళీ!
- ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!
- వాట్సాప్ సందేశంతోనే క్షణాల్లో సొమ్ము స్వాహా!
- ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌తో కేటుగాళ్ల సరికొత్త పన్నాగం
హైదరాబాద్: అక్టోబర్ 13, త్రికాల తెలుగు: సైబర్ నేరగాళ్లపై నిరంతరం నిఘా ఉంచుతూ, విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కేటుగాళ్లు ఆధునిక సాంకేతికతను ఆసరాగా చేసుకుని సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఇప్పటివరకు గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేస్తేనో, ఎవరికైనా ఓటీపీలు పంచుకుంటేనో మాత్రమే ఖాతాల నుంచి నగదు మాయమయ్యేది. కానీ ఇప్పుడు కేటుగాళ్లు అంతకుమించిన సాంకేతిక ఎత్తుగడలతో అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు.

బాధితులు ఎవరితోనూ ఓటీపీలు పంచుకోకపోయినా, ఎలాంటి లింకులపై క్లిక్ చేయకపోయినా.. గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్‌నకు వచ్చిన సందేశానికి కేవలం నో (NO) అని బదులిచ్చినందుకే జీవితకాల సంపాదనను క్షణాల్లో పోగొట్టుకుంటున్న సరికొత్త తరహా నేరాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు.
ఈ కొత్త తరహా మోసం జరుగుతున్న తీరును ఆయన వివరిస్తూ.. మొదట గుర్తుతెలియని లేదా అంతర్జాతీయ నంబర్ల నుంచి బాధితుల వాట్సాప్‌కు ‘మీ బ్యాంక్ ఖాతా నుంచి కొంత నగదు డెబిట్ అయ్యింది’ అంటూ ఒక నకిలీ సందేశాన్ని పంపుతారని తెలిపారు. ఆ వెంటనే బాధితుల్లో భయాందోళనలు సృష్టిస్తూ.. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే నో (NO) అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో సందేశాన్ని పంపిస్తారని పేర్కొన్నారు.
అకౌంట్ నుంచి డబ్బులు పోయాయన్న కంగారుతో బాధితులు ఏమాత్రం ఆలోచించకుండా నో అని బదులివ్వగానే ఖాతాలోని డబ్బంతా క్షణాల వ్యవధిలో మాయమవుతోందని తెలిపారు. దీనిని సాంకేతికంగా ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’ అంటారని, సదరు సందేశంలో కనిపించకుండా దాగి ఉండే హిడెన్ లింక్స్, మాల్వేర్ స్క్రిప్ట్‌లు నో అని రిప్లై ఇచ్చిన వెంటనే వాటంతట అవే యాక్టివేట్ అయి, బాధితుల మొబైల్ ఫోన్లపై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ లభిస్తుందని వివరించారు.
ఇటీవల ఈ తరహాలో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ బ్యాంకు ఖాతా నుంచి లక్షల్లో డబ్బును గుల్ల చేశారని వివరిస్తూ.. ఈ కొత్త తరహా ముప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంకు లావాదేవీల పేరుతో వాట్సాప్‌లో వచ్చే సందేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని, ఎస్ గానీ, నో గానీ ఎలాంటి బదులూ ఇవ్వకుండా తక్షణమే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి మెసేజ్‌ను డిలీట్ చేయాలని సూచించారు. ఖాతా నుంచి నగదు డెబిట్ అయిందంటూ సందేశం రాగానే భయపడిపోకుండా, నేరుగా మీ అధికారిక నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయ్యి స్టేట్మెంట్ను స్వయంగా తనిఖీ చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఏ అధికారిక బ్యాంకూ కూడా వాట్సాప్‌లో లావాదేవీల విషయంలో కస్టమర్ల నుంచి ఎస్ లేదా నో వంటి సమాధానాలను కోరదని, ఏదైనా అనుమానం ఉంటే పాస్‌బుక్ లేదా కార్డు వెనుక ఉండే అధికారిక కస్టమర్ కేర్ టోల్‌ఫ్రీ నంబర్‌కు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడాలని స్పష్టం చేశారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి మోసాల బారిన పడి నగదు కోల్పోతే, ఏమాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో తక్షణమే ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
నేరం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్‌లో సమాచారం అందిస్తే, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి నగదు వెళ్లకుండా సంబంధిత బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి రక్షించే అవకాశం ఉంటుందని సజ్జనర్ పేర్కొన్నారు.

కంగారులో ఇచ్చే ఒక్క నో సమాధానం జీవితకాల కష్టార్జితాన్ని తుడిచిపెట్టేసే ప్రమాదం ఉన్నందున పౌరులంతా వివేకంతో, అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
▶️'NO' అంటే.. బ్యాంకు ఖాతా ఖాళీ!
▶️ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు!
▶️వాట్సాప్ సందేశంతోనే క్షణాల్లో సొమ్ము స్వాహా!
▶️ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌తో కేటుగాళ్ల సరికొత్త పన్నాగం!
వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం 'NO' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా… pic.twitter.com/cTtcMmUKG2
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) October 12, 2026