- తెలంగాణలో ఎల్‌నినో డేంజర్ బెల్స్
- సాగునీళ్లు లేక ఎండిపోతున్న పంటపొలాలు
- వచ్చే వేసవిలో తాగునీటికి కూడా కష్టాలే
తెలంగాణలో ఎల్‌నినో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంపై తీవ్ర కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయంగా వాతావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ‘ఎల్‌నినో’ ప్రభావం రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రభుత్వ నీటి నిర్వహణ లోపాలు తోడవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. పొలాల్లో పంటలు ఎండిపోతుండటంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటు జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో వచ్చే వేసవి నాటికి తాగునీటికి సైతం తీవ్ర కటకట తప్పేలా లేదని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

రుతుపవనాలు ముఖం చాటేయడం ఒకవైపు.. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరోవైపు కలిసి అన్నదాతను నిలువునా ముంచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగైన వరి ప్రస్తుతం కీలకమైన పొట్ట దశకు, పత్తి కాయల దశకు చేరుకుంది. పంట చేతికొచ్చే ఈ చివరి దశలో పొలాలకు అత్యంత కీలకమైన ‘ఆఖరి తడి’ అందడం లేదు. ప్రాజెక్టుల నుంచి కాలువలకు నీరు విడుదల కాకపోవడంతో రైతులు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడ్డారు. వర్షాలు లేక భూగర్భ జలమట్టాలు పాతాళానికి పడిపోవడంతో బోర్లు కూడా పోయడం ఆగిపోయాయి.
ఎల్‌నినో కారణంగా వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు విస్తరించినా, ముసురు వానలు కాకుండా చెదురుమదురు జల్లులకే పరిమితం కావడంతో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు లక్షల రూపాయలు అప్పులు చేసి కొత్త బోర్లు వేయిస్తున్నా చుక్క నీరు రాక రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. చివరి దశలో పైర్లు ఎండిపోతుండటంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణాల్లో ఒకటి వర్షాలు వచ్చిన సరైన సమయంలో నీటిని ఎత్తిపోయడంలో అధికారులు, పాలకుల నిర్లక్ష్యమేనన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్ల కుంగుబాటు సమస్య కారణంగా అధికారులు గేట్లన్నీ ఎత్తివేశారు. వరదలు వచ్చినప్పుడు కాఫర్ డ్యామ్ కట్టి లేదా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటిని నిల్వ చేసి, కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా మిడ్‌మానేరు, ఎల్లంపల్లిలకు లిఫ్ట్ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా లక్షల క్యూసెక్కుల నికర జలాలు దిగువకు సముద్రం పాలయ్యాయి. నీటిని లిఫ్ట్ చేయాలని విపక్షాలు, వ్యవసాయ నిపుణులు మొత్తుకున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా గోదావరి జలాలు ఎటూ ఉపయోగపడకుండా వృథాగా దిగువకు సముద్రంలో కలిసిపోయాయి.
గోదావరి బేసిన్‌తో పాటు కృష్ణా బేసిన్లోనూ ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్ దిశగా వెళ్తున్నాయి. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూరు, కడెం వంటి జలాశయాల్లో డెడ్ స్టోరేజ్ స్థాయికి సమీపంలోనే నీరు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. కృష్ణా బేసిన్లో కూడా ఎగువ నుంచి ఆశించిన మేర ప్రవాహాలు రాకపోవడంతో ఆయకట్టు ఆధారిత జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సాగుచేసిన వరి ప్రస్తుతం పొట్ట దశకు చేరుకుంది, పత్తి కాయల దశలో ఉంది. ఈ కీలక సమయంలో పొలాలకు ఆఖరి తడులు అత్యవసరం. కాలువల ద్వారా నీరు విడుదల కాకపోవడం, ఎండల తీవ్రతతో పొలాలు బీటలు వారి పైర్లు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల నీరు రాకపోవడంతో రైతులు పూర్తిగా బోర్లపై ఆధారపడ్డారు. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోర్లు పోయడం ఆగిపోయాయి. అదనంగా లక్షల రూపాయలు అప్పులు చేసి కొత్త బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఇప్పటికే రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గడంతో వచ్చే వేసవి కాలం నాటికి పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. రాబోయే వేసవి కాలంలో హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ కి తాగునీరు అందించే జంట జలాశయాలతో పాటు సింగూరు, మంజీరా, నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌పై ప్రభావం పడితే గ్రేటర్ పరిధిలోనూ రేషనింగ్ తప్పకపోవచ్చు. పల్లెల్లో మిషన్ భగీరథ ఇన్-టేక్ వెల్స్ వద్ద నీరు లేక మోటార్లు నడవని పరిస్థితి తలెత్తే అవకాశముంది.
నీటి నిర్వహణలో రాజకీయ విమర్శలు, బ్లేమ్ గేమ్‌ల కంటే క్షేత్రస్థాయి వాస్తవాలు ముఖ్యం. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మేల్కొని కార్యాచరణ ప్రకటించకపోతే, తెలంగాణ మరోసారి కరువు ఛాయల్లోకి జారుకునే ప్రమాదం పొంచి ఉంది. రాజకీయ వివాదాలు, పరస్పర ఆరోపణలు పక్కనపెట్టి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉందని ఆర్థిక, సామాజిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న బ్యారేజీలు, చిన్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోసి కాలువల ఆఖరి ఆయకట్టు వరకు అందించి పంటలను రక్షించాలని సూచిస్తున్నారు. ప్రతి ప్రాజెక్టులో రాబోయే జూన్ వరకు అవసరమైన తాగునీటిని ముందుగానే కేటాయిస్తూ స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. ఇగ నీరు అందక పూర్తిగా ఎండిపోయిన పంటలను వ్యవసాయ శాఖ ద్వారా వెంటనే సర్వే చేయించి, ఎకరాకు తగిన నష్టపరిహారాన్ని ప్రకటించి అన్నదాతలను ఆదుకోవాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు మేడిగడ్డపై తక్షణ చర్యలు చేపట్టి.. మరమ్మతులు, తాత్కాలిక ఏర్పాట్లు వేగవంతం చేసి వచ్చే సీజన్‌కైనా నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సర్కార్‌కు సూచనలు చేసారు.

కాళేశ్వరం, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వద్ద నీటిని లిఫ్ట్ చేయాలంటే భారీ మొత్తంలో నిరంతర హై-వోల్టేజ్ విద్యుత్ కావాలి. రాబోయే వేసవిలో ఒకవైపు వ్యవసాయ బోర్ల రద్దీ, మరోవైపు గృహ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరనున్నాయి. ఒకవేళ ప్రాజెక్టుల్లో ఎంతోకొంత నీరున్నా, విద్యుత్ గ్రిడ్‌పై పడే ఒత్తిడి కారణంగా ఒకే సమయంలో గృహాలకు విద్యుత్ ఇవ్వాలా లేక పంపింగ్ మోటార్లు నడపాలా అనే ‘వాటర్-ఎనర్జీ నెక్సస్’ సంక్షోభం రాబోతోంది. నీటి ఎద్దడి వల్ల భూగర్భ జలాలు 200–300 అడుగుల నుంచి 600–1000 అడుగుల లోతుకు పడిపోతున్నాయి. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో లోతుకు వెళ్లేకొద్దీ నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్స్, టీడీఎస్ ప్రమాదకర స్థాయికి చేరుతాయి. గత కొన్నేళ్లుగా మిషన్ భగీరథ, ప్రాజెక్టుల వల్ల తగ్గుముఖం పట్టిన ఫ్లోరోసిస్ సమస్య, బోరు నీటిపై అతిగా ఆధారపడటం వల్ల ప్రజారోగ్యంపై మళ్లీ విరుచుకుపడే ముప్పు ఉంది.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్నామని చెబుతున్నా, దాని ఇన్‌టేక్ వెల్స్ అన్నీ ప్రాజెక్టుల ‘కనీస నీటిమట్టం’ పైనే ఆధారపడి పనిచేస్తాయి. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కి పడిపోతే, నీటిని పైకి లాగే గ్రావిటీ/మోటార్ వ్యవస్థలు పనికిరాకుండా పోతాయి. అప్పుడు పైపులున్నా నీళ్లు రాని “ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరాలసిస్” ఏర్పడుతుంది. నగరాల సంగతి అటుంచితే, మారుమూల పల్లెల్లో తాగునీటికి ట్యాంకర్లే దిక్కయ్యే పరిస్థితిని ఎవరూ బహిరంగంగా అంగీకరించడం లేదు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాడి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది. సాగునీరు లేకపోతే పచ్చిగడ్డి కొరత తీవ్రమై రైతులు పాడి పశువులను కబేళాలకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది. ఇది గ్రామీణ కుటుంబాల రోజువారీ కనీస ఆదాయాన్ని తుడిచిపెట్టే ప్రమాదం ఉంది. నీటి లభ్యత పడిపోయిన వేళ, ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులైన KRMB,GRMB పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకోవాలనే కేంద్రం/బోర్డుల ఒత్తిడి పెరుగుతుంది. తీవ్ర నీటి కొరత సమయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ప్రతి చుక్క నీటికి బోర్డు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, హైదరాబాద్ తాగునీటికి కూడా ఢిల్లీ లేదా బోర్డుల అనుమతుల కోసం వేచి చూడాల్సిన రాజ్యాంగ, పరిపాలనాపరమైన సంక్షోభం తలెత్తుతుంది.
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతంలో అనిశ్చితి, ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణ లోపాలు కలిసి రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఒకవైపు సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు, మరోవైపు అడుగంటుతున్న జలాశయాలు చూస్తుంటే రాబోయే వేసవిలో తాగునీటికి కూడా తీవ్ర కటకట తప్పేలా లేదు. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయకపోతే, తెలంగాణ తీవ్ర సాగు, తాగునీటి గండంలో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్