- సామాన్యుడిపై ‘ట్రూ-అప్’ పిడుగు
- తెలంగాణలో పెరగనున్న కరెంట్ బిల్లులు!
తెలంగాణలో సామాన్య విద్యుత్ వినియోగదారులపై కరెంటు బిల్లుల భారం మోపేందుకు రంగా సిద్ధమైంది. వ్యవసాయ రంగాన్ని మినహాయించి, మిగతా విద్యుత్ వినియోగదారులపై నవంబరు 2026 నుంచి అదనపు భారం పడనుంది. రాష్ట్రంలోని నాన్-అగ్రికల్చర్ వినియోగదారుల నుంచి ఏకంగా 5 వేల 420 కోట్ల మేర ‘ట్రూ-అప్’ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలకు అనుమతినిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నెలవారీ కరెంటు బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం 7 వేల 635.22 కోట్ల ట్రూ-అప్ రికవరీలో ఇది భాగం. ఈ మొత్తం మొత్తంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన 2 వేల 214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టనుండగా, మిగిలిన 5 వేల 420 కోట్లను రెండు విద్యుత్ పంపిణీ సంస్థలైన TGSPDCL, TGNPDCL ద్వారా అర్హులైన వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఈ వసూళ్లు నవంబరు 2026 నాటి కరెంట్ బిల్లుల నుంచి ప్రారంభమవుతాయి. మొదటి నెలలో వినియోగదారులపై యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాతి నెల నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ఛార్జ్ చేస్తారు. ఈ రికవరీ TGSPDCL పరిధిలో 29 బిల్లింగ్ నెలలు, TGNPDCL పరిధిలో 26 బిల్లింగ్ నెలల పాటు కొనసాగుతుంది.
వినియోగదారుల నుంచి రాబట్టే మొత్తంలో TGSPDCL పరిధి నుంచి 4 వేల 222 కోట్లు, TGNPDCL పరిధి నుంచి 11 వందల 97 కోట్లు ఉంటాయి. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన 2 వేల 214 కోట్లలో TGSPDCL పరిధి 14 వందల 42.49 కోట్లు కాగా, TGNPDCL పరిధి 7 వందల 72.50 కోట్లుగా ఉంది. వ్యవసాయ వాటా రికవరీ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కమిషన్ డిస్కంలను ఆదేశించింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ కొనుగోలు ట్రూ-అప్ మొత్తం 5 వేల 186 కోట్లుగా, 2023-24 నాటి రెవెన్యూ ట్రూ-అప్ మొత్తం 2 వేల 448.93 కోట్లుగా నిర్ధారించారు. ఈ రెండూ కలిపి మొత్తం 7 వేల 635.22 కోట్ల రికవరీకి ఆమోదం లభించింది.
అసలు ట్రూ-అప్ అంటే ఏమిటి? అనేది ముందు తెలుసుకుందాం. ట్రూ-అప్ అనేది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా వేసిన ఖర్చులు,ఆదాయాలకు, వాస్తవంగా జరిగిన ఖర్చులు,ఆదాయాలకు మధ్య గల వ్యత్యాసాన్ని లెక్కించి సర్దుబాటు చేసే ఒక నియంత్రణ ప్రక్రియ. విద్యుత్ రంగంలో పంపిణీ సంస్థలు తమ క్లెయిమ్‌లను విద్యుత్ నియంత్రణ మండలి ముందు ఉంచుతాయి. కమిషన్ ఈ వ్యయాలు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎంత మొత్తం వసూలు చేసుకోవచ్చో నిర్ణయిస్తుంది. ప్రస్తుత రికవరీ 2022-23 నాటి విద్యుత్ కొనుగోలు ఖర్చులు, 2023-24 నాటి ఆదాయ సర్దుబాట్లకు సంబంధించినది. అందువల్ల ఇది గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సర్దుబాటు మాత్రమే తప్ప, ఆ సంవత్సరాల కోసం జారీ చేసిన సరికొత్త టారిఫ్ ఆర్డర్ కాదు.
బిల్లులలో ట్రూ-అప్ ఛార్జీలను ప్రత్యేకంగా చూపించాలని డిస్కంలను కమిషన్ ఆదేశించింది. బిల్లులో సంబంధిత ఆర్థిక సంవత్సరం, రికవరీ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకున్న నెలవారీ వినియోగం, వర్తించే రేటును విడివిడిగా స్పష్టంగా పేర్కొనాలి. ఒక నిర్దిష్ట నెల బిల్లులో రెండు ఆర్థిక సంవత్సరాల రికవరీ ఉంటే, ఆ మొత్తాలను కూడా వేర్వేరుగానే చూపించాలి.
డిస్కంలు ఏళ్ల తరబడి క్లెయిమ్‌లను పోగుచేయకుండా, నిర్దేశిత గడువులోనే ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూ-అప్ పిటిషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని టీజీఈఆర్సీ మాజీ చైర్మన్ టి. శ్రీరంగారావు అన్నారు. పంపిణీ సంస్థల పరిపాలనాపరమైన జాప్యానికి వినియోగదారులను బాధ్యులను చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. డిస్కంలు కోరిన మొత్తాన్ని పూర్తిగా ఆమోదించాల్సిన అవసరం లేదని, వాస్తవ ఆదాయ-వ్యయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కమిషన్ ‘ట్రూ-డౌన్’ కూడా చేయవచ్చని రావు స్పష్టం చేశారు. అద్దె ఇళ్ల విషయంలో ఎదురయ్యే సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో ఉన్న అద్దెదారుడు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలను ప్రస్తుతం ఉంటున్న వారి నుంచి వసూలు చేస్తే, అది యజమానులు మరియు అద్దెదారుల మధ్య వివాదాలకు దారితీసే అవకాశం ఉందని చెప్పారు. డిస్కంలు ఏళ్ల తరబడి వేచి చూసి వేర్వేరు పిటిషన్ల ద్వారా ఆలస్యంగా రికవరీ కోరడానికి బదులుగా, సంబంధిత సంవత్సరం వార్షిక రెవెన్యూ అవసరాలలోనే తమ క్లెయిమ్‌లను చేర్చి కమిషన్ పరిశీలనకు ఉంచాలని ఆయన సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంల నుంచి భారీ ట్రూ-అప్ క్లెయిమ్‌లు వచ్చాయి. నివేదికల ప్రకారం, 2016-17 నుంచి 2022-23 మధ్య కాలంలో ట్రూ-అప్, ఉదయ్ పొదుపుల రివర్సల్ కింద దాదాపు 12 వేల 514 కోట్లను డిస్కంలు కోరాయి. ఇందులో 10 వేల 281 కోట్ల ట్రూ-అప్ క్లెయిమ్‌లు, 2 వేల 232 కోట్ల ఉదయ్ సేవింగ్స్ రివర్సల్ ఉన్నాయి.
వినియోగదారులపై భారం పడకుండా డిస్కంలకు అండగా ఉంటామని, ఆమోదించిన మొత్తాన్ని ఐదేళ్ల వ్యవధిలో చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ లేఖ ద్వారా లభించిన హామీ మేరకు, ఐదేళ్లలో వినియోగదారులపై భారం లేకుండా ప్రభుత్వం సాయం చేస్తుందన్న ప్రాతిపదికన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యాపార ట్రూ-అప్‌లను కమిషన్ ఖరారు చేసి, సంబంధిత కాలానికి రూ.9 వేల 673 కోట్లను అనుమతించినట్లు TGSPDCL వార్షిక నివేదికలో నమోదై ఉంది. ఈ నేపథ్యంలో తాజా రికవరీ నిర్ణయం—ఆలస్యమైన ట్రూ-అప్ క్లెయిమ్‌లను ఎలా పరిష్కరించాలి, ఈ ఆర్థిక భారాన్ని వినియోగదారులపై మోపాలా లేక ప్రభుత్వమే భరించాలా అనే అంశంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.
వినియోగదారులకు సంబంధించి నవంబరు 2026 నుంచి నెలవారీ కరెంట్ బిల్లులలో ట్రూ-అప్ ఛార్జీల రూపంలో తక్షణ ప్రభావం కనిపించనుంది. అయితే, సంబంధిత ఆర్థిక సంవత్సరాల్లో ఒక వినియోగదారుడి వాస్తవ వినియోగానికి ఎంత ట్రూ-అప్ వర్తిస్తుందో అంతకు మించి అదనంగా వసూలు చేయకూడదని కమిషన్ నిబంధన విధించింది.
వచ్చే నెల నవంబరు నుంచి జారీ చేసే కరెంట్ బిల్లుల నుంచే ఈ ట్రూ-అప్ వసూళ్లను ప్రారంభమవుతాయి. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి కనెక్షన్‌కు వినియోగించిన యూనిట్ల ఆధారంగా ఈ పెంపు లెక్కించనున్నారు. నవంబరు బిల్లులో వినియోగించిన ప్రతి యూనిట్‌కు 30 పైసల చొప్పున వసూలు చేస్తారు. డిసెంబరు నెల నుంచి ప్రతి యూనిట్‌కు 50 పైసల చొప్పున రాబడతారు. TGSPDCL సంస్థ పరిధిలోని వినియోగదారులు రాబోయే 29 నెలల పాటు ఈ అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక TGNPDCL సంస్థ పరిధిలోని వినియోగదారులు రాబోయే 26 నెలల పాటు ఈ భారాన్ని మోయక తప్పదు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ విధానం అమల్లో ఉన్నందున వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతులపై నేరుగా ఎలాంటి ట్రూ-అప్ ఛార్జీలు విధించరు. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2 వేల 214 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది.
కరెంట్ బిల్లుల విషయంలో వినియోగదారులకు స్పష్టత ఉండాలి. ప్రతి నెలా జారీ చేసే బిల్లులో ట్రూ-అప్ ఛార్జీని ప్రత్యేకంగా చూపించాలి. అది ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది, ఆ నెలలో వాడిన కరెంటు ఎంత, వర్తింపజేసిన యూనిట్ రేటు ఎంత అనే వివరాలను విడివిడిగా పేర్కొనాలి. సాధారణ ఛార్జీలతో ఈ ట్రూ-అప్ను ఏమాత్రం కలపకూడదని ఈఆర్సీ నిబంధన విధించింది. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు జీరో బిల్లు పొందే లబ్ధిదారులకు ప్రభుత్వం దీన్ని సబ్సిడీగా సర్దుబాటు చేయనుందా లేదా బిల్లులలో వేర్వేరుగా చూపించనుందా అనేదానిపై డిస్కంల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
చిన్న వ్యాపారుల నుంచి భారీ షాపింగ్ మాల్స్ వరకు రోజూ భారీగా లైటింగ్, ఏసీల కోసం విద్యుత్ వాడుతుంటారు. చిన్న కిరాణా దుకాణాలు, క్లినిక్, రెస్టారెంట్లు యూనిట్‌కు 50 పైసల చొప్పున నెలకు అదనంగా రూ. 750 భారం పడుతుంది. మధ్యతరహా సూపర్ మార్కెట్, హోటల్ నెలకు 10 వేల యూనిట్లు వాడితే..అదనంగా రూ. 5 వేల వరకు పెరగనుంది. ఇక భారీ మాల్స్, థియేటర్లు నెలకు 50,000 యూనిట్ల వాడకం ఉంటే.. నెలకు దాదాపు రూ. 25 వేల వరకు అదనపు భారం పడుతుంది. కరెంట్ చార్జీల మోత పారిశ్రామిక రంగంపై పెద్ద ఎఫెక్ట్ పడబోతోంది. ఉత్పత్తి వ్యయంలో విద్యుత్ కీలక పాత్ర పోషించే పరిశ్రమలపై ఈ పెంపు తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్న తరహా పరిశ్రమలు MSME – నెలకు 20,000 యూనిట్లకు అదనంగా రూ. 10,000 భారం పడుతుంది. స్టీల్, సిమెంట్, ఫార్మా లాంటి భారీ పరిశ్రమలు – నెలకు రెండు నుండి 10 లక్షల యూనిట్లు వరకు వాడకం ఉంటుంది. అంటే నెలకు లక్ష నుంచి 5 లక్షల వరకు కేవలం ట్రూ-అప్ రూపంలోనే అదనపు వ్యయం భరించాల్సి ఉంటుంది. ఇది వస్తువుల ఉత్పత్తి వ్యయాన్ని పెంచి, అంతిమంగా వినియోగదారుల పైకే ధరల భారం నెట్టే ప్రమాదం ఉంది.
రాష్ట్రంలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్ల నుంచి వేసవి/సాగు పీక్ సమయంలో 280–300 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం జరుగుతుంది. పీక్ లోడ్: గరిష్ట డిమాండ్ 14,000 మెగా వాట్ల నుంచి 15,500 మెగా వాట్లు దాటుతుంటుంది. రంగాల వారీ వినియోగం విషయానికి వస్తే.. వ్యవసాయం: 30 నుండి 35 శాతం, గృహ వినియోగం: 25% నుండి 28%, పరిశ్రమలు & వాణిజ్యం: 37% నుండి 40% వరకు వాడకం ఉంటుంది.
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అమలులో ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తూ రైతుల వాటా అయిన 2 వేల 214 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. అంటే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. రైతుల బిల్లులను ప్రభుత్వమే డిస్కంలకు సబ్సిడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే డిస్కంలు ఎదుర్కొంటున్న నగదు కొరత కారణంగా సబ్సిడీ రీయింబర్స్మెంట్ సకాలంలో జరగకపోతే సంస్థల నిర్వహణపై ప్రభావం పడుతుంది.
గ్రామాల్లో 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన త్రీ-ఫేజ్ విద్యుత్ అందుతోందా లేదా అనేది తరచూ చర్చనీయాంశమవుతోంది. ట్రాన్స్ఫార్మర్ల ఓవర్‌లోడ్, లో-వోల్టేజీ సమస్యలు, అప్రకటిత కోతలు క్షేత్రస్థాయిలో రైతులకు సవాళ్లుగా మిగులుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని మినహాయించినప్పటికీ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు తమపై పడిన ఈ ట్రూ-అప్ భారాన్ని నిత్యావసర సరుకులు, సేవల ధరలు పెంచడం ద్వారా రికవరీ చేసుకుంటాయి. అంటే అంతిమంగా ఆ భారం మళ్లీ సామాన్యుడి జేబుపైనే పరోక్షంగా పడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’పథకం లబ్ధిదారులపై ట్రూ-అప్ ఛార్జీల ప్రభావం ఎలా ఉంటుందనే అంశం పూర్తిగా వారి నెలవారీ వినియోగం, జీరో బిల్లింగ్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. గృహజ్యోతి పథకం నిబంధనల ప్రకారం, నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే అర్హులైన కుటుంబాలకు బిల్లు మొత్తం ‘జీరో’ వస్తుంది. ట్రూ-అప్ ఛార్జీలు విధించినప్పటికీ, ఆ యూనిట్లకు సంబంధించిన విద్యుత్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ట్రూ-అప్ మొత్తాన్ని ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ రీయింబర్స్మెంట్ రూపంలో భరించాల్సి ఉంటుంది. ఈఆర్సీ నిబంధనల ప్రకారం బిల్లులో ట్రూ-అప్ ఛార్జీని ప్రత్యేకంగా చూపించినా, ‘గృహజ్యోతి సబ్సిడీ డిస్కౌంట్’ కింద అది మైనస్ అయి అంతిమంగా చెల్లించాల్సిన మొత్తం సున్నాగానే ఉండే అవకాశం ఉంది.
గృహజ్యోతి పథకంలో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే—ఒక నెలలో వినియోగం 200 యూనిట్లు దాటితే ఆ పథకం వర్తించదు. ఆ నెల మొత్తం యూనిట్లకు సాధారణ టారిఫ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగం 201 యూనిట్లు దాటిన వెంటనే గృహజ్యోతి సబ్సిడీ పోతుంది, పైగా మొత్తం యూనిట్లకు సాధారణ ఛార్జీలతో పాటు ట్రూ-అప్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి వస్తుంది. సాధారణ విద్యుత్ ఛార్జీలతో పాటు ట్రూ-అప్ అదనంగా పడుతుంది. గృహజ్యోతి లబ్ధిదారుల ట్రూ-అప్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే సబ్సిడీ కింద డిస్కంలకు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా మరికొన్ని వందల కోట్ల ఆర్థిక భారం పడుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోతే డిస్కంలకు నగదు కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
గృహజ్యోతి పథకం వర్తించని గృహాలకు ప్రతి యూనిట్‌పై ట్రూ-అప్ ఛార్జీలు నేరుగా బిల్లులో అదనపు భారాన్ని మోపుతాయి. లైట్లు, ఫ్యాన్లు మాత్రమే ఉండే చిన్న ఇల్లు 50 యూనిట్లు వినియోగిస్తే.. నవంబర్‌లో 30పైసల చొప్పున 15 రూపాయలు.. డిసెంబర్లో 50 పైసల చోప్పున 25 రూపాయల భారం పడుతుంది. ఇక, సింగిల్ డోర్ ఫ్రిజ్, టీవీ, ఫ్యాన్లు ఉండే ఇల్లు 100 యూనిట్ల వాడకం ఉంటే.. నవంబర్‌లో 30, డిసెంబర్లో 50 రూపాయల భారం పడబోతోంది. మల్టిపుల్ ACలు, ఇన్వర్టర్లు ఉన్న పెద్ద ఇల్లు 600 యూనిట్లు వాడితే.. దాదాపు 400 రూపాయల భారం పడుతుంది.
డిస్కంల వారీగా రికవరీ గడువు పూర్తయ్యే వరకు ఈ మొత్తం క్రమం తప్పకుండా బిల్లులో చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర డిస్కం పరిధిలో నెలకు 200 యూనిట్లు వాడే వినియోగదారుడికి మొత్తం భారం దాదాపు 12 వందల 60 రూపాయలు. నెలకు 400 యూనిట్లు వాడే వినియోగదారుడికి మొత్తం భారం: దాదాపు 2 వేల 520 రూపాయలు. ఇగ, దక్షిణ డిస్కం పరిధిలో నెలకు 200 యూనిట్లు వాడే వినియోగదారుడికి మొత్తం దాదాపు 14 వందల భారం పడనుండగా.. నెలకు 400 యూనిట్లు వాడే వినియోగదారుడికి మొత్తం 2 వేల 8 వందల రూపాయల భారం పడుతుంది. సాధారణ టారిఫ్ ప్రకారం ఎనర్జీ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, విద్యుత్ డ్యూటీ యథావిధిగా ఉంటాయి. వాటి కింద ప్రత్యేక వరుసలో వినియోగించిన మొత్తం యూనిట్లను ప్రస్తుత రేటుతో గుణించి ప్రత్యేకంగా చూపిస్తారు.
సామాన్యుడి కోణంలో చూస్తే ఇది కేవలం యూనిట్‌కు 30 లేదా 50 పైసల పెంపు మాత్రమే కాదు; నెల నెలా బడ్జెట్‌ను కుదిపేసే నిశ్శబ్ద భారం. గతంలో ఎప్పుడో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, నిర్వహణ లోట్లను ఏళ్ల తరబడి పోగేసి, చివరకు ఆ నెపాన్ని ‘ట్రూ-అప్’ పేరుతో నేరుగా సామాన్యుడి జేబుపై మోపడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్న వినియోగదారుల్లో మొదలైంది.

ఒకవైపు ఉచిత పథకాలు, రాయితీల ప్రకటనలు వినిపిస్తున్నా, మరోవైపు ఏదో ఒక రూపంలో బిల్లులు తడిసిమోపెడవుతుండటం మధ్యతరగతి గృహాలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. నెలకు 200–300 యూనిట్లు దాటితే చాలు, ఎలాంటి సబ్సిడీ దక్కకపోగా, ఈ అదనపు ఛార్జీలు మరో రెండున్నరేళ్ల పాటు ప్రతి నెలా వెన్నాడుతూనే ఉంటాయి. ఇక అద్దె ఇళ్లలో ఉండేవారికి పాత అద్దెదారు వాడిన కరెంటుకు ఇప్పటివారు మూల్యం చెల్లించాల్సి రావడం గృహస్తులు, యజమానుల మధ్య కొత్త తగాదాలకు ఆజ్యం పోస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలపై పడే ట్రూ-అప్ ఛార్జీలు అంతిమంగా నిత్యావసరాలు, సేవల ధరల రూపంలో మళ్లీ సామాన్యుడి మీదే పడతాయి. పంపిణీ సంస్థల పరిపాలనా వైఫల్యాలు, ఆలస్యపు లెక్కలకు ప్రతి నెలా కరెంట్ బిల్లు కట్టే సాధారణ పౌరుడే బలిపశువు కావాల్సి రావడం విద్యుత్ సంస్కరణల పారదర్శకతనే ప్రశ్నార్థకం చేస్తోంది.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్