హనుమంతుడి’ పవర్ గేమ్ !

హనుమంతుడి’ పవర్ గేమ్!

తెలంగాణ రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు! ఒకరోజు డైలాగులు.. మరోరోజు వ్యూహాలు. ఇప్పుడు సంగారెడ్డి కేంద్రంగా నడుస్తున్న పాలిటిక్స్ రాష్ట్రవ్యాప్తంగా సెగలు పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరంలేని నాయకుడు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో ఆయనో ఫైర్ బ్రాండ్ లీడర్‌. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉండే మాస్ లీడర్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న తరుణంలో, జగ్గారెడ్డి వ్యవహారశైలి కేవలం ఒక సాధారణ నాయకుడి ప్రవర్తనలా కనిపించదు. గాంధీ కుటుంబానికి హనుమంతుడిలాంటి లాయల్ సోల్జర్ జగ్గారెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్‌గానే సర్టిఫికెట్ ఇచ్చేశారు. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి.. కానీ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ జగ్గారెడ్డి వేసే ప్రతి అడుగు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. 2004 నుంచి నిలకడైన రాజకీయాలు చేస్తూ వస్తున్న ఆయన.. ‘నవంబర్‌లో నా నిర్ణయం చెబుతా’ అంటూ వదిలిన సస్పెన్స్ బాంబ్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సరిగ్గా ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి.. జగ్గారెడ్డిని ఏకంగా హనుమంతుడితో పోల్చడం, ఆయన జోలికి వస్తే ఊరుకోమంటూ మాస్ వార్నింగ్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? పదవులు వస్తాయి పోతాయి.. కానీ తెలంగాణ పాలిటిక్స్‌లో జగ్గారెడ్డి మార్క్ గేమ్ ఏంటి? నమ్ముకున్న జెండా కోసం నిలబడుతున్న జగ్గారెడ్డి మనసులో అసలు ఏముంది? నవంబర్‌లో ఆయన తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి? సంగారెడ్డి కాంగ్రెస్‌లో ఇప్పుడు ఈ ప్రశ్నలే హాట్‌టాపిక్‌గా మారాయి.

ఇప్పటివరకు జగ్గారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఒకసారి ఒకలా.. మరోసారి మరోలా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. ఒక దశలో ఇక ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల జగ్గారెడ్డిని బరిలోకి దింపుతానని ప్రకటించారు. ఆ తర్వాత నవంబర్‌లో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేస్తానంటూ మరోసారి సస్పెన్స్ కొనసాగించారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొత్తం సీన్‌ను మార్చేశాయి.“రాహుల్ గాంధీ రాముడైతే.. జగ్గారెడ్డి నాకు హనుమంతుడి లాంటి వారు” అని రేవంత్ వ్యాఖ్యానించడమే కాకుండా, జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రశంసలా కనిపించినా.. కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఒక కీలక సంకేతంగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.

సంగారెడ్డితో జగ్గారెడ్డికి ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది. 2004 నుంచి ఎన్నికల రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జగ్గారెడ్డి, గత కొంతకాలంగా తన భవిష్యత్తు కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. జగ్గారెడ్డి మళ్లీ సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారా? లేక ఆయన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డిని బరిలోకి దింపుతారా? ఇటీవల సంగారెడ్డిలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. జగ్గారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని సంగారెడ్డి నుంచే మొదలుపెట్టారు. 2004లో టీఆర్ఎస్‌ తరపున గెలిచినా… అనంతరం 2009లో కాంగ్రెస్ తరఫున సంగారెడ్డి నుంచి విజయం సాధించారు. 2014లో మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. 2018లో పరిస్థితి మారింది. అదే చింతా ప్రభాకర్‌పై జగ్గారెడ్డి 76,572 ఓట్లతో గెలిచి మళ్లీ ఎమ్మెల్యేగా నిలిచారు. కానీ 2023లో మరోసారి చింతా ప్రభాకర్ విజయం సాధించారు. అయితే ఓటమి తర్వాత కూడా సంగారెడ్డిలో జగ్గారెడ్డి రాజకీయంగా యాక్టివ్‌గానే ఉన్నారు. 2026 మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఆయన సంగారెడ్డిలో కాంగ్రెస్ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారు. అంటే గెలిచినా.. ఓడినా.. జగ్గారెడ్డి రాజకీయ చిరునామా మాత్రం సంగారెడ్డిగానే కొనసాగుతోంది.

జగ్గారెడ్డి గతంలో ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని, సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల జగ్గారెడ్డిని పోటీ చేయిస్తానని ప్రకటించారు. అంతేకాదు, తన రాజకీయ భవిష్యత్తుపై నవంబర్‌లో స్పష్టత ఇస్తానని కూడా చెప్పారు. తాను సంగారెడ్డి నుంచే కాకుండా, పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే సిద్దిపేట లాంటి స్థానాల నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధమేనని ఆయన గతంలో సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తే పరిస్థితి మరో కోణంలో కనిపిస్తోంది. జగ్గారెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్న నాయకుడైతే.. సీఎం స్థాయిలో “రాహుల్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తారు” అనే వ్యాఖ్య ఎందుకు వస్తుంది? అంటే కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి భవిష్యత్తుపై చర్చ ఇంకా పూర్తికాలేదన్న సంకేతం ఇందులో కనిపిస్తోంది.

జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచే పోటీ చేయాలా? మరో నియోజకవర్గానికి వెళ్లాలా? లేక ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ బాధ్యతలు చేపట్టాలా? అనే విషయంలో తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానానిదేనని రేవంత్ స్పష్టత ఇచ్చారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల మధ్య ఉన్న సుదీర్ఘ రాజకీయ సాన్నిహిత్యం, ఇద్దరి మధ్య బంధం స్పష్టమవుతుంది. పార్టీలో ఎలాంటి విభేదాలు ఉన్నా, అధిష్టానం లెవెల్‌లో సర్దుబాట్లు జరుగుతాయని, జగ్గారెడ్డి ప్రాధాన్యత పార్టీకి తెలుసని చెప్పకనే చెప్పారు. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకమైన సైనికుడిగా జగ్గారెడ్డిని అభివర్ణించడం ద్వారా ఆయనకు పార్టీలో ఉన్న ట్రబుల్ షూటర్ ఇమేజ్‌ను మరోసారి హైలైట్ చేశారు.

ఒక నియోజకవర్గంలో గెలుపు–ఓటములు సహజమే. కానీ పార్టీకి అవసరమైన సమయంలో రాజకీయంగా మాట్లాడగలిగే నాయకులు కాంగ్రెస్‌లో ఎక్కువమంది లేరన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి నాయకుడిని కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం చేయాలా? అనే ప్రశ్న కూడా కాంగ్రెస్‌లో ఉండొచ్చు. అందుకే జగ్గారెడ్డికి భవిష్యత్తులో రాష్ట్రస్థాయి పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. సంగారెడ్డిలో ప్రస్తుతం నడుస్తున్నది కేవలం టికెట్ సస్పెన్స్ కాదు.. జగ్గారెడ్డి పొలిటికల్ రోల్‌పై జరుగుతున్న పెద్ద వ్యూహాత్మక కసరత్తు. ఆయన ఆశించే పదవులు లేదా నామినేటెడ్ పదవుల విషయంలో హైకమాండ్ రాబోయే కాలంలో సముచిత స్థానం కల్పించే అవకాశాలున్నాయి. జగ్గారెడ్డి రాజకీయ శైలి ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. సొంత పార్టీలో గళం వినిపించినప్పటికీ, అవసరమైనప్పుడు కేడర్‌ను మోటివేట్ చేయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. రేవంత్ రెడ్డితో ఆయన ఉన్న సఖ్యత, హైకమాండ్‌తో ఉన్న సంబంధాలు రాబోయే రోజుల్లో ఆయనకు మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సీనియర్లకు తగిన గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తి తెరపైకి వస్తుంటుంది. సరిగ్గా ఈ తరుణంలో జగ్గారెడ్డి వేసే ప్రతి అడుగు పార్టీలో చర్చకు దారితీస్తుంది. పదవి వచ్చినా, రాకపోయినా తనకంటూ ఒక సపరేట్ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు అంతకంటే ఉండరు అంటారు.. కానీ ఇక్కడ ‘దోస్తీ’ అస్త్రంతో ప్రత్యర్థులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నారు రేవంత్, జగ్గారెడ్డి జోడీ! నవంబర్ సస్పెన్స్‌తో పొలిటికల్ థ్రిల్లర్ నడిపిస్తున్న జగ్గారెడ్డి మైండ్‌లో ఏముందో ఎవరికీ అంతుచిక్కకపోయినా.. టైమ్ వస్తే తెరవెనుక జరిగే పవర్ గేమ్‌లో కిక్కే వేరుంటుందని ఈ పరిణామాలు మరోసారి నిరూపించాయి. రాజకీయ రంగుల రాట్నంలో ఎవరి పాత్ర ఎప్పుడు మారుతుందో అంచనా వేయడం కష్టం. పదవులు శాశ్వతం కాకపోవచ్చు, కానీ పాలిటిక్స్‌లో లాయల్టీకి ఉండే పవరే వేరు! మొత్తానికి.. తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో ఈ ‘హనుమంతుడి’ జాతకం ఎలా మారుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి! ఈ పవర్ ప్యాక్డ్ రాజకీయం మున్ముందు ఎటువంటి సంచలనాలకు కేరాఫ్ నిలుస్తుందో కాలమే డిసైడ్ చేయాలి!

 

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్