ఇడుపు కాయితానికి ‘ఇడుపు కాగితం’ ఎప్పుడు?

‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? సినిమా టైటిల్ చుట్టూ ఎందుకు రేగింది వివాదం? భాషను అర్థం చేసుకోకుండా చేసే విమర్శలు ఎంతవరకు సమంజసం? ఒక సినిమా విడుదల కాకముందే దాని కథ కాదు… హీరో కాదు… దర్శకుడు కాదు… కేవలం టైటిల్ మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తే, ఆ పేరులో ఏదో ప్రత్యేకత ఉందని అర్థం. ప్రస్తుతం అలాంటి చర్చకు కారణమైన సినిమా “ఇడుపు కాయితం”.

తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు ఈ పేరును తెలంగాణ భాషా సంస్కృతికి ప్రతీకగా స్వాగతిస్తుంటే, మరికొందరు “ఇది తెలుగేనా?”, “దీన్ని ఆంధ్రలో విడుదల చేస్తే తెలుగులో డబ్బింగ్ కూడా చేస్తారా?” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఒక సినిమా టైటిల్ చుట్టూ మొదలైన చర్చ, భాష–మాండలికం–ప్రాంతీయత వరకు వెళ్లింది.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు తరచూ ఉపయోగించే పదబంధాల్లో “ఇడుపు కాయితం” ఒకటి. సాధారణ తెలుగు భాషలో దీని అర్థం “విడాకుల పత్రం” లేదా “విడాకుల కాగితం”. పూర్వం గ్రామ పంచాయతీలు, కుల పెద్దల సమక్షంలో భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ నిర్ణయాన్ని ఒక కాగితంపై రాసి ఇరువర్గాల అంగీకారంతో ఇచ్చే ఆనవాయితీ ఉండేది. అదే కాలక్రమంలో తెలంగాణ మాండలికంలో **”ఇడుపు కాయితం”**గా ప్రసిద్ధి చెందింది. అంటే ఇది కొత్తగా పుట్టిన పదం కాదు; దశాబ్దాలుగా గ్రామీణ జీవితంలో వినిపిస్తున్న పదం. భాషా శాస్త్రవేత్తలు కూడా ఒక విషయాన్ని చెబుతుంటారు. మాండలిక భాషల్లో ఒకే భావానికి ప్రాంతాన్ని బట్టి వేర్వేరు పదాలు ఉండటం సహజం. అందువల్ల “ఇడుపు కాయితం” అనే పదాన్ని తెలియకపోవడం తప్పు కాదు; కానీ అది తెలుగు కాదని కొట్టిపారేయడం మాత్రం సరైన దృక్పథం కాదు.

“ఇడుపు కాయితం” చిత్రంలో హీరోగా ప్రియదర్శి, హీరోయిన్‌గా నాగదుర్గ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ నిర్మిస్తుండగా, సుకుమార్ తన Sukumar Writings బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోంది. సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైన తర్వాత టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణ యాస తెలియని కొందరు నెటిజన్లు “ఇది తెలుగు పదమేనా?”, “ఆంధ్ర ప్రేక్షకులకు అర్థమవుతుందా?”, “దీన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేస్తారా?” అంటూ వ్యంగ్య పోస్టులు పెట్టారు. అక్కడి నుంచి ఈ చర్చ క్రమంగా ప్రాంతీయత కోణంలోకి వెళ్లింది. ఒక వర్గం తెలంగాణ మాండలికాన్ని కించపరిచే ప్రయత్నమని ఆరోపిస్తే, మరో వర్గం టైటిల్‌పై తమ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశామని వాదించింది.

ఈ వివాదంపై కె. కవిత స్పందించడం చర్చను మరింత వేడెక్కించింది. “ఇడుపు కాయితం అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ గారిని అడిగితే చెబుతారు” అని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాత సినిమా టైటిల్ చర్చ కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అనుకూల–ప్రతికూల వాదనలు వేగంగా వ్యాపించాయి. ఈ వివాదంపై సీనియర్ నటుడు నరేష్ స్పందిస్తూ, “ఇది ఒక సినిమా టైటిల్ మాత్రమే. దాన్ని సినిమాగానే చూడాలి. ‘కాంతార’, ‘కరుప్పు’ వంటి ప్రాంతీయ పదాలతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. మరి తెలంగాణ పదం ఉన్న టైటిల్‌కు ఎందుకు అభ్యంతరం?” అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యల్లో ప్రధాన సందేశం ఒక్కటే—ప్రాంతీయ భాషలను చిన్నచూపు చూడకూడదు.

తెలుగు భాష ఒక్కటే అయినా, దాని రూపాలు ఎన్నో. శ్రీకాకుళం యాస ఒకలా ఉంటుంది. గోదావరి జిల్లాల పదజాలం మరోలా ఉంటుంది. రాయలసీమ పలుకుబడి వేరు. తెలంగాణ మాండలికం ఇంకోలా ఉంటుంది. “వచ్చాడు” అనే పదాన్ని ఎక్కడో “ఒచ్చిండు” అంటారు. “వెళ్లాడు”ని “పోయిండు” అంటారు. “విడాకులు”ని “ఇడుపు కాయితం” అంటారు. ఇవన్నీ తెలుగు భాషలోని వైవిధ్యాలే. మాండలికం అంటే భాషకు అలంకారం. అది లోపం కాదు.  విమర్శ అవసరం… అవహేళన కాదు. ఒక సినిమా టైటిల్ నచ్చకపోతే విమర్శించవచ్చు. కథపై సందేహాలు వ్యక్తం చేయవచ్చు. కానీ ఒక ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న పదాన్ని ఎగతాళి చేయడం సరైన పద్ధతి కాదు. ఈ రోజు తెలంగాణ పదాన్ని ఎగతాళి చేస్తే, రేపు రాయలసీమ పదాన్ని ఎవరైనా చేస్తారు. మరోరోజు ఉత్తరాంధ్ర యాసను ఎవరైనా లక్ష్యంగా చేసుకోవచ్చు. అలా చేస్తూ పోతే చివరికి మనమే మన భాషను చిన్నచూపు చూసిన వారమవుతాం.

“దేశభాషలందు తెలుగు లెస్స” అని గర్వంగా చెప్పుకునే మనం, ముందుగా తెలుగు భాషలోని అన్ని మాండలికాలను గౌరవించడం నేర్చుకోవాలి. ఇడుపు కాయితం అనే పదం తెలంగాణకు చెందినదైనా, అది కూడా తెలుగు భాషలో భాగమే. భాష మనల్ని విడదీయడానికి కాదు… కలపడానికి. యాస మన గుర్తింపు… విభేదానికి కారణం కాదు. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా—ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన పలుకుబడి ఉంటుంది. ఆ వైవిధ్యాన్ని గౌరవించగలిగితేనే తెలుగు భాష గొప్పతనం మరింత పెరుగుతుంది.

– జగదీష్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్