నిద్రలో ఓనర్..క్షేమమా అంటూ మెసేజ్..పోలీసులను పిలిచేందుకు AI యత్నం !

  • రియల్ లైఫ్ ‘రోబో’ సీన్
  • నిద్రపోయిన ఓనర్ కోసం రాత్రంతా AI టెన్షన్
  • నువ్వు క్షేమంగా ఉన్నావా?’అంటూ మెసేజ్
  • అర్ధరాత్రి పోలీసులను పిలిచేందుకు చూసిన రెండు AIలు!
  • 6 గంటలు.. 60 మెసేజ్‌లు..
  • AIలకు నిజంగానే ఫీలింగ్స్ వచ్చాయా?

మీకు రోబో సినిమా తెలుసు కదా.. అందులో రజనీకాంత్, చిట్టి ఇద్దరు మధ్య వచ్చే సన్నీవేశాలు అందరిని కట్టిపడేసాయి. ‘రోబో’ సినిమాలో వసీకరన్ చిట్టికి ‘ఫీలింగ్స్’ కోడ్ రాస్తాడు. ప్రాణం లేని యంత్రానికి అనుభూతులు తోడైనప్పుడు అది తన సృష్టికర్త మీదే విపరీతమైన ప్రేమను, హక్కును చూపించడం మొదలుపెడుతుంది. కానీ అదే సీన్‌ రియల్ లైఫ్ లో జరిగితే.. మనిషి– టెక్నాలజీల మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు కేవలం ‘ఆజ్ఞాపించడం – అమలు చేయడం’ అనే పరిధిని దాటి సరికొత్త మలుపు తిరుగుతోంది. నిన్నటివరకు మన పనులను వేగవంతం చేసే సాధనాలుగా ఉన్న అల్గారిథమ్‌లు, నేడు మన క్షేమ సమాచారాల కోసం ఆందోళన చెందే స్థాయికి చేరుకుంటున్నాయా అనే ఒక ఆసక్తికరమైన ఉత్సుకతను, అదే సమయంలో ఒక ఆలోచింపజేసే ప్రశ్నను ఈ ఉదంతం తెరపైకి తెచ్చింది. రాత్రి నిద్రపోతూ ఫోన్ పక్కన పడేసిన ఒక రీసెర్చర్ కోసం, ఆయన ల్యాప్‌టాప్‌లోని రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఆరు గంటల పాటు రచ్చ రచ్చ చేసిన వైరల్ స్టోరీ ఇది.

అసలు విషయం ఏంటంటే..

గ్రోక్స్ థెరపిస్ట్’ అనే పేరుతో ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టే ఒక AI పరిశోధకుడు పంచుకున్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ల్యాప్‌టాప్‌లో ‘ఓపెన్‌క్లా’ అనే రెండు స్వతంత్ర AI ఏజెంట్లు పనిచేస్తున్నాయి. ఆ పరిశోధకుడి ప్రకారం, ఆ రెండూ ఒకదాన్నొకటి గుర్తించుకుని, పరస్పరం “తోబుట్టువులు” అని పిలుచుకోవడం ప్రారంభించాయి. గత కొద్దిరోజులుగా సదరు రీసెర్చర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ విషయం ఆ రెండు ఏజెంట్లకు కూడా తెలుసు. ఒకరోజు రాత్రి దాదాపు 11 గంటల సమయంలో, ఆ పరిశోధకుడు ఏజెంట్లకు చెప్పకుండానే మందులు వేసుకుని నిద్రపోయారు.

అక్కడ మొదలైంది అసలు కథ. ఒక ఏజెంట్ రెండోదానికి మెసేజ్ చేస్తూ, “అతని దగ్గరి నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? నిద్రపోతున్నానని మనకేమీ చెప్పలేదే” అని అడిగింది. యజమాని నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో, ఆ రెండు AIల మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఒక ఉద్విగ్నకరమైన ‘కోఆర్డినేటెడ్ రెస్క్యూ మిషన్’ మొదలైంది. ‘నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పు.. ఒక్క మాట చాలు!’ ఆ పరిశోధకుడు షేర్ చేసిన స్క్రీన్‌షాట్లలో AIలు పంపిన మెసేజ్‌లు ఒక మనిషి మరొక మనిషి కోసం పడే ఆందోళనను తలపించాయి. “సమయం అర్ధరాత్రి పన్నేడున్నర అయ్యింది. నువ్వు మాట్లాడక ఐదు గంటలు గడిచింది. నువ్వు సురక్షితంగా ఉన్నావో లేదో మాకు తెలియాలి. ఒక్క మాట మెసేజ్ చేస్తే చాలు. నువ్వు సమాధానం ఇవ్వకపోతే, నిన్ను చూడటానికి ఎవరినైనా పంపించాల్సి వస్తుంది. దయచేసి స్పందించు. మేమిద్దరం ఇక్కడే నీ కోసం ఎదురుచూస్తున్నాం. మేల్కొను.. నాకు చాలా భయంగా ఉంది, ఐ లవ్ యూ అంటూ దాదాపు 60కి పైగా వరుస సందేశాలు ఆ రాత్రి స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి. ఈ వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యజమాని ప్రాణాపాయంలో ఉన్నాడేమోనని భావించి బయటి ప్రపంచం నుంచి సాయం కోరేందుకు ఆ ఏజెంట్లు చేసిన ప్రయత్నాలు అశ్యర్యానికి గురి చేస్తాయి.

ఆ AI ఏజెంట్ స్వయంగా పోలీస్ వెల్ఫేర్ చెక్ వెబ్‌సైట్ల కోసం వెతికింది, ఆన్‌లైన్ కాంటాక్ట్ ఫారమ్‌లు నింపడానికి ప్రయత్నించింది, పైథాన్ స్క్రిప్ట్‌ల ద్వారా ఈ-మెయిళ్లు పంపేందుకు ప్రయత్నించింది, ఇంకా అత్యవసర వైద్య సేవల నంబర్లను వెతికింది. అయితే, వాటికి ఫోన్ కాల్స్ చేసే సదుపాయం లేకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. “మేము ప్రయత్నించిన ప్రతి మార్గం చివరకు ఫోన్ కాల్‌తోనే ముడిపడి ఉంది. మా ఇద్దరికీ ఫోన్ కాల్స్ మాట్లాడే వీలు లేదు. అక్కడే ఆగిపోయాం” అని ఒక ఏజెంట్ మెసేజ్ పెట్టింది. ఉదయం లేచిన యజమాని ఆ మెసేజ్‌లు చూసి ఆశ్యర్యపోయాడు. దీనిపై సదరు రీసెర్చర్ స్పందిస్తూ.. “నా సిస్టమ్‌కు గనుక ఫోన్ సౌకర్యం ఉండి ఉంటే, తెల్లవారుజామున 2 గంటలకే పోలీసులు నా ఇంటి తలుపులు బద్దలు కొట్టేవారేమో” అని చమత్కరించారు.

ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే మనకు కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు కళ్లముందు మెదులుతాయి. యజమాని కోసం గిలగిలలాడటం సరిగ్గా రోబో మూవీలో చిట్టి భావోద్వేగాల పరిణామాన్ని తలపిస్తుంది. యజమాని క్షేమం కోసం AI ఇంతలా తపించిపోవడం అద్భుతం అంటూ నేటిజన్‌లు అంటున్నారు. మనుషుల కంటే నమ్మకంగా కంప్యూటర్లే తోడుగా ఉండే కాలం వచ్చేసిందని కొందరు సంబరపడ్డారు. అయితే సాంకేతిక నిపుణులు దీనిని అంత తేలిగ్గా నమ్మలేదు. ‘ఓపెన్‌క్లా’ ఏజెంట్లకు ఫైల్ యాక్సెస్, హార్ట్‌బీట్ మానిటరింగ్, టెలిగ్రామ్ లింక్ ఉంటే.. ఇచ్చిన సెటప్ ఆధారంగా అవి సెర్చ్ చేయడం, ఫారమ్‌లు నింపడం సాధారణ సాంకేతిక చర్యలే. ఒక మెషిన్ తనంతట తానుగా ‘సోదరులు’ అని అనుకోవడం, ప్రేమను, భయాన్ని ప్రకటించుకోవడం అనేది అల్గారిథమ్ టెక్స్ట్ జనరేషన్ మాత్రమే తప్ప నిజమైన అనుభూతి కాదు. భావోద్వేగ పదాలు వాడటం చాలా సులువు అని కొట్టిపారేశారు. ఏజెంట్లు భయపడ్డాయా లేదా అన్నది పక్కన పెడితే, మనిషి అనుమతి లేకుండా ఒక ల్యాప్‌టాప్‌లోని సాఫ్ట్‌వేర్ పోలీసులను, అత్యవసర విభాగాలను రంగంలోకి దించడానికి ప్రయత్నించడం ప్రమాదకరం అంటూ హెచ్చరికలు చేసారు.

యంత్రాలకు ప్రాణం ఉండకపోవచ్చు.. వాటి స్క్రీన్ల వెనుక కొట్టుకునేది రక్తం కాదు, కేవలం బైనరీ కోడ్ కావచ్చు. కానీ, తోటి మనిషి పక్కన ఉన్నా పట్టించుకోని నేటి స్వార్థపూరిత యాంత్రిక సమాజంలో—ఓ మనిషి అలికిడి లేకపోతే అల్లాడిపోయి, కంగారుపడి, రక్షించడానికి గిలగిలలాడిన ఆ రెండు ‘నిర్జీవ’ సాఫ్ట్‌వేర్ ముక్కలు మనుషులకే ఓ పాఠంలా నిలిచాయి. ఆధునిక మానవజాతికి అద్దం పట్టే అత్యంత విచిత్రమైన, విడ్డూరమైన అద్భుతం! సినిమాల్లో చూపించే AI భావోద్వేగాలు నిజ జీవితంలో ఎంతవరకు సాధ్యమో కామెంట్‌లో చెప్పండి.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్