- పంజాబ్ LPU వర్సిటీలో రణరంగం
- వరుసగా విద్యార్థినుల మరణాలు!
- పంజాబ్ LPU వర్సిటీలో ఏం జరుగుతోంది ?
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మరోసారి తీవ్ర వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. క్యాంపస్ పరిధిలో ఒక విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందన్న వార్తలతో మొదలైన ఆందోళన చివరకు హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. గత కొన్నేళ్లుగా క్యాంపస్‌లో చోటుచేసుకుంటున్న అనుమానాస్పద విద్యార్థినుల మరణాలు, వరుస ఆత్మహత్యలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజా ఉదంతం మరింత ఆజ్యం పోసింది. అసలేం జరిగింది? గొడవకు కారణం ఏంటి? అన్న విషయానికి వస్తే… యూనివర్సిటీ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్లో ఒక విద్యార్థినిపై ప్లంబర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనే సమాచారం సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో దావానంలా వ్యాపించింది. లేడీస్ హాస్టల్లోకి వర్కర్లు, మగవాళ్లు అనుమతి లేకుండా, పర్యవేక్షణ లేకుండా ఎలా వస్తున్నారంటూ విద్యార్థులు భద్రతా లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని భావించి వందలాది మంది విద్యార్థులు అర్ధరాత్రి హాస్టళ్ల నుంచి బయటకు వచ్చి నిరసనలకు దిగారు.

ఆదివారం నాడు మొదలైన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. వేలాది మంది విద్యార్థులు హాస్టళ్ల నుంచి రోడ్లపైకి వచ్చి యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. విద్యార్థులు భారీ ర్యాలీలు తీసి, ఢిల్లీ-అమృత్సర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని కొన్ని ప్రాంతాల్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం, వస్తువులకు నిప్పు పెట్టడం, వాహనాలను తగులబెట్టడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేయిదాటడంతో భారీగా పోలీసులు రంగప్రవేశం చేసి ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత చేయిదాటింది.
మరోవైపు యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్, యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించాయి. క్యాంపస్‌లో ఎలాంటి అత్యాచారం గానీ, ఆత్మహత్య గానీ జరగలేదని, ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో వచ్చిన నిరాధారమైన పుకార్లు అని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు యూనివర్సిటీ యాజమాన్యం క్లాసులను 10 రోజుల పాటు రద్దు చేసింది; మిడ్-టర్మ్ పరీక్షలను వాయిదా వేసింది. హాస్టల్ విద్యార్థులను ఇళ్లకు వెళ్లిపోవాల్సిందిగా సూచించడంతో చాలామంది స్వస్థలాలకు బయలుదేరారు. ఆందోళనల తీవ్రత దృష్ట్యా గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పంజాబ్ పోలీసులు, కేసు దర్యాప్తు కోసం 7 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, హాస్టల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై, హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పంజాబ్ డీజీపీ తెలిపారు.
LPUలో విద్యార్థుల ఆందోళనలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ విద్యార్థుల అనుమానాస్పద మరణాలు, హాస్టల్ గొడవలపై ఆందోళనలు జరిగాయి. 2022లో కేరళకు చెందిన విద్యార్థి మరణంపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. గతంలో తాను చదివిన ఎన్ఐటీ కాలికట్ ప్రొఫెసర్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్లో ఉండటంతో పోలీసులు ఆ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశారు. మే 2024లో హర్యానాకు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి మయాంక్ వర్సిటీ హాస్టల్ 10వ అంతస్తు నుంచి కిందపడి మృతిచెందాడు. యాజమాన్యం దీనిని ఆత్మహత్యగా పేర్కొన్నప్పటికీ, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆగ్రహించిన విద్యార్థులు హాస్టల్‌ను ధ్వంసం చేసి వార్డెన్‌పై దాడికి దిగారు.
అదే ఏడాది నవంబర్ 2024లో ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్కు చెందిన ఎంబీఏ విద్యార్థిని అనుష్క అగర్వాల్ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ ఆరవ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. సీనియర్ పోలీస్, సివిల్ అధికారులు వర్సిటీకి చేరుకుని విచారణ జరిపారు.
ఇక 2025లో యూనివర్సిటీ లా-గేట్ సమీపంలోని మహేరు గ్రామంలో 24 ఏళ్ల సూడాన్ విద్యార్థి మొహమ్మద్ వాడాను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపగా, అతని బంధువు తీవ్రంగా గాయపడ్డాడు. తమ మహిళా స్నేహితులను వేధిస్తున్న విద్యార్థులను అడ్డుకున్నందుకే వీరిపై దాడి జరిగినట్లు పోలీసులు తేల్చి, సీసీటీవీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 16న బీటెక్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ చదువుతున్న 20 ఏళ్ల నిఖిల్ సిమక్ వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం 9వ అంతస్తు నుంచి దూకి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆదివారం నాటి అల్లర్లకు కొద్దివారాల ముందే అంటే సెప్టెంబర్ 10న తెలంగాణకు చెందిన 21 ఏళ్ల బీటెక్ అగ్రికల్చర్ విద్యార్థిని లక్ష్మీ చంద్ర లేడీస్ హాస్టల్ 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యమంతటి నడుమ ఆదివారం నాటి ఘటనలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే, తాజా లైంగిక దాడి ఆరోపణలను యూనివర్సిటీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైన పుకార్లని, క్యాంపస్‌లో ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఎల్పీయూ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, నిర్ధారణ లేని సామాజిక మాధ్యమాల ప్రచారాలను నిజాలుగా భావించవద్దని అధికారులు కోరారు. గతంలో విద్యార్థులు చనిపోయిన సందర్భాల్లోనూ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, పోలీసు దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించామని యాజమాన్యం వివరించింది.

ఈ వరుస ఘటనలతో విద్యార్థుల్లో మేనేజ్మెంట్ సెక్యూరిటీపై అసంతృప్తి పేరుకుపోయి ఉండటంతో, ప్రస్తుత పుకారు పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. ప్రస్తుతం క్యాంపస్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో వాతావరణం క్రమంగా అదుపులోకి వస్తోంది. అయితే, విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు, హాస్టల్ భద్రతా లోపాలు, క్యాంపస్ బయట జరిగిన దాడుల వంటి వరుస పరిణామాలు LPU యాజమాన్యాన్ని, క్యాంపస్ భద్రతా ప్రమాణాలను మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్