యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ఊరట..!

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి పండుగ వేళ ఊరట..!

రెండు వేల రూపాయలకు పైబడిన కొన్ని యూపీఐ లావాదేవీలపై అమలు చేయాల్సిన ఎండీఆర్ ఛార్జీలను వాయిదా వేస్తూ ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఛార్జీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్నది ఇంకా ఖరారు కాలేదు. పూర్తి వివరాలు చూద్దాం.

డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి కీలక అప్‌డేట్. యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమలు చేయాలనుకున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్.. అంటే ఎండీఆర్ ఛార్జీల అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాయిదా వేసింది.

వాస్తవానికి ఈ నెల 15వ తేదీ నుంచి రెండు వేల రూపాయలకు పైబడిన కొన్ని యూపీఐ మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ అమలు చేయాలని నిర్ణయించారు. అయితే పండుగ సీజన్‌లో వ్యాపార లావాదేవీలు, కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో.. ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఎన్‌పీసీఐ యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీపావళి తర్వాత కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఖచ్చితమైన తేదీని ప్రత్యేకంగా ప్రకటించనుంది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఎండీఆర్ ఛార్జీ నేరుగా వినియోగదారులపై విధించే రుసుము కాదు. అర్హత కలిగిన కొన్ని పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలకు సంబంధించి వ్యాపారులపై విధించే ఛార్జీ. రెండు వేల రూపాయల వరకు జరిగే చెల్లింపులు, అలాగే మినహాయింపు పొందిన చిన్న వ్యాపారుల లావాదేవీలు ఈ విధానం పరిధిలోకి రావు.

మొత్తానికి పండుగ సీజన్‌లో వ్యాపారులపై అదనపు భారం పడకుండా ఉండేందుకు ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావళి తర్వాత ఈ ఛార్జీలు ఎప్పటి నుంచి అమలవుతాయి? ఏయే లావాదేవీలకు వర్తిస్తాయి? అన్నదానిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత కోసం వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ న్యూస్