సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరుపై సర్వే..షాకింగ్ రిపోర్ట్ !

  • CM రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు ఎలా ఉంది?
  • 7 ప్రశ్నలతో ఇంటెలిజెన్స్ సర్వే !
  • ప్రజల తీర్పులో సంచలన విషయాలు!

ఓటు వేసిన చేతులే రేపు తీర్పు ఇస్తాయి… అందుకే గద్దెనెక్కిన ప్రభుత్వానికి ‘ప్రజా నాడి’ పట్టుకోవడమే అసలైన ప్రాణవాయువు! పాలన బాగుందని తాము అనుకుంటే సరిపోదు, గడప దాటి బయటకు వస్తే జనం ఏమనుకుంటున్నారనేదే అసలైన రిపోర్ట్ కార్డు. సరిగ్గా ఇదే వ్యూహంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇంటెలిజెన్స్ సాయంతో క్షేత్రస్థాయిలో రహస్య సర్వేకు శ్రీకారం చుట్టింది.

అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజుల్లో కనిపించిన ఆ దూకుడు ఏమైంది? ‘మా పాలన అద్భుతం.. జనం మా వెంటే ఉన్నారు’ అని మైకుల ముందు గర్జించే కాంగ్రెస్ పెద్దలకు, ఉన్నట్టుండి ప్రజల నాడిపై అంతటి అపనమ్మకం, అనుమానం ఎందుకు పుట్టుకొచ్చింది? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? గడప దాటితే వినిపిస్తున్న ప్రజావాణిలో నిశ్శబ్ద తుఫాను ఉందా? పల్లెల్లో రగులుతున్న అసంతృప్తి సెగలు సచివాలయపు ఏసీ గదులను తాకుతున్నాయా? అందుకేనా… సొంత మంత్రులు, ఎమ్మెల్యేల మాటలను కూడా నమ్మకుండా, ఖాకీ నిఘా విభాగంతో గ్రామ గ్రామాన రహస్యంగా ‘ఆపరేషన్ రిపోర్ట్ కార్డ్’ మొదలుపెట్టిందా ? అన్నది ఈ వీడియోలో చూద్దాం.. ముందుగా చానెల్‌ను సస్కైబ్ చేసుకోండి.

అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉండే హనీమూన్ పీరియడ్ ముగిసింది. మూడున్నరేళ్ల పాలన తర్వాత సహజంగానే యాంటీ ఇంకంబెన్సీ పడగ విప్పుతుంది. నెలలు గడుస్తున్న కొద్దీ సహజంగానే ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు, విమర్శలు మొదలవుతాయి. పార్టీ నేతలు ఇచ్చే నివేదికలు ఎప్పుడూ ‘అంతా బాగుంది’ అనే రంగుల ప్రపంచాన్నే చూపిస్తాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. లోపాలను ముందే గుర్తించి సరిదిద్దుకోవడానికి ఈ ఫీడ్‌బ్యాక్ కీలకం. వాస్తవంలో ఓటరు ఏ మూడ్ లో ఉన్నాడో పసిగట్టకపోతే గద్దె దిగక తప్పదని గ్రహించే సీఎం ఈ ఇంటెలిజెన్స్ సర్వేను అస్త్రంగా ఎంచుకున్నారు. ప్రభుత్వ పనితీరుతో పాటు స్వయంగా సీఎం గ్రాఫ్, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉందో నేరుగా ప్రజల నుంచే రాబట్టేందుకు సర్వే చేస్తున్నారు. పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిధులను హెచ్చరించడం లేదా సరిదిద్దడం దీని ప్రధాన ఉద్దేశం.

ఈ సర్వేలో ప్రజల ముందుంచిన 7 ప్రశ్నలు సాధారణ ప్రశ్నలు కావు. ప్రభుత్వ బలాలు, బలహీనతలను నేరుగా బట్టబయలు చేసే ప్రశ్నలు. కేవలం ప్రభుత్వంపైనే కాదు, మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని 3వ ప్రశ్నగా ప్రజల ముందే పెట్టడం వెనుక అసలు లెక్క వేరే ఉంది. పనికిమాలిన ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకే ఈ గ్రౌండ్ రిపోర్ట్! ఈ సర్వే క్వశ్చనీర్ చదివితే.. ప్రభుత్వం తమకున్న లోపాలు, బలహీనతలను ఎంత నగ్నంగా అంగీకరిస్తోందో స్పష్టమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగుందా? పర్వాలేదా? బాగాలేదా?, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? అనే ప్రశ్నలు ఉన్నాయి. అంటే సీఎం గ్రాఫ్ పడిపోయిందా అనే భయం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూడో ప్రశ్నగా మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?, నాలుగో ప్రశ్నగా.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? అన్నది ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే బీఆర్ఎస్ లేదా బీజేపీ పేర్లు ఆప్షన్లుగా పెట్టాల్సి రావడం రేవంత్ అనుమానానికి పరాకాష్ట.

ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారు? కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే కారణాలు ఏంటి? – ఇది అసలైన బాంబు! ఆప్షన్లలో ఉన్న అంశాలను పరిశీలిస్తే.. హైడ్రా , సెక్షన్ 22A, ఎన్నికల వాగ్దానాల అమలులో జాప్యం, నిరుద్యోగ సమస్య, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేల పనితీరు, సీఎం పనితీరు, ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యుత్ కోతలు, అవినీతి, ఉచిత పథకాలకు వ్యతిరేకత మొదలైనవి ఉన్నాయి. ప్రజలు తిరస్కరించడానికి ఉన్న ప్రతి నెగెటివ్ పాయింట్‌ను వారే నేరుగా లిస్ట్ చేశారు!vఇక అఖరులో ఏడో ప్రశ్నగా ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల్లో ఏ పథకం బాగుందని భావిస్తున్నారు? అనేది ఉంది. మహిళలకు ఫ్రీ బస్సు, రైతు భరోసా, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, గ్యాస్ సబ్సిడీ, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు లేదా ఉచితాలకు వ్యతిరేకమా? వంటి ఆప్షన్లు ఇచ్చారు.

రాబోయే జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ సర్వేకు తక్షణ ప్రేరణ. సర్వేలో గ్రామ పంచాయతీల్లో 25 మంది, మున్సిపల్ వార్డుల్లో 25 మంది, కార్పొరేషన్ డివిజన్లలో 100 మంది చొప్పున అభిప్రాయాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కూల్చివేతలు, హైడ్రా నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత ఉందా లేక సానుకూలత ఉందా అనేది కాంగ్రెస్‌కు పరీక్షగా మారింది. అందుకే 6వ ప్రశ్నలో ‘హైడ్రా’ అంశాన్ని ప్రత్యేకంగా చేర్చారు. ‘హైడ్రా’ తెచ్చిన భయాందోళనలు మధ్యతరగతి ఓట్లను దూరం చేశాయా అనే వణుకు సర్కార్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అర్బన్ ఓటర్ల నాడులు పట్టుకునే ప్లాన్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రుణమాఫీ అమలు ఎంతవరకు సంతృప్తినిచ్చింది? రైతు భరోసా ఆలస్యంపై అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది? మహిళలకు ఉచిత బస్సు ప్రభావం గ్రామీణ ఓటర్లలో ఎలాంటి సానుకూలత తెచ్చింది? అనే తేడాలను పసిగట్టేందుకు ఈ ప్రశ్నలు సంధించారు. రైతు రుణమాఫీ కొంతమందికే వచ్చిందన్న విమర్శలు, రైతు భరోసా ఆలస్యం పల్లెటూళ్లలో కాంగ్రెస్ బలమైన పునాదులను కదిలిస్తున్నాయా అనేదే ఈ సర్వేలో తెలుసుకోబోతున్నారు.

పాలకులు తమను తాము దేవుళ్లమని భ్రమపడటం రాజకీయంలో సహజం.. కానీ ‘ఓటరు దేవుడు’ తిరగబడితే ఏ సింహాసనమైనా కుప్పకూలక తప్పదు! రేవంత్ సర్కార్ చేస్తున్న ఈ సర్వే కేవలం మున్సిపల్ ఎన్నికల ముందస్తు కసరత్తు మాత్రమే కాదు… ఓటమి వాసన ముందే పసిగట్టి, ప్రాణాలను కాపాడుకునేందుకు చేస్తున్న పొలిటికల్ ఐసీయూ చెకప్! రాజకీయ ఉనికి, మనుగడ కోసం చేస్తున్న ముందస్తు రిపేర్ వర్క్. బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వ వైఫల్యాలుగా ప్రచారం చేస్తున్న నిరుద్యోగం, రైతు భరోసా, హైడ్రా లాంటి అంశాలనే ప్రభుత్వం నేరుగా సర్వే రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లి నిజంగా అవి పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయా లేదా అని నిర్ధారించుకుంటోంది. స్థానిక శాసనసభ్యులపై అసంతృప్తి ఉంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం, భవిష్యత్ ఎన్నికల్లో వారికి పగ్గాలు ఇవ్వాలా వద్దా అనేది ఈ నివేదికలే నిర్ణయిస్తాయి.

ఈ సర్వే అంశం బయటకు రావడం గులాబీ శిబిరానికి రాజకీయంగా ఒక రెడీమేడ్ ఆయుధం దొరికినట్లే! ప్రభుత్వం స్వయంగా ఇంటెలిజెన్స్‌తో చేయిస్తున్న ఈ సర్వే పేపర్‌ను చూసి బీఆర్ఎస్ శ్రేణులు, అగ్ర నాయకత్వం అంతర్గతంగా పండుగ చేసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ప్రభుత్వం అడిగిన ప్రశ్నలే కాంగ్రెస్ వైఫల్యాలకు అంగీకార పత్రంలా మారాయి! ప్రభుత్వమే రూపొందించిన 6వ ప్రశ్నలోని అంశాలు.. హైడ్రా కూల్చివేతలు, రైతు భరోసా ఎగవేత, జాబ్ క్యాలెండర్ జాప్యం, కరెంట్ కోతలు, సెక్షన్ 22A లాంటివి బీఆర్ఎస్ తన ప్రధాన ఎజెండాగా మార్చుకుంటుంది. “మేము చెప్పేది అబద్ధమైతే.. మీ ఇంటెలిజెన్స్ సర్వేలో ఈ వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించారు?” అంటూ రేవంత్ సర్కార్‌ను నేరుగా డిఫెన్స్‌లో పడేసే అస్త్రంగా దీన్ని వాడుకుంటుంది.

గత పదేళ్లలో రైతుబంధు సమయానికి పడటం, 24 గంటల నిరంతర విద్యుత్, సాఫీగా సాగిన సంక్షేమం గురించి పల్లెల్లో ప్రచారం చేస్తూ… ప్రస్తుత సర్కార్ హయాంలో పథకాల కోతలు, గందరగోళాలను ఎత్తిచూపుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ‘కేసీఆర్ మార్క్ భద్రత’ను మళ్లీ గుర్తుచేసే వ్యూహాన్ని అమలు చేస్తుంది. మున్సిపల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు త్వరలో ఉండటంతో, హైడ్రా వల్ల భయాందోళనలకు గురైన మధ్యతరగతి, పేద వర్గాలకు అండగా నిలవడం ద్వారా పట్టణ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్లాన్ సిద్ధం చేస్తుంది. “కాంగ్రెస్ వస్తే కూల్చివేతలు… బీఆర్ఎస్ ఉంటేనే నిర్మాణాలు” అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.

ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తున్నది ప్రభుత్వ వ్యతిరేకత, అయితే అది దానంతట అదే పూర్తిస్థాయి ‘బీఆర్ఎస్ పాజిటివ్ వేవ్’గా మారుతుందా అన్నది అసలు పాయింట్. సర్వేలో 4వ, 5వ ప్రశ్నల్లో ప్రజలకు ప్రధాన ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పేరు మొదటి వరుసలో ఉండటం క్షేత్రస్థాయి వాస్తవం. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌పై అసంతృప్తి పెరిగితే, బలమైన కేడర్ ఉన్న బీఆర్ఎస్‌కే ఆ ఓట్లు మళ్లీ మళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ లబ్ధి పొందని రైతాంగంలో బీఆర్ఎస్ పట్ల సానుభూతి వేగంగా పెరుగుతోంది. కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ, పట్టణాల్లో బీజేపీ కూడా ఆ వ్యతిరేక ఓటును ఆకర్షించేందుకు పోటీ పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీలిపోతే అది మళ్లీ కాంగ్రెస్‌కే లాభించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకతను పూర్తిగా తన ఖాతాలో వేసుకోగలిగితేనే బీఆర్ఎస్‌కు తిరుగులేని ‘వేవ్’ ఏర్పడుతుంది.

సర్వేలో ప్రభుత్వం స్వయంగా ప్రస్తావించిన ‘రైతు భరోసా’, ‘నిరుద్యోగం’ అంశాలు నిజంగానే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు మైనస్‌గా మారితే, అది బీఆర్ఎస్‌కు అతిపెద్ద అడ్వాంటేజ్. కేసీఆర్ కాలంలో ఉన్న స్థిరత్వం గుర్తుకొస్తున్న తరుణంలో, ప్రజల మొగ్గు బీఆర్ఎస్ వైపు కనిపించే సంకేతాలు ఈ సర్వే ప్రశ్నల రూపంలోనే వ్యక్తమవుతున్నాయి. పాలకులు ప్రజలను మభ్యపెట్టాలని చూసినప్పుడు… కాలమే ఎదురుతిరిగి సమాధానం చెబుతుంది! రేవంత్ సర్కార్ చేయిస్తున్న ఈ నిఘా సర్వే, బీఆర్ఎస్‌కు ఒక పదునైన బాణాన్ని చేతికి అందించింది.

రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతం కాదు… ప్రజల నాడి పట్టుకున్నవాడే సిసలైన నాయకుడు! ఎన్నికల నాటికి సమస్యలు ముదిరిపోకముందే, ప్రజా క్షేత్రంలో ఎదురయ్యే ప్రశ్నలను ప్రభుత్వం స్వయంగా ఇంటెలిజెన్స్ ద్వారా శోధిస్తోంది. తప్పులు కప్పిపుచ్చుకుంటే చరిత్ర మిగలదు. ఇది కేవలం సర్వే మాత్రమే కాదు, రాబోయే మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రానికి రేవంత్ పన్నుతున్న సైలెంట్ ఆపరేషన్! ప్రభుత్వం తమ తప్పుల చిట్టాను తామే సర్వే రూపంలో బయటపెట్టుకుంటే… ప్రతిపక్షానికి ఇంతకంటే పెద్ద రాజకీయ వరం మరొకటి ఉండదు! అయితే, పాలకుల తప్పులు మాత్రమే అధికారాన్ని తిరిగి తెచ్చిపెట్టవు… ఆ అసంతృప్తి నిప్పును ప్రజా ఉద్యమంగా మార్చి, ప్రజల్లో భరోసా నింపినప్పుడే ‘గులాబీ కారు’ మళ్లీ గమ్యాన్ని ముద్దాడుతుంది!

అధికారం ఇచ్చిన ప్రజలే రేపు తీర్పు రాసే న్యాయమూర్తులు! సర్వేల పేరుతో అద్దంలో లోపాలు చూసుకున్నంత మాత్రాన అందం రాదు… చేసిన గాయాలకు మందు వేసి, తప్పులను సరిదిద్దుకుంటేనే రేవంత్ కుర్చీకి రక్షణ! లేదంటే… జనం వేసే పంచ్‌కు ఏ సర్వే కూడా సమాధానం చెప్పలేదు!”

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్