బడి గుమ్మమే నేరస్థలి ! ▶️

  • బడి గుమ్మమే నేరస్థలి!
  • నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ హత్యే కన్నీటి సాక్ష్యం!
  • మందలించారనే కక్షతో ప్రిన్సిపాల్‌ను బలిగొన్న విద్యార్థులు!
  • కక్షలు.. నేరాల బాట పడుతున్న లేత మనసులు

ఒకప్పుడు బడి గుమ్మం అంటే భక్తి, గురువు అంటే దైవంతో సమానమైన గౌరవం ఉండేవి. కానీ, నేడు ఆ పవిత్ర భావాలు కనుమరుగై, పెడదోవ పడుతున్న బాల్యానికి ఈ ఉదంతం ఒక కదిలించే కన్నీటి సాక్ష్యం. చదువుకోవాల్సిన చేతుల్లో పుస్తకాలకు బదులు కక్షలు, ప్రతీకారాలు మొలకెత్తుతుండటం సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న నిజం. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కల్లు రూపారెడ్డి హత్యే ఒక ఉదాహరణ. విద్యార్థులు ఎందుకు క్రైమ్ వైపు వెళ్తున్నారన్నది ప్రధానంగా ఆలోచించాలి. చదువుపై దృష్టి పెట్టాల్సిన వయసులో జల్సాలు, వ్యసనాలకు బానిసకావడం ఈ మార్పుకు ప్రధాన కారణం. షార్ట్‌కట్‌లలో డబ్బు సంపాదించాలనే దురాశ సామాజిక మాధ్యమాల ద్వారా మరింత పెరుగుతోంది. ఉపాధ్యాయులు లేదా ప్రిన్సిపల్ మందలిస్తే, దానిని గురువు హితవుగా కాకుండా తమ అహానికి తగిలిన దెబ్బగా భావిస్తున్నారు.

పిల్లలపై తల్లిదండ్రుల పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. బిజీ లైఫ్‌లో పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మొబైల్‌లో ఏం చూస్తున్నారనే విషయాలపై తల్లిదండ్రుల దృష్టి తగ్గింది. పిల్లలు అడిగిన వెంటనే సెల్‌ఫోన్లు ఇవ్వడం, తప్పు చేసినప్పుడు మందలించకపోవడం వారిని మరింత దూకుడుగా మారుస్తోంది. సినిమాల్లో, సోషల్ మీడియా రీల్స్‌లో నేరాలను హీరోల రేంజ్‌లో చూపించడం యువతను తీవ్రంగా ఆకర్షిస్తోంది. సులభంగా క్రైమ్ ఎలా చేయాలి, పోలీసుల కళ్లుగప్పడం ఎలా అనే విషయాలపై సామాజిక మాధ్యమాల్లో లభించే సమాచారం లేత మనసులను విషపూరితం చేస్తోంది. రెక్కీలు నిర్వహించడం వంటి ప్రమాదకరమైన ధోరణులకు ఇవే ప్రేరణగా మారుతున్నాయి. టీనేజ్ వయసు అనేది ఉద్వేగాలు ఎక్కువగా ఉండే కాలం. ఈ దశలో దిశ నిర్దేశం లేకపోతే జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. చిన్నతనంలోనే ఇలాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడితే, వారి భవిష్యత్తు జైలు గోడల మధ్యే ముగిసిపోతుంది. సమాజంలో కుటుంబానికి కూడా తీరని కళంకం మిగులుతుంది. పిల్లలకు కేవలం అక్షరాలు నేర్పితే సరిపోదు, మంచీ చెడుల మధ్య వివక్ష తెలిపే సంస్కారాన్ని కూడా నేర్పించాలి. మార్కులు ముఖ్యామే, కానీ మానవత్వం అంతకంటే ముఖ్యం.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్