- *కడప జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు!
- *మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వానికి రామాజీ ఇమ్మానియేల్ డిమాండ్
- *ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి: SYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ సహా దళిత సంఘాల నాయకులు
ఆంధ్రప్రదేశ్: ప్రొద్దుటూరు: తికాల తెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రామాజీ ఇమ్మానియేల్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రొద్దుటూరు పాత బస్టాండ్ సర్కిల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో రామాజీ ఇమ్మానియేల్ మాట్లాడుతూ, కడప జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగలేదని విమర్శించారు. రిజర్వేషన్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సంబంధిత అధికారిక వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు కీలకమని, తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో న్యాయం జరగకపోతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని రామాజీ ఇమ్మానియేల్ హెచ్చరించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధుల కేటాయింపుపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సోషలిస్టు యూత్ ఫెడరేషన్ (SYF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, మాల మహాసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడెం చెరువు సంపత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆకుమల్ల ప్రణయ్ కుమార్, మాల మహానాడు రాయలసీమ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి అరుణ్ కుమార్, రాష్ట్ర సమన్వయకర్త యేసు రత్నం, గాలిపోతుల శేఖర్, రాష్ట్ర కార్యదర్శి సాత్రి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ఎస్సీ, ఎస్టీలకు న్యాయబద్ధమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం పునఃపరిశీలన చేసి సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.