#జర్నలిస్టులను,
#ఉద్యమకారులను గుర్తించాలి
‘ఉద్యమకారుల’ కమిటీ కో చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు #తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వినతి పత్రం
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ కో చైర్మన్, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) కోదండరాం ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) నాయకులు సోమవారం, జూలై 13, 2026న ఉదయం 9 గంటలకు తార్నాక లోని ఆయన నివాసంలో కలిశారు. టీజేఎఫ్ అధ్యక్షులు పల్లె రవికుమార్ ఆధ్వర్యంలోని కమిటీ కార్యవర్గ సభ్యులు.. ఉద్యమకారులు, జర్నలిస్టుల గుర్తింపు, సంక్షేమంపై ఒక సమగ్ర ప్రత్తిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమం కాలం నాటి క్షేత్రస్థాయి పరిస్థితులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు పోషించిన పాత్ర, ప్రభుత్వం పరంగా చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులు, జర్నలిస్టులను ప్రభుత్వ పరంగా తగిన విధంగా గుర్తించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయడంతో పాటు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేలా కమిటీ సిఫార్సులు చేయాలని ఈ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల, ఉద్యమకారుల సమస్యలపై కో చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో ఫోరం ప్రతినిధులు కూలంకషంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహేశ్వరం మహేంద్ర చారి, కార్యదర్శి ముద్ధం స్వామి, పాలకూరి రాజు, శ్రీనివాస్, పోగుల ప్రకాష్, కోశాధికారి నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.