ప్రత్యక్ష రాజకీయాల్లోకి త్రిష ! బరిలో దిగితే? ▶️

  • తమిళ రాజకీయ గడ్డపై ‘త్రిషరాజ్యం’ ?
  • ప్రత్యక్ష రాజకీయాల్లోకి త్రిష! బరిలో దిగితే?

తమిళనాట ఇప్పుడు హీరోయిన్ త్రిష పేరు టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. తమిళ చిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయంతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ‘క్యూట్ క్వీన్’ త్రిష కృష్ణన్ చుట్టూ ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎప్పటికీ వయసు కాని సుందరిలా కనిపించే త్రిష, ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలు కోలీవుడ్‌తో పాటు చెన్నై పొలిటికల్ కారిడార్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. అసలు త్రిష రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? సినిమా హీరోయిన్ల రాజకీయ ప్రస్థానం తమిళనాట ఎలా ఉంది? త్రిష సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తమిళనాడు రాజకీయాలకూ, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, విజయ్‌కాంత్ వంటి దిగ్గజాలు వెండితెర నుంచి రాజకీయ సింహాసనాన్ని అధిష్టించిన వారే. తాజాగా త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నారనే చర్చ ఊపందుకోవడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. త్రిష కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, జంతు సంరక్షణ, మహిళా సాధికారత లాంటి వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. తమిళనాడులో హీరోలు రాజకీయాల్లోకి రావడం చాలా కామన్. కానీ హీరోయిన్ల రాజకీయ ప్రవేశం ఎలా ఉంది? గెలిచారా లేదా? అనేది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. గతంలో తమిళనాడు రాజకీయ చరిత్రను శాసించిన ఉక్కు మహిళగా పేరొందారు దివంగత మాజీ సీఎం జయలలిత. ఏకంగా 6 సార్లు ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు. అపారమైన మేధస్సు, పట్టుదల, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్‌తో రాణించి తమిళ రాజకీయాలను శాసించారు. నటి ఖుష్బూ, గౌతమి తదితర హీరోయిన్లు కూడా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు నటిమణులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, ప్రత్యక్ష ఎన్నికల బరిలో పెద్దగా విజయాలు సాధించలేదు. తమిళనాట జయలలిత లాంటి అగ్ర హీరోయిన్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగితే, మిగతా నటీమణులు పార్టీలకు గ్లామర్ అట్రాక్షన్‌గా, స్టార్ క్యాంపెయినర్లుగా బాగా రాణించారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే కేవలం గ్లామర్ సరిపోదని, ప్రజలతో మమేకమయ్యే తత్వం, క్షేత్రస్థాయి పట్టు ఉండాలని చరిత్ర చెబుతోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయ్, త్రిషల చుట్టు రాజకీయం నడించింది. ఎన్నికల్లో విజయ్‌ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలకు త్రిష టార్గెట్‌గా మారారు. త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష పొలిటికల్ ఎంట్రిపై ఉహాగానాలు ఊపందుకున్నాయి. చెన్నైలోని ప్రధాన వీధులు, గోడలు, మెట్రో పిల్లర్లన్నీ ఒకే ఒక్కరి పోస్టర్లతో నిండిపోయాయి. త్రిష రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు, ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నట్లు ఆ బ్యానర్లు ఉన్నాయి. సాధారణంగా నటులు రాజకీయాల్లోకి రావడం తమిళనాడుకు కొత్తేమీ కాదు. కానీ, ఈసారి సీన్ వేరు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విజయ్ రాజకీయ వ్యూహంలో త్రిష ఎంట్రీ ఒక మాస్టర్ స్ట్రోక్ లా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు షేర్లు, ట్రెండ్స్‌తో హోరెత్తిపోయాయి. ఆమె మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

త్రిష రాజకీయాల్లోకి వస్తే ఆమె విజయావకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు అసలు ప్రశ్న. రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉండటం వల్ల అన్ని తరాల ప్రజలకు సుపరిచితురాలు. వివాదాలకు దూరంగా ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్. ప్రస్తుత సీఎం విజయ్‌తో త్రిషకు చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. సినిమాలో వీరిది సూపర్ హిట్ జోడి. ఇటీవలే ‘లియో’ చిత్రంలో నటించిన వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, పార్టీలో కీలక బాధ్యతల్లోకి లేదా స్టార్ ప్రచారకర్తగా త్రిష వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమయినట్లు తమళనాట విస్తృత చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటి చేసి గెలిచిన..దళపతి విజయ్… ఇప్పుడు ఒక స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించిన విజయ్.. ఆ పార్టీ తరపున త్రిష బరిలో దిగబోతున్నట్లు తమళరాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కోలీవుడ్ దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానం కోసం ఎంచుకునే పవర్‌ఫుల్ నియోజకవర్గంలో… ఆయన స్థానంలో త్రిష బరిలోకి దిగుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఒకే ఒక హై-వోల్టేజ్ సినారియో ఇది. ఒకవేళ త్రిష ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తే, ఆమె కోసం సేఫ్ , సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గాలను ఎంచుకునే అవకాశం ఉంది. త్రిష స్వతహాగా చెన్నై అమ్మాయి. చెన్నైలోని ప్రముఖ పాఠశాలల్లో చదివి, అక్కడే పెరిగారు. అర్బన్ వోటర్స్ మధ్య ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. కాబట్టి చెన్నై పరిధిలోని ఏదైనా అర్బన్ కాన్‌స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే నియోజకవర్గం అయితే, ఇక్కడ కూడా ఆమెకు భారీ యువత ఫాలోయింగ్ కలిసి వస్తుంది.

విజయ్ ఇటీవల రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి త్వరలో ఉపఎలక్షన్ జరగనుంది. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి త్రిషను బరిలోకి దించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజయ్ ప్లాన్ చేశారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. త్రిషకు ఉన్న విపరీతమైన క్రేజ్, మహిళల్లో ఆమెకున్న ఫాలోయింగ్ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి దెబ్బ కొడుతుందని భావిస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా, ఆమెను నేరుగా తన మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ బాధ్యతలు అప్పగించాలని సీఎం విజయ్ ముందే ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే , ఏఐఏడీఎంకే లాంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలు ఈ స్థానంలో త్రిషను ఓడించడానికి తమ అత్యంత బలమైన సీనియర్ నాయకులను రంగంలోకి దించుతాయి.

త్రిష రాజకీయ అరంగేట్రం అనేది ప్రస్తుతం కేవలం కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక పొలిటికల్ థ్రిల్లర్ స్క్రిప్ట్ లాంటిది. ఆమె స్వయంగా దీనిపై స్పందించనప్పటికీ, రాబోయే ఎన్నికల నాటికి ఆమె ఏదో ఒక రూపంలో ఎంట్రీ ఇస్తారు అన్నది మాత్రం అక్షర సత్యం. ప్రత్యక్ష రాజకీయాలు లేదా ప్రచారకర్తగా రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఒకవేళ ఆమె గనుక రాజకీయ రణరంగంలోకి అడుగుపెడితే, వెండితెరపై ఎలాగైతే తన నటనతో రికార్డులు సృష్టించారో, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఆమెకు ఉంది! తమిళనాడు రాజకీయ రంగస్థలంపై త్రిష అడుగుపెడితే, అది కేవలం ఒక నటి పొలిటికల్ ఎంట్రీ మాత్రమే కాదు… అదొక ‘పొలిటికల్ మేకోవర్ మాస్టర్‌పీస్’ అవుతుంది. తమిళ రాజకీయ గడ్డపై ‘త్రిషరాజ్యం’ నిజంగా సాధ్యమేనా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455 

ట్రెండింగ్ న్యూస్