- తెలంగాణలో ఇంటర్మీడియట్ రద్దు..
- 55 ఏళ్ల చరిత్రకు తెర..స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం !
తెలంగాణలో చదువుకునే విద్యార్థుల జీవితాల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. పదో తరగతి అయిపోగానే ఇంటర్ కాలేజీలో అడుగుపెట్టే రోజులు ఇక ఉండవు? రెండేళ్ల ఇంటర్మీడియట్ చదువు స్థానంలో 11, 12 తరగతులు రాబోతున్నాయట. దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం ముగింపు పలకబోతోందట. ‘ఇంటర్మీడియట్ బోర్డు’ను రద్దు చేసి.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 10+2 విధానాన్ని తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అసలు ఇంటర్ బోర్డును ఎందుకు రద్దు చేయాల్సి వస్తోంది? ఇప్పటివరకు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది? మారుతున్న విధానం వల్ల విద్యార్థులకు వచ్చే లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి? ఇప్పటివరకు జూనియర్ కాలేజీల పరిస్థితి ఏంటి?
ముందుగా అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్తా. నవంబర్ 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలో 10+2 విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో చేరి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇక కొత్త విధానం ప్రకారం ఈ ఇంటర్మీడియట్ విద్యను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. అంటే ఇప్పుడున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ను 11వ తరగతిగా, సెకండ్ ఇయర్‌ను 12వ తరగతిగా పరిగణిస్తారు. అలాగే విద్యా వ్యవస్థను మూడు దశలుగా విభజించే ప్రతిపాదన ఉంది.
ఒకటి.. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్. రెండు.. ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ ఎడ్యుకేషన్. మూడు.. తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ మార్పులన్నీ 2027–28 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంటర్ బోర్డు రద్దు అంటే ఇంటర్ చదువు రద్దు అని కాదు. ఇంటర్ స్థాయి చదువు 11, 12 తరగతులుగా కొనసాగుతుంది. మారేది ప్రధానంగా పరిపాలనా వ్యవస్థ, విద్యాసంస్థల నిర్మాణం, విద్యార్థులు చదివే విధానం.
మనం ఇప్పటివరకు చూస్తున్న ఇంటర్మీడియట్ విద్య అనేది ఒక సెపరేట్ బోర్డు కింద నడుస్తోంది. పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో చేరుతారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని రెండేళ్లు వేరుగా బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. దీనికోసం ప్రత్యేకంగా ‘ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు’ ఉంటుంది. అయితే, చాలా కాలేజీలు కేవలం మార్కులు, ర్యాంకులు, కార్పొరేట్ కాలేజీల బిజినెస్ మోడల్‌గా మారిపోయాయనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వం తెస్తున్న కొత్త 10+2 విధానం ప్రకారం.. ప్రత్యేకంగా ‘ఇంటర్ బోర్డు’ అంటూ ఏదీ ఉండదు. స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే ఇంటర్ విద్యను విలీనం చేస్తారు. అంటే 9, 10, 11, 12 తరగతులు అన్నీ ఒకే స్కూల్ లేదా సీనియర్ సెకండరీ క్యాంపస్ కింద ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో ఎలాగైతే ఒకే క్యాంపస్‌లో 12వ తరగతి వరకు చదువుకుంటారో, ఇకపై రాష్ట్రంలోని సర్కారు బడులు, కాలేజీలు అలాగే మారనున్నాయి.
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పర్యవేక్షిస్తోంది. ఈ బోర్డు కేవలం పరీక్షలు నిర్వహించే సంస్థ మాత్రమే కాదు. ఇంటర్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం, కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వడం, సిలబస్ రూపొందించడం, పాఠ్యపుస్తకాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, పరీక్షల షెడ్యూల్ ప్రకటించడం, హాల్ టికెట్లు, పబ్లిక్ పరీక్షలు, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల చేయడం.. ఇలా చాలా బాధ్యతలు ఈ బోర్డు పరిధిలో ఉంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని రెండు సంవత్సరాలుగా విద్యార్థుల చదువు కొనసాగుతుంది. ఉదాహరణకు MPC తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. BiPC తీసుకుంటే బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. MECలో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌కు సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. అలాగే CEC, HEC, ఇతర గ్రూపులు కూడా ఉన్నాయి. విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపులో చేరి రెండేళ్లు చదువుతారు. ఆ తర్వాత ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాస్తారు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంటర్ చదువుతోపాటు విద్యార్థులు EAPCET, JEE, NEET వంటి ప్రవేశ పరీక్షలకు కూడా సిద్ధమవుతుంటారు. అందుకే తెలంగాణలో ఇంటర్మీడియట్ అనేది కేవలం రెండు సంవత్సరాల చదువు మాత్రమే కాదు. లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యకు ఒక ముఖ్యమైన మెట్టుగా మారింది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆలోచనల మేరకు ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను 1969-70 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టారు. అప్పట్లో కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా 10+2+3 విద్యావిధానంలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1971లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పాటైంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి పూర్తయిన తర్వాత సగటున 40 శాతం మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని తెలిపారు. అయితే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో విద్యార్థుల డ్రాప్‌ఔట్ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. దేశంలోని ఇప్పటికే 18 రాష్ట్రాలు 12వ తరగతి వరకు ఒకే విద్యావ్యవస్థను అనుసరిస్తున్నాయని సీఎం వెల్లడించారు. ఈ మార్పుల వల్ల విద్యాశాఖ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇంటర్మీడియట్ విద్యా జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన అసంతృప్తిని వెల్లడించింది. మరోవైపు సీపీఐ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించింది. ఇలాంటి కీలకమైన మార్పులపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యారంగ నిపుణులు సహా అన్ని వర్గాలతో సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఇప్పుడు ప్రభుత్వానికి ఈ మార్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు వద్దాం. ముఖ్యమంత్రి చెప్పిన ప్రధాన కారణాల్లో ఒకటి పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయడం. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం పదో తరగతి తర్వాత దాదాపు 40 శాతం మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారనే ఆందోళన ఉంది. ముఖ్యంగా బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం చెబుతోంది. దీనికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది.. పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు మరో కాలేజీలో చేరాల్సి రావడం. రెండోది.. కొన్ని గ్రామాల్లో జూనియర్ కాలేజీలు అందుబాటులో లేకపోవడం. మూడోది.. కాలేజీ దూరంగా ఉండటంతో రవాణా ఖర్చులు పెరగడం. నాలుగోది.. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కుటుంబ పరిస్థితులు, భద్రత, ప్రయాణ సమస్యలు. ఐదోది.. ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతి తర్వాతే చదువు ఆపేయాల్సిన పరిస్థితులు. ఇప్పుడు స్కూల్లోనే 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటే.. విద్యార్థులు మధ్యలో చదువు ఆపకుండా కొనసాగించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. విద్యార్థులు చదువు మానేయడానికి కారణం జూనియర్ కాలేజీ వ్యవస్థ ఒక్కటేనా? లేక పేదరికం, కుటుంబ పరిస్థితులు, రవాణా, విద్యా నాణ్యత వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా? కేవలం ఇంటర్ బోర్డు విలీనం చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.
ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యా విధానాన్ని ఒకసారి చూద్దాం. దేశంలోని దాదాపు 18కి పైగా రాష్ట్రాల్లో ఎప్పనుంచో ఈ సెపరేట్ ఇంటర్ బోర్డు సిస్టమ్ లేదు! కర్ణాటక, కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సీబీఎస్ఈ లేదా కేంద్రీయ విధానం మాదిరిగానే పాఠశాల విద్యలోనే 11, 12 తరగతులు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండటం వల్ల అదనపు ఒత్తిడి, అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు వస్తున్నాయని గుర్తించిన చాలా రాష్ట్రాలు ఎప్పుడో 10+2 పద్ధతికి మారిపోయాయి. ఇప్పుడు తెలంగాణ కూడా అదే బాట పట్టాలని చూస్తోంది.
కర్ణాటకలో 11, 12 తరగతులను PUC అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు అని పిలుస్తారు. అక్కడ కూడా ప్రత్యేకంగా PUC విద్యా వ్యవస్థ ఉంది. అంటే 10+2 విధానం ఉన్నంత మాత్రాన ప్రత్యేక విద్యా నిర్వహణ వ్యవస్థ ఉండకూడదని కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకంగానే పనిచేస్తోంది. అక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విధానం కొనసాగుతోంది. మహారాష్ట్రలో SSC, HSC బోర్డులు ఉన్నాయి. పదో తరగతి తర్వాత 11, 12 తరగతులకు జూనియర్ కాలేజీల విధానం కొనసాగుతోంది. తమిళనాడులో హయ్యర్ సెకండరీ విద్యలో 11, 12 తరగతులు స్కూల్ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. అక్కడ కూడా ప్రత్యేకంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణ వ్యవస్థ ఉంది.
అంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 10+2 విధానం అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా బోర్డు ఉండాలని కాదు. కొన్ని రాష్ట్రాల్లో స్కూల్ ఎడ్యుకేషన్‌తో అనుసంధానమై ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక బోర్డులు, ప్రత్యేక పరీక్షల విభాగాలు కొనసాగుతాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏ విధానాన్ని తీసుకొస్తుంది? బోర్డును పూర్తిగా విలీనం చేస్తుందా? లేక పరీక్షల నిర్వహణకు ప్రత్యేక విభాగం ఉంచుతుందా? అనేదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న.
ఇప్పుడు ఈ మార్పు వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్రయోజనం.. చదువు కొనసాగింపు. పదో తరగతి తర్వాత వేరే కాలేజీకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అదే స్కూల్లో 12వ తరగతి వరకు చదివే అవకాశం కల్పిస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. రెండో ప్రయోజనం.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అవకాశం. ప్రతి మండలంలో, ప్రతి ప్రాంతంలో తగిన సౌకర్యాలతో సీనియర్ సెకండరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. మూడో ప్రయోజనం.. బాలికలకు ఉపయోగం. ఇంటికి దగ్గరలోనే 12వ తరగతి వరకు చదువుకునే సదుపాయం ఉంటే కుటుంబాలు కూడా అమ్మాయిల చదువును కొనసాగించేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. స్కూల్ నుంచి కాలేజీకి మారే సమయంలో వచ్చే అడ్మిషన్ సమస్యలు తగ్గవచ్చు. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థి ప్రగతిని ఒకే విద్యా వ్యవస్థలో పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
ఇక మరో ప్రయోజనం.. భాష, కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పిన అంశం కూడా ఇదే. పన్నెండో తరగతి పూర్తయ్యే సమయానికి విద్యార్థులకు భాషపై పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, తమకు నచ్చిన రంగంలో నైపుణ్యం ఉండేలా చూడాలన్నది లక్ష్యం. ఇవి కాగితాల మీద ఉన్న ప్రయోజనాలు మాత్రమే కాదు. సరైన వసతులు, ఉపాధ్యాయులు, బోధనా విధానం ఉంటే నిజంగానే విద్యార్థులకు ఉపయోగపడే అంశాలు.
పదో తరగతి తర్వాత కాలేజీకి మళ్లీ అడ్మిషన్ తీసుకోవడం, దూరం ప్రయాణించడం వల్ల చాలా మంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అమ్మాయిలు, పేద పిల్లలు చదువు ఆపేస్తున్నారు. ఒకే స్కూల్లో కంటిన్యూ అయితే ఈ డ్రాపౌట్లు భారీగా తగ్గుతాయని రేవంత్ సర్కార్ ఆలోచన. ఒకే విద్యా విధానం కింద పాఠశాల విద్య కొనసాగడం వల్ల విద్యార్థులకు పునాది బలంగా మారుతుంది.
ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ నిర్ణయంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నుంచి కొన్ని తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ బోర్డు రద్దు అయితే వేలాది మంది జూనియర్ లెక్చరర్లు, సిబ్బంది ఉద్యోగ భద్రత ఏమవుతుందనే ప్రశ్న వస్తోంది. సాధారణ స్కూళ్లలో 11, 12 తరగతులకు సరిపడా ల్యాబ్స్, క్లాస్‌రూమ్స్, సబ్జెక్ట్ నిపుణులైన లెక్చరర్లు ఉంటారా లేదా అనేది పెద్ద సందేహం. ఎలాంటి ముందస్తు సమగ్ర చర్చ లేకుండా హడావుడిగా నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడుతుందని జేఏసీలు హెచ్చరిస్తున్నాయి.
ప్రభుత్వం చెప్పే ప్రయోజనాలు ఒకవైపు ఉంటే.. ఈ మార్పుతో కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొదటిది.. జూనియర్ కాలేజీల భవిష్యత్తు. ఇప్పుడు తెలంగాణలో వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్నారు. వీటిని స్కూల్ విద్యా వ్యవస్థలోకి ఎలా తీసుకొస్తారు? అవి స్కూల్స్‌గా మారతాయా? లేక 11, 12 తరగతులకు ప్రత్యేక సీనియర్ సెకండరీ సంస్థలుగా కొనసాగుతాయా?
ఈ విషయంలో స్పష్టత రావాలి. రెండోది.. మౌలిక సదుపాయాలు. ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఒక స్కూల్లో అకస్మాత్తుగా 9, 10, 11, 12 తరగతులు ప్రారంభిస్తే సరిపోదు కదా! దానికి తగిన క్లాస్ రూమ్స్ ఉండాలి. సైన్స్ ల్యాబ్స్ ఉండాలి. లైబ్రరీ ఉండాలి. కంప్యూటర్ సదుపాయాలు ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండాలి. అన్ని స్కూళ్లలో ఈ సౌకర్యాలు ఉన్నాయా? లేవు కదా!
మూడోది.. లెక్చరర్ల పరిస్థితి. ఇంటర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లను ఏ శాఖలోకి తీసుకుంటారు? వాళ్ల సర్వీస్ రూల్స్ ఎలా ఉంటాయి? ప్రమోషన్లు ఎలా ఉంటాయి? స్కూల్ టీచర్లతో సమన్వయం ఎలా ఉంటుంది? ఉద్యోగాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కాపాడతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. వాటిని ఎలా అమలు చేస్తారో స్పష్టమైన ఉత్తర్వులు రావాలి. ఇంటర్ స్థాయిలో ప్రత్యేకంగా బోధించాల్సిన సబ్జెక్టులు ఉంటాయి. వాటికి అనుభవం ఉన్న లెక్చరర్లు అవసరం. ఒక స్కూల్లోనే 1 నుంచి 12 తరగతుల వరకు నిర్వహించాలంటే సరిపడా సిబ్బంది లేకపోతే బోధన నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది.
ఇప్పుడు ఇంటర్ విద్యార్థుల్లో ఎక్కువగా వినిపించే మరో ప్రశ్న. ఇంటర్ బోర్డు పోతే MPC, BiPC, MEC గ్రూపులు కూడా పోతాయా?
తెలంగాణలో చాలా మంది విద్యార్థులు ఇంటర్ నుంచే JEE, NEET, EAPCET కోసం సిద్ధమవుతుంటారు. ప్రస్తుతం MPC, BiPC గ్రూపుల్లో ప్రత్యేకంగా కోచింగ్, సబ్జెక్ట్ బోధన అందించే కాలేజీలు ఉన్నాయి. కొత్త విధానంలో కూడా అదే స్థాయిలో సబ్జెక్ట్ స్పెషలైజేషన్, ల్యాబ్ ప్రాక్టీస్, పోటీ పరీక్షల ప్రిపరేషన్ కొనసాగుతాయా? స్కూల్ టైమ్‌టేబుల్‌లో వీటికి తగిన సమయం కేటాయిస్తారా? ఇది తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం.
ఇంటర్ బోర్డు విలీనం చేయడం ఒక పరిపాలనా మార్పు. కానీ విద్యార్థులకు అవసరమైన సబ్జెక్టుల ఎంపికను ఎలా కొనసాగించాలన్నది వేరే విషయం. కొత్త విధానంలో కూడా సైన్స్, మ్యాథ్స్, కామర్స్, హ్యూమానిటీస్ వంటి సబ్జెక్టుల కాంబినేషన్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి. ఉదాహరణకు ఒక విద్యార్థికి డాక్టర్ కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవసరం. ఇంజినీరింగ్ చేయాలనుకునే విద్యార్థికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ముఖ్యమైనవి. కామర్స్, ఫైనాన్స్ రంగాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులు అవసరం. అందుకే కొత్త విధానంలో విద్యార్థులకు సబ్జెక్టులు ఎంచుకునే స్వేచ్ఛ తగ్గకూడదు. వాళ్లు భవిష్యత్తులో ఏ రంగానికి వెళ్లాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా చదువుకునే అవకాశం ఉండాలి.
ఇప్పటివరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త విధానంలో కూడా 11వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఉంటాయా? 12వ తరగతికి పబ్లిక్ పరీక్ష ఉంటుందా? ఇంటర్నల్ అసెస్మెంట్కు ఎంత వెయిటేజ్ ఇస్తారు? ప్రాక్టికల్స్ ఎలా నిర్వహిస్తారు? మార్కుల మెమోలు, సర్టిఫికెట్లు ఏ బోర్డు జారీ చేస్తుంది? ఇవన్నీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిన అంశాలు.
ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. ఇంటర్ బోర్డు విలీనం చేసినంత మాత్రాన NEET, JEE, EAPCET వంటి ప్రవేశ పరీక్షలు ఆటోమేటిక్‌గా రద్దు కావు. ఆ పరీక్షలను నిర్వహించే సంస్థలు వేరు. వాటి అర్హతలు, సిలబస్, పరీక్షల విధానం వేరుగా నిర్ణయించబడతాయి. కాబట్టి కొత్త విధానం వచ్చినా విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేలా పాఠ్య ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా ఇంటర్నల్ మార్కులు, ప్రాక్టికల్ మార్కులు, బోర్డు పరీక్షల మార్కులు, ప్రవేశ పరీక్షల మధ్య సరైన సమన్వయం ఉండాలి.
తెలంగాణలో ఇంటర్ బోర్డు విలీనం చేసి 10+2 విధానం తీసుకొస్తే నిజంగా వర్కవుట్ అవుతుందా? అని అన్నది అందరిలో వ్యక్తమవుతున్న ప్రధాన ప్రశ్న. విద్యారంగంలో సమూల మార్పుల కోసం తీసుకొస్తున్న ఈ 10+2 విధానం సిద్ధాంతపరంగా చాలా మంచిదే అయినప్పటికీ.. దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సామే!
ఇది పూర్తిగా అమలు విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ప్రతి మండలంలో తగిన సంఖ్యలో సీనియర్ సెకండరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ఇంటర్ లెక్చరర్లను ఉపయోగించుకునే స్పష్టమైన విధానం తీసుకురావాలి. ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలి. సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు, కంప్యూటర్ సదుపాయాలు పెంచాలి. విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపులు, సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం కల్పించాలి. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలి. ఏడోది.. ఇప్పటికే ఇంటర్ చదువుతున్న విద్యార్థుల విషయంలో మధ్యలో సిలబస్, పరీక్షల విధానం మారకుండా ట్రాన్సిషన్ ప్లాన్ రూపొందించాలి. ఈ పనులన్నీ సక్రమంగా జరిగితే ఈ మార్పు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ కేవలం ఇంటర్ బోర్డును రద్దు చేసి, ఉన్న కాలేజీలను మరో శాఖలో కలిపేసి, అవసరమైన సదుపాయాలు కల్పించకపోతే మాత్రం ఆశించిన ఫలితాలు రావు.
ఇప్పుడు ఈ మార్పు అమలు చేయడానికి ముందు ప్రభుత్వం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ప్రస్తుత జూనియర్ కాలేజీలు కొత్త విధానంలో ఎలా కొనసాగుతాయి? ఇంటర్ బోర్డు స్థానంలో పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత ఎలా ఉంటుంది? MPC, BiPC, MEC వంటి గ్రూపులు కొనసాగుతాయా? ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలకు కొత్త గుర్తింపులు ఎలా ఇస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో 12వ తరగతి వరకు చదివించే స్కూళ్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని ఏర్పాటు చేయాలి? 2027–28లో కొత్తగా 11వ తరగతిలో చేరే విద్యార్థులకు ఎలాంటి సిలబస్, పరీక్షల విధానం ఉంటుంది? ఇప్పటికే చదువుతున్న ఇంటర్ విద్యార్థుల సర్టిఫికెట్లు, ఫలితాలు, అడ్మిషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు వచ్చినప్పుడే కొత్త విధానం ఎంతవరకు ఉపయోగపడుతుందో అర్థమవుతుంది.
మొత్తానికి తెలంగాణలో ఇంటర్ బోర్డు విలీనం అనేది చిన్న మార్పు కాదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పు. ఒకవైపు పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తున్న విద్యార్థులను తిరిగి విద్యా వ్యవస్థలో కొనసాగించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఉంది. మరోవైపు జూనియర్ కాలేజీల భవిష్యత్తు, లెక్చరర్ల ఉద్యోగాలు, విద్యార్థుల గ్రూపులు, పోటీ పరీక్షల ప్రిపరేషన్, విద్యా నాణ్యత వంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయాన్ని కేవలం ఇంటర్ బోర్డు రద్దు అనే కోణంలో చూడకూడదు. విద్యార్థులకు చదువు మరింత సులభం అవుతుందా? గ్రామీణ ప్రాంతాల పిల్లలకు అవకాశాలు పెరుగుతాయా? లేక విద్యా వ్యవస్థలో కొత్త సమస్యలు మొదలవుతాయా? అనేది అమలు విధానం నిర్ణయిస్తుంది.
జి.మహేష్ కుమార్ ✍️
సీనియర్ జర్నలిస్ట్