- నిధుల లేమి..సర్కారు నిర్లక్ష్యం !
- గాల్లో దీపంలా HPS ST విద్యార్థుల భవితవ్యం !
పేద, గిరిజన బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇప్పుడు అధికారుల ఉదాసీనత, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి బలైపోతోంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్)లో చదువుతున్న ఎస్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్ నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం, మరోవైపు నిర్వాహకులు చేతులెత్తేయడంతో చిన్నారుల విద్యాభ్యాసంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.

మంత్రులకు మొరపెట్టుకున్నా రాని రూ. 15 లక్షల బకాయిలు
హాస్టల్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 15 లక్షల బకాయిలు పెండింగ్లో పడ్డాయి. విద్యార్థుల భోజన వసతి, నిత్యావసరాల ఖర్చులతో పాటు వారిని రోజూ స్కూలుకు తరలించే రవాణా (ట్రాన్స్పోర్ట్) ఛార్జీలు కూడా పేరుకుపోయాయి. తమ జేబుల నుంచే సొంత డబ్బులు ఖర్చు చేసి నడపాల్సి వస్తోందని, ఇక తమ వల్ల కాదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బకాయిల విడుదలకు సంబంధించి ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ (ట్రైబల్ వెల్ఫేర్), విద్యాశాఖ ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పైసా కూడా విదిలించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది.

హాస్టల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
ప్రభుత్వం నుంచి నిధులు రాలేదన్న సాకుతో హాస్టల్ యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులకు శరాఘాతంగా మారింది. ‘హాస్టల్ నిర్వహణ మా వల్ల కాదు.. మీ పిల్లలను తీసుకెళ్లి ప్రైవేట్ హాస్టళ్లలో చేర్పించుకోండి’ అంటూ నిర్వాహకులు తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్లు పంపడంతో వివాదం రాజుకుంది.
దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో సడన్గా ఇలాంటి సందేశాలు పంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. “మధ్యలో చేతులెత్తేసేటప్పుడు అసలు టెండర్లు ఎందుకు దక్కించుకున్నారు? అప్పులు చేసి చదివించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మాపై ప్రైవేట్ హాస్టళ్ల భారం ఎలా వేస్తారు?” అంటూ ఆవేదనతో మండిపడుతున్నారు.

హెచ్పీఎస్ యాజమాన్యం ఏమంటోంది?
మరోవైపు విద్యార్థులకు రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో వారు రోజూ స్కూలుకు హాజరుకావడం కష్టతరంగా మారింది. దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ.. విద్యార్థుల అభ్యసనానికి ఆటంకం కలగకుండా చూడాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం, సంక్షేమ శాఖలదేనని స్పష్టం చేస్తోంది. గిరిజన విద్యార్థుల హాస్టల్, రవాణా అంశాలు పూర్తిగా ప్రభుత్వ విభాగాల పరిధిలోనివని, అయితే విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి సమస్యల వల్ల విద్యార్థుల హాజరు, వారి విద్యా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించి పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూలుకు వచ్చేలా చూడాలని అధికారులను కోరుతోంది.
ప్రభుత్వ అలసత్వం, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం మధ్య బడుగు విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతోంది. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. హాస్టల్ యథావిధిగా కొనసాగేలా చూసి, పిల్లలకు రవాణా అంతరాయం లేకుండా హెచ్పీఎస్లో వారి చదువు సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్,