ముగ్గురి అంత్యక్రియలు జరిపించిన మానవత్వం @ మల్కాపూర్ గ్రామం

  • కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో తీవ్ర విషాదం
  • ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
  • ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి మృతి
  • మల్కాపూర్‌లో కన్నీరు పెట్టిస్తున్న ఘటన

ఒకే కుటుంబంలో తీరని విషాదం…కన్నబిడ్డలతో సహా తల్లి మృత్యువాత. ఆ కుటుంబంలోనే కాదు…గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పేద కుటుంబానికి మరో కష్టం ఎదురైంది. ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దయనీయ పరిస్థితిని చూసి గ్రామ సర్పంచ్ కొండ యోగితా మధు చలించిపోయారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విలేజ్  వాట్సాప్ గ్రూపులో విజ్ఞప్తి చేశారు. దీంతో మృతుల కుటుంబ కులస్తులు, యువత, మల్కాపూర్‌ గ్రామస్తులు ఆర్థిక సాయం చేసేందుకు మానవత్వంతో ముందుకొచ్చారు. బాధిత కుటుంబ కులస్తులు, వృత్తి, ఉద్యోగరిత్యా హైదరాబాద్‌ వంటి సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు. ఫోన్, గూగుల్ పేల ద్వారా తమకు తోచినంత ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు జరిపించారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన కులస్తులకు, గ్రామస్తులకు మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ ప్రభుత్వ పాఠశాల టీచర్లు కూడా  విషాద ఘటనను చూసి జీర్ణించుకోలేకపోయారు. తమకు తోచిన ఆర్థికసాయం అందించారు. అంతేకాకుండా..ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు గ్రామస్తులతో పాటు అక్కడే ఉండి తమ  మానవత్వాన్ని చాటారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన యువత, గ్రామస్తులకు..సర్పంచ్ కొండ యోగితా మధు ధన్యవాదాలు తెలిపారు. ఆనందంలోనూ, దుఃఖంలోనూ ఇలానే కలిసి మెలిసి ఉండాలని పిలుపునిచ్చారు

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి మంజీరా నదిలో మృతి చెంది‌ంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగోళ్ల బాలకిష్టయ్య కుమార్తె సరిత, (30ఏళ్లు), తన ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (8ఏళ్లు), శాన్విక(6ఏళ్లు)లతో కలిసి అక్టోబర్ 26వ తేదీన అదృశ్యమైంది. దీంతో ఆందోళనకు గురైన సరిత తల్లిదండ్రులు భూమవ్వ, బాలకిష్టయ్య ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఏడుపాయల సమీపంలోని మంజీరా నది వద్దకు చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల తర్వాత,  బుధవారం ( అక్టోబర్ 28 ) తల్లి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న వయసులోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చిన్నారులు వైష్ణవి, శాన్వికలు గ్రామంలోని వృద్ధులకు చిన్నచిన్న సహాయాలు చేసే వారని స్థానికులు తెలిపారు. ఇప్పుడు వారి జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం ప్రకటించారు.

అయితే, సరిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయితేనే ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మొత్తానికి… కన్నీరు పెట్టించే ఈ ఘటనలో… ఒకవైపు ముగ్గురి మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచితే, మరోవైపు కష్టాల్లో ఉన్నవారికి మానవత్వమే అండగా నిలుస్తుందని మల్కాపూర్‌ గ్రామస్తులు చాటిచెప్పారు.

మల్కాపూర్ విషాద ఘటన

  • కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో తీవ్ర విషాదం
  • ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
  • ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి మృతి
  • ముగ్గురి అంత్యక్రియలకు లేని ఆర్థిక స్థోమత
  • పేద కుటుంబానికి అండగా నిలిచిన కులస్తులు, గ్రామస్తులు,టీచర్లు
  • హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆర్థిక సాయం
  • ఫోన్, గూగుల్ పే ద్వారా బాధిత కుటుంబానికి చేయూత
  • మానవత్వం చాటుకున్న మల్కాపూర్ గ్రామస్తులు
  • ఆదుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన గ్రామ సర్పంచ్  కొండ యోగితా మధు

ట్రెండింగ్ న్యూస్