- బీజేపీలో కాకుండా కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఎందుకు చేరారో తెలుసా?
సెప్టెంబర్ 28 : త్రికాల తెలుగు : ఢిల్లీలో అస్సాం దినపత్రిక ప్రతిదిన్ కాంక్లేవ్‌లో ఇండియాస్ నెక్ట్స్ చాఫ్టర్ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జర్నీని క్లుప్తంగా వివరించారు.
యాంకర్: కాంగ్రెస్ నుంచి అనేక మంది బీజేపీలో చేరుతున్న సమయంలో మీరు కాంగ్రెస్‌లో ఎలా చేరారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతూ..“విద్యార్ఙి సంఘంలో పని చేశావు.. బీజేపీలో చేరితే గొప్ప నాయకుడివి అవుతావు.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇతరులతో పాటు కేసీఆర్ తో చేరితే మంత్రి అవుతావని చాలా మంది చెప్పారు. కానీ 70 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్లనే మేం తెలంగాణ సాధించుకున్నాం. పెద్దదయిన ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోతామని తెలిసినా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. 175 శాసనసభ, 25 పార్లమెంట్ స్థానాలున్నా రాష్ట్రాన్ని ఆమె త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనం లేదు… 1200 మంది యువకుల ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజల ఆకాంక్షలను, ఆందోళలను గౌరవించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రలో అక్కడి నాయకులు కృత్రిమ ఉద్యమం తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఆమె తెలంగాణ ఇచ్చారు. ప్రజల ఆత్మగౌరవం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆమె ఏ లక్ష్యాలతో తెలంగాణ ఇచ్చారో వాటన్నింటిని కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. అందుకే నేను కాంగ్రెస్‌లో చేరాను. కేసీఆర్ ను ఓడించాను. తెలంగాణలో కాంగ్రెస్‌కు చోటు లేదని కొందరు అన్నా నేను కాంగ్రెస్‌లో చేరాను. నేను బయటి నుంచి వచ్చిన వ్యక్తిని అయినా అయిదేళ్లలోనే కార్యనిర్వాహక అధ్యక్షుడిని, ఎంపీని, పీసీసీ అధ్యక్షుడిని అయ్యాను. ముఖ్యమంత్రిని అయ్యాను. ఆ అవకాశాలన్నింటిని కాంగ్రెస్ నాకు ఇచ్చింది” అని చెప్పారు.