- రాహుల్ గాంధీ కంటే ముందే సోనియా గాంధీకి మరో సంతానం.. పుట్టిన రోజే కన్నుమూసిన పసిబిడ్డ!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలో ఎదుర్కొన్న ఓ వ్యక్తిగత విషాదాన్ని తొలిసారిగా తన ఆత్మకథలో వెల్లడించారు. రాహుల్ గాంధీ జన్మించడానికి ముందే తాను ఓ మగబిడ్డకు జన్మనిచ్చానని, అయితే ఆ శిశువు పుట్టిన కొద్ది గంటల్లోనే మరణించాడని ఆమె గుర్తుచేసుకున్నారు.

సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే ఆత్మకథ నవంబర్ 10న విడుదలైంది. ఇందులో 1969 జనవరి 18న జరిగిన ఈ విషాద ఘటన గురించి ఆమె వివరించారు. అప్పటికి ప్రసవానికి ఇంకా రెండు నెలల సమయం ఉండగానే, నెలలు నిండక ముందే ఆమెకు మగబిడ్డ జన్మించాడు. ఆ శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచగా, తొలిసారి బిడ్డ ఏడుపు విన్నానని సోనియా రాసుకొచ్చారు.
అయితే, బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో శిశువు మరణించిన విషయాన్ని రాజీవ్ గాంధీ ఆమెకు తెలియజేశారు. ఆ వార్తతో తామిద్దరం తీవ్ర విషాదంలో మునిగిపోయామని, రాజీవ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని సోనియా గుర్తుచేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఇందిరా గాంధీ తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఆసుపత్రికి చేరుకున్నారట. సోనియా, రాజీవ్‌లను ఓదార్చి వారితో కొంతసేపు గడిపారని ఆమె వెల్లడించారు.
ఇక ఆ పసిబిడ్డ అంత్యక్రియల విషయంలోనూ కుటుంబం ముందు క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. నవజాత శిశువును నదిలో వదిలేయాలనే సంప్రదాయం గురించి తెలుసుకున్న సోనియా, తన బిడ్డను అలా చేయడానికి అంగీకరించలేదని రాశారు. చివరకు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కలిసి మెహ్రౌలీలోని ఫిరోజ్ గాంధీ ఫామ్‌హౌస్‌లో ఓ బోగన్విల్లా పూల మొక్క కింద ఆ చిన్నారిని ఖననం చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు తాము అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఆ స్థలంలో పువ్వు ఉంచేవారమని సోనియా తెలిపారు.
ఈ విషాదం నుంచి క్రమంగా కోలుకున్న సోనియా, 1969 అక్టోబర్‌లో మరోసారి గర్భం దాల్చారు. అనంతరం 1970 జూన్ 19న రాహుల్ గాంధీకి జన్మనిచ్చారు. తన వ్యక్తిగత జీవితంలోని ఇంతటి భావోద్వేగ సంఘటనను దశాబ్దాల తర్వాత ఆత్మకథ ద్వారా సోనియా బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
-
రాహుల్‌కు ముందు సోనియాకు మరో బిడ్డ!
-
పుట్టిన కొద్ది గంటల్లోనే పసికందు మృతి!
-
ఆ విషాదాన్ని తొలిసారి వెల్లడించిన సోనియా!
-
బిడ్డను నదిలో వదిలేందుకు నిరాకరణ!
-
ఆత్మకథలో భావోద్వేగ విషయాలు వెల్లడి!