అక్కడ టపాసులపై కఠిన ఆంక్షలు..టపాసులు కాల్చితే జైలుశిక్ష, భారీ ఫైన్..!

  • దీపావళి వేడుకలపై ఆంక్షలు..
  • టపాసులు కాల్చితే జైలుశిక్ష, భారీ జరిమానా!

దేశమంతా దీపావళి సంబరాలకు సిద్ధమవుతుంటే.. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో మాత్రం బాణసంచా కాల్చడంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. దీపావళి వేడుకల సందర్భంగా టపాసులు కాల్చాలన్నా, వాటిని ఇంట్లో నిల్వ చేసుకోవాలన్నా ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

మిజోరం ప్రభుత్వం తీసుకొచ్చిన The Mizoram Regulation of Fireworks Act, 2026 ప్రకారం.. బాణసంచా వినియోగం, నిల్వకు సంబంధిత జిల్లా డిప్యూటీ కమిషనర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా 50 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. 12 ఏళ్లలోపు పిల్లలు టపాసులు కాల్చినా.. వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చని హోంమంత్రి కె. సప్దంగా వెల్లడించారు. అంతేకాదు.. అనుమతి లేకుండా బాణసంచా విక్రయిస్తే పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ నేరాలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసే అధికారం కూడా కలిగి ఉంటారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది. మిజోరం ప్రభుత్వం దీపావళి పండుగను పూర్తిగా నిషేధించలేదు. 2026 ప్రభుత్వ సెలవుల జాబితాలో నవంబర్ 8న దీపావళిని సెలవుగా ప్రకటించింది. ఆంక్షలు ప్రధానంగా బాణసంచా వినియోగంపైనే ఉన్నాయి.

మరి ఈ నిబంధనలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో కూడా ఇదే విధంగా అమలు చేస్తారా? అన్న చర్చ ప్రస్తుతం మొదలైంది.

  • మిజోరాంలో టపాసులపై కఠిన ఆంక్షలు!
  • అనుమతి లేకుండా బాణసంచా కాల్చితే జైలుశిక్ష!
  • ఉల్లంఘిస్తే రూ.50 వేల జరిమానా!
  • ప్రభుత్వ ఉద్యోగులకు రూ.లక్ష జరిమానా!
  • దీపావళి నిషేధం కాదు.. బాణసంచాపైనే ఆంక్షలు!

ట్రెండింగ్ న్యూస్