పావగఢ్ క్షేత్రానికి కొత్త శోభ 🔥

త్రికాల గుజరాత్ : మారిన మహాకాళి క్షేత్రం రూపురేఖలు! దాదాపు ఐదు శతాబ్దాల విరామం తర్వాత, గుజరాత్‌లోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం పావగఢ్ ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ‘చంపానెర్-పావగఢ్’ ఆధ్యాత్మిక, చారిత్రక క్షేత్రంలో మౌలిక వసతుల కల్పన, భక్తుల సౌకర్యార్థం గుజరాత్ ప్రభుత్వం రూ.359 కోట్లతో తలపెట్టిన భారీ మాస్టర్ ప్లాన్ శరవేగంగా ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు దశల పనులు విజయవంతంగా పూర్తయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

గుజరాత్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన పావగఢ్ లోని శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయంతో పాటు పరిసరాల్లోని చంపానెర్ పురావస్తు పార్కు రూపురేఖలను మార్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమం జరుగుతోంది. మొత్తం నాలుగు దశల ప్రాజెక్టులో భాగంగా గుజరాత్ పవిత్ర యాత్రాధామ్ వికాస్ బోర్డు ఆధ్వర్యంలో తొలి రెండు దశల కింద రూ.121 కోట్ల విలువైన పనులను ఇప్పటికే పూర్తి చేశారు.

జూన్ 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పునర్నిర్మించిన ‘శిఖరం‘పై పవిత్రమైన ధ్వజారోహణ చేసి ‘కలశాన్ని’ ప్రతిష్ఠించడంతో వందల ఏళ్లుగా నిలిచిపోయిన ఒక దివ్య సాంప్రదాయం పునరుద్ధరించబడింది. ఆ చారిత్రాత్మక మైలురాయిని మరింత ముందుకు తీసుకెళ్తూ, గుజరాత్ ప్రభుత్వం రూ. 359 కోట్ల వ్యయంతో మహాకాళి ఆలయంతో పాటు పరిసరాల్లోని చంపానేర్ ఆర్కియాలాజికల్ పార్క్ (యునెస్కో వారసత్వ ప్రాంతం) మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. భక్తులకు, అంతర్జాతీయ పర్యాటకులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా సేవలందించడమే లక్ష్యంగా ఈ మేగా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.

పావగఢ్ ప్రాంతం ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో విశిష్టమైనది. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ కాళికా మాతా శక్తిపీఠంతో పాటు ప్రాచీన జైన దేవాలయాలు, కొండ దిగువన యునెస్కో ప్రపంచ వారసత్వ నగరమైన చంపానెర్ ఉంది. ఈ ఆధ్యాత్మిక, చారిత్రక సంపదను కాపాడుతూనే పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. గుజరాత్ పవిత్ర యాత్రాధామ్ వికాస్ బోర్డ్ ద్వారా ఇప్పటికే రూ. 121 కోట్ల వ్యయంతో మొదటి రెండు దశల పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రదేశం యొక్క చారిత్రక, సాంస్కృతిక విశిష్టత దెబ్బతినకుండా భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మెరుగుపరచడమే ప్రధాన ధ్యేయంగా ఈ క్రింది అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత రికార్డు స్థాయిలో 3.8 కోట్ల మంది భక్తులు సందర్శించారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఏకంగా 3.84 కోట్లకు పైగా భక్తులు మహాకాళి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. భక్తులు, పర్యాటకులకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, ప్రపంచస్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

ఆలయ విస్తరణ: మహాకాళి ఆలయ ప్రాంగణాన్ని గతంలో ఉన్న 545 చదరపు మీటర్ల నుంచి ఏకంగా మూడు అంతస్తుల్లో 2,980 చదరపు మీటర్లకు విస్తరించారు. మాచీ చౌక్ నుంచి ఆలయం వరకు 2,374 మెట్లతో కూడిన 3.01 కిలోమీటర్ల సుదీర్ఘమైన, ఆధునిక పాదచారుల మార్గాన్ని నిర్మించారు. భక్తుల రాత్రివేళ ప్రయాణాన్ని సులభతరం చేస్తూ మార్గమంతటా విద్యుదీకరణ పూర్తి చేశారు. భద్రత, రద్దీ నియంత్రణ కోసం నిరంతర నిఘాతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా, చారిత్రక వైభవాన్ని కాపాడుతూనే పావగఢ్ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం తెలిపింది.

పర్యాటక రంగంలో సరికొత్త శకం!

పర్యాటక సౌకర్యాలను మరింతగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అంతర్గత, బాహ్య రహదారుల విస్తరణ, సుందరమైన ల్యాండ్‌స్కేపింగ్, విస్తృతమైన పార్కింగ్ సదుపాయాలు, బస్సు రవాణా మౌలిక వసతులు మరియు ప్రత్యేకంగా ‘వడ తలావ్’ ప్రాంతాన్ని సరికొత్తగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, ఘాట్లు, పాదచారుల వంతెన, పిల్లల ఆట స్థలాలు, పక్షుల వీక్షణ టవర్ (Birdwatch tower), స్థానిక చేతివృత్తుల హస్తకళల స్టాళ్లు నిర్మాణం కానున్నాయి. మిగిలిన 3, 4 దశల కోసం కేటాయించిన రూ.238 కోట్లతో చంపానెర్ చుట్టుపక్కల ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. మాచి చౌక్ వద్ద రూ.13.68 కోట్ల వ్యయంతో మల్టీ-లెవెల్ పార్కింగ్ భవనాన్ని నిర్మించారు.

శతాబ్దాల చరిత్ర – భక్తి పారవశ్యాల సంగమం

గుజరాత్‌లోని పంచ్‌మహల్ జిల్లాలో ఉన్న చంపానేర్-పావగఢ్ చరిత్రాత్మక, పురావస్తు, ఆధ్యాత్మిక అంశాల అరుదైన కలయిక. 2004లో దీనిని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 8వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్య విలసిల్లిన ఈ నగర వైభవం, 15వ శతాబ్దం చివర్లో సుల్తాన్ మహ్ముద్ బెగడా పాలనలో శిఖరాగ్రానికి చేరింది. ఆ సమయంలో ఆయన చంపానేర్‌ను గుజరాత్ రాజధానిగా చేసుకున్నారు. పావగఢ్ కొండల దిగువన విస్తరించి ఉన్న ఈ ప్రాంతం ఫోర్ట్‌లు, గేట్‌వేలు, మసీదులు, ఆలయాలు, రాజభవనాలు, దిగుడు బావులు (Stepwells) వంటి ఎన్నో అద్భుత నిర్మాణాలకు నిలయం. హిందూ-ఇస్లామిక్ వాస్తుశిల్ప శైలుల అరుదైన సమ్మేళనానికి ఇది నిదర్శనం.
భారతదేశంలో అత్యంత సమగ్రంగా సంరక్షించబడిన ప్రీ-మొఘల్ ఇస్లామిక్ నగరాలలో చంపానేర్ ఒకటి” అని యునెస్కో ప్రశంసించింది.

ఆధ్యాత్మిక శిఖరం: మహాకాళి అమ్మవారి దర్శనం

పావగఢ్ యాత్ర అంటేనే మహాకాళి అమ్మవారి దర్శనం. 51 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ కొండపై ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలో ఈ ప్రాంతమంతా భక్తిపారవశ్యంతో పులకించిపోతుంది. భక్తులు రాతి మెట్ల మార్గాన కాలినడకన గానీ, లేదా రోప్‌వే (Ropeway) ద్వారా మాచీ వరకు చేరుకుని, అక్కడ నుండి కొండపైకి నడచి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ ప్రయాణంలో చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు, పచ్చని కొండలు, చంపానేర్ ప్రాచీన కట్టడాల దృశ్యాలు పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి. మౌలిక వసతుల కల్పన, ఆలయ విస్తరణ ఫలితంగా పావగఢ్‌కు వచ్చే భక్తుల సంఖ్య అపారంగా పెరిగింది. 2016-17 నుండి 2021-22 వరకు (5 ఏళ్లు) దాదాపు 2.32 కోట్ల మంది భక్తులు సందర్శించారు. 2022-23 నుండి జూన్ 2026 వరకు 3.84 కోట్లకు పైగా ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 6.17 కోట్లకు పైగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది.

పర్యాటక సౌకర్యాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అంతర్గత రహదారుల విస్తరణ, విస్తృతమైన పార్కింగ్, బస్సు రవాణా వసతులతో పాటు ‘వడ తలావ్’ ప్రాంతాన్ని సరికొత్తగా తీర్చిదిద్దనున్నారు. వాడా తలావ్ (చెరువు) ప్రాంతంలో సుందరమైన ఉద్యానవనాలు, స్నాన్ ఘాట్‌లు, వాటర్ జెట్, ఫుట్‌బ్రిడ్జ్, థీమ్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పక్షుల వీక్షణ టవర్ (బర్డ్‌వాచ్ టవర్), హస్తకళల స్టాళ్లు మరియు మరో 500 కార్ల పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. రూ.135.19 కోట్ల అంచనాతో అంతర్గత, బాహ్య రహదారుల నిర్మాణం, కాలినడక దారులు, విద్యుదీకరణ, ల్యాండ్‌స్కేపింగ్ చేపట్టనున్నారు. అలాగే 600కు పైగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు పార్కింగ్‌తో పాటు బస్సు టెర్మినల్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక కేంద్రాలను ఆధునీకరిస్తూ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే ధ్యేయంగా ఈ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. కొత్త మౌలిక వసతులతో భారతదేశంలోనే అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక కేంద్రంగా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. 2016-17 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఈ పుణ్యక్షేత్రాన్ని 6.17 కోట్లకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ మౌలిక వసతుల ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, రాబోయే రోజుల్లో సందర్శకులకు మరియు భక్తులకు మరింత అత్యుత్తమ స్థాయి సేవలు, సౌకర్యాలు లభిస్తాయని గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్రెండింగ్ న్యూస్