ఖైరతాబాద్ బరిలో మళ్లీ దానం? కానీ..

  • ఖైరతాబాద్ బైపోల్ ఖాయం !
  • మళ్లీ బరిలో దానం నాగేందర్?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఖైరతాబాద్ ఉపఎన్నిక. దానం నాగేందర్ చుట్టూ తిరిగిన న్యాయపోరాటం చివరకు ఒక కొలిక్కి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ తరఫున ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ మొదలైన వివాదం హైకోర్టుకు చేరింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పార్టీ మారి ఎన్నికల్లో పోటీ చేస్తే అనర్హత వర్తిస్తుందని స్పష్టం చేస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయి ఉపఎన్నిక అనివార్యమైంది.

కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినప్పటికీ దానం నాగేందర్ మాత్రం చాలా ప్రశాంతంగా స్పందించారు. ఎంపీగా పోటీ చేసినప్పుడే ఈ పరిస్థితి వస్తుందని తనకు తెలుసని, న్యాయపరంగా పోరాటం చేశానని మీడియాకు తెలిపారు. కోర్టు తీర్పును గౌరవిస్తానని, అయితే మళ్లీ పోటీ చేయకూడదని కోర్టు చెప్పలేదని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంపై తనకు పూర్తి పట్టు ఉందని, ప్రజల మద్దతు తనకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఉపఎన్నికలో పోటీ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని, గతంలో మాదిరిగానే ఈసారి కూడా గెలిచి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒక సాధారణ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.

దానం నాగేందర్ మొదటిసారిగా 1989లో ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పట్టువదలకుండా ప్రయత్నించి 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీలో చేరి గెలుపొందారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ తరఫున జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఆసిఫ్‌నగర్ స్థానంలో ఖైరతాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆరోగ్య, కార్మిక శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన పరాజయం చెందారు. ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పటికీ బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడంతో తాజాగా ఆయనపై అనర్హత వేటు పడింది.

దానం నాగేందర్ ఎన్నికల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే.. ఆయన మొత్తం 8 సార్లు అసెంబ్లీకి (ఒక ఉపఎన్నికతో కలిపి), ఒకసారి లోక్‌సభకు పోటీ చేశారు. అసెంబ్లీకి పోటీ చేసిన 8 సార్లలో 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించగా, 3 సార్లు పరాజయం పాలయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒకసారి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో రాబోయే ఖైరతాబాద్ ఉపఎన్నిక ఆయన రాజకీయ భవిష్యత్తుకు మరో కీలక పరీక్షగా మారనుంది.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్