- ఎన్నికల సంఘంలో అంతర్యుద్ధం
- ప్రజాస్వామ్య పీఠంపై పెను సంక్షోభం
- 13 కోట్ల ఓట్ల తొలగింపుపై ఇద్దరు కమిషనర్ల తిరుగుబాటు
- ECIలో చీలిక.. బయటపడ్డ 14 అధికారిక అభ్యంతరాలు !
- ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న విపక్షాలు
- ECI అంతర్గత పోరుపై ‘ఓటు చోరీ’ ఆరోపణలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి భారత ఎన్నికల సంఘం లోపల అసలేం జరుగుతోంది? నిష్పక్షపాతానికి, పారదర్శకతకు మారుపేరుగా నిలవాల్సిన అత్యున్నత రాజ్యాంగ పీఠంపై ఇప్పుడు చీకటి నీడలు కమ్ముకున్నాయా? కమిషన్‌లోని ముగ్గురు కీలక సభ్యుల్లో ఇద్దరు కమిషనర్లు స్వయంగా తిరుగుబాటు బావుటా ఎగురవేయడం వెనుక దాగిన దిగ్భ్రాంతికర నిజాలేంటి? ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పరిశోధనాత్మక కథనం వెలికితీసిన ఆధారాలు కేవలం సాధారణ పరిపాలనా లోపాలను మాత్రమే ఎత్తిచూపడం లేదు. స్వతంత్ర భారత ప్రజాస్వామ్య పునాదులనే కదిలించే ఒక నిర్మాణాత్మక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయి.

2025 జూన్‌లో బీహార్ నుంచి ప్రారంభించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియ కింద, దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ముసాయిదా ఓటర్ల జాబితాల నుండి ఏకంగా 13 కోట్లకు పైగా పేర్లను తొలగించారు. సాధారణంగా జరిగే వార్షిక సవరణలా కాకుండా, ఇంత భారీ ఎత్తున పేర్లను ఏరివేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, అసలు భూకంపం బయట కాదు, ఎన్నికల సంఘం నాలుగు గోడల మధ్యే సంభవించింది. మొత్తం ముగ్గురు సభ్యులుండే ఈ కమిషన్‌లో, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు—సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి—ముఖ్య నిర్ణయాలు తమకు తెలియకుండానే జరిగిపోతున్నాయని గళమెత్తారు. గత 10 నెలల వ్యవధిలో వారు ఏకంగా 14 సార్లు అధికారికంగా తమ తీవ్ర అసమ్మతిని రికార్డు చేశారు. ఒకే రోజు నాలుగుసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. తమ లిఖితపూర్వక హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు జారీ అవుతుండటంపై వారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు నేరుగా ఫిర్యాదులు పంపారు.
దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి పూరించే పత్రం ‘ఫామ్-6’. 2025 జూలైలో ఈ దరఖాస్తులో ఒక సరికొత్త నిబంధనను తప్పనిసరి చేశారు. దరఖాస్తు చేసుకునే వ్యక్తి లేదా వారి తల్లిదండ్రులు/తాతముత్తాతల పేర్లు గత ‘SIR’ జాబితాలో ఉన్నాయా లేదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే దరఖాస్తు ముందుకు సాగదు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిబంధనలను చట్టబద్ధంగా సవరించకుండా ఫామ్-6ను మార్చడం కుదరదని మే నెలలోనే కమిషనర్ జోషి ఫైల్‌పై రాశారు. దానిని సంధు సమర్థించారు. అయినా ఆ నిబంధనను బలవంతంగా వ్యవస్థలోకి తెచ్చారు. ఆగస్టు 13న సంధు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది “పూర్తిగా అనధికారికం, చట్టవిరుద్ధం” అని తేల్చిచెప్పారు. దీనివల్ల నిరుపేదలు, వలస కార్మికులు కొత్తగా ఓటు హక్కు పొందడం దాదాపు అసాధ్యంగా మారింది.

ఎన్నికల సంఘం విశ్వసనీయతకు దశాబ్దాలుగా రక్షణగా నిలిచింది ‘వికేంద్రీకరణ’. నియోజకవర్గ స్థాయిలో ఉండే సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ మాత్రమే చట్టబద్ధంగా ఓటర్ల జాబితాను తయారుచేసే అధికారం కలిగి ఉంటారు. కానీ ‘ECINet’ సాఫ్ట్‌వేర్ ద్వారా క్షేత్రస్థాయి ఈఆర్‌ఓల అధికారాలను కుదించి, మొత్తం డేటాబేస్‌ను ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ పరిణామంపై కమిషనర్లు భగ్గుమన్నారు. చట్టబద్ధ అధికారులకు ఉన్న యాక్సెస్‌ను కట్టడి చేసే అధికారం కమిషన్ ఐటీ డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నాకు లేదని సంధు నిలదీశారు. డేటాబేస్‌ను ఎవరు మారుస్తున్నారు, పేర్లు ఎలా గల్లంతవుతున్నాయో తేల్చడానికి స్వతంత్ర ఆడిట్ జరపాలని జోషి డిమాండ్ చేశారు.
బెంగాల్‌లో సాంకేతిక వ్యత్యాసాల పేరుతో భారీగా ఓట్లను తొలగించడంపై వివాదం రేగడంతో, ఫిబ్రవరి 2026లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 60 లక్షల వివాదాస్పద ఓట్ల పరిశీలన బాధ్యతను న్యాయాధికారులకు అప్పగించింది. ఆ తర్వాత విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తుల ట్రిబ్యునళ్ల ముందు ఏకంగా 38 లక్షల అప్పీళ్లు చేరాయి. ఇందులో తొలగించిన 22.21 లక్షల మంది ఓటర్లు తమను చేర్చాలని వేసినవి కాగా.. న్యాయాధికారులు అర్హులని తేల్చి చేర్చిన 16.10 లక్షల మందిని మళ్లీ తొలగించాలని స్వయంగా ఈసీ తరఫునే అప్పీళ్లు దాఖలయ్యాయి.
“న్యాయాధికారులు చేర్చిన ఓటర్లపై అప్పీల్ చేయాలని ఈసీ తరఫున ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అసలు ఎవరి అనుమతితో ఈ పిటిషన్లు వేశారు?” అని సంధు ఉన్నతాధికారులను నిలదీశారు. దీనిపై తనకు గానీ, జోషికి గానీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి గానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. సాఫ్ట్‌వేర్ కేంద్రీకరణ ఎంతటి అనర్థానికి దారితీసిందో గోవా ఘటన స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గోవా ఈఆర్‌ఓలు విచారణ జరిపి, సరైన ధ్రువపత్రాలు సమర్పించిన 97 మంది ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చడానికి అర్హులుగా తేల్చారు. కానీ, ఢిల్లీలోని సాఫ్ట్‌వేర్‌లో వారి పేర్లను తిరిగి చేర్చేందుకు వీలైన ‘రోల్‌బ్యాక్ ఆప్షన్’ సాంకేతికంగా అందుబాటులో లేకుండా పోయింది. గోవా సీఈవో కార్యాలయం ఢిల్లీ ఉన్నతాధికారులకు 8 సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. ఫలితంగా, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలున్నా, అధికారులు స్వయంగా ధ్రువీకరించినా.. ఒక చిన్న సాఫ్ట్‌వేర్ ఫీచర్ లేదనే కారణంతో ఆ 97 మంది పౌరుల ఓటు హక్కు గల్లంతయింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఒక బహుళ సభ్య సంస్థ. 2023 చట్టం ప్రకారం అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ అభిప్రాయంతో జరగాలి. సీఈసీ ‘సమానుల్లో ప్రథముడు’ మాత్రమే తప్ప మిగిలిన ఇద్దరికీ బాస్ కాదు. కానీ ఇక్కడ ఇద్దరు కమిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించినా కీలక ఆదేశాలు అమలయ్యాయంటే.. సంస్థాగత సమష్టి నిర్ణయాధికారానికి పూర్తిగా తూట్లు పడ్డాయి. క్షేత్రస్థాయి అధికారుల ప్రమేయం లేకుండా, ఢిల్లీలోని ఐటీ సర్వర్ల ద్వారా అల్గారిథమ్‌ల ఆధారంగా పేర్లను తొలగించడం అత్యంత ప్రమాదకరమైన ధోరణి. సరైన ఆడిట్ ట్రయల్ లేకుండా డిజిటల్ డేటాను కేంద్రీకరించడం వల్ల అర్హులైన నిజమైన పౌరులు తమకు తెలియకుండానే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అంతర్గత నిబంధనల ఉల్లంఘనలు, ఐటీ విభాగం తీరుపై ఇద్దరు కమిషనర్లు సంప్రదాయానికి విరుద్ధంగా ఏకంగా కేంద్ర ప్రభుత్వ ‘కేబినెట్ సెక్రటరీ’కి లేఖలు రాశారు. స్వతంత్ర రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషనర్లు ఒక ప్రభుత్వ బ్యూరోక్రాట్ తలుపు తట్టాల్సి వచ్చిందంటే.. సంస్థ లోపల అంతర్గత సమస్యల పరిష్కార యంత్రాంగం ఎంత ఘోరంగా కుప్పకూలిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2023 చట్టం ప్రకారమే ఈ ముగ్గురు అధికారులు నియమితులయ్యారు. అయితే ప్రభుత్వం నియమించిన అధికారుల మధ్యే ఇంతటి తీవ్ర అగాధం ఏర్పడటం, కమిషన్ నిర్ణయాలు రాజ్యాంగ సూత్రాల కంటే అదృశ్య శక్తుల ప్రభావంతో జరుగుతున్నాయన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

ఈ నివేదిక బయటకు రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ మొదలైంది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా.. అధికార పక్షం, ఈసీ కూడా తమ వాదనలను వినిపించాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని నేరుగా రాజ్యాంగంపై జరిగిన దాడిగా, వ్యవస్థాగత “ఓటు చోరీ”గా అభివర్ణించారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రభావంతోనే ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ పార్టీలు కూడా ఈ కమిషన్ నిష్పక్షపాతతను తీవ్రంగా ప్రశ్నించాయి. అయితే విపక్షాల ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ముగ్గురు సభ్యులున్న అత్యున్నత కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలు, నోట్స్ రాయడం, చర్చలు జరగడం చాలా సాధారణమైన ప్రక్రియ అని తెలిపింది. అన్ని నిర్ణయాలు చట్టబద్ధంగానే జరిగాయని పేర్కొంది. అటు బీజేపీ నేతలు స్పందిస్తూ.. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పరాజయ భయంతోనే స్వతంత్ర రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఎదురుదాడికి దిగారు.
ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఓటర్ల జాబితాను సరిచేస్తుంది. దీన్ని Summary Revision అంటారు. ఇందులో చనిపోయిన వారి పేర్లు తీసేయడం, కొత్తగా 18 ఏళ్లు వచ్చిన వారిని చేర్చడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. కానీ ‘ఇంటెన్సివ్ రివిజన్’ అనేది దశాబ్దాల తర్వాత మాత్రమే చేపట్టే ఒక భారీ ప్రక్షాళన. భారతదేశం మొత్తం ఓటర్ల జనాభా సుమారు 97 కోట్లు. అందులో 13 కోట్లు అంటే దాదాపు 13% కంటే ఎక్కువ ఓటర్లు ఒక్క దెబ్బతో ముసాయిదా జాబితాల నుంచి తొలగించబడ్డారు. సాధారణంగా బూత్ లెవల్ ఆఫీసర్ ఇంటింటికీ వెళ్లి ఓటరు ఉన్నాడో లేడో ధ్రువీకరించుకోవాలి. కానీ ఈసారి గ్రౌండ్ వెరిఫికేషన్ కంటే ఎక్కువగా కంప్యూటర్ అల్గారిథమ్‌ల ఆధారంగా పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి తొలగించారనేది ప్రధాన ఆరోపణ. దీనివల్ల పొట్టకూటి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, పాత పత్రాలు లేని నిరుపేదలు భారీగా ఓటు హక్కు కోల్పోయే ముప్పు ఏర్పడింది.
ఫామ్-6 మార్పు వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. భారత పౌరసత్వానికి, ఓటు హక్కుకు ముడిపెట్టే ప్రయత్నంగా ఈ మార్పును నిపుణులు చూస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండి, ఆ నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉన్న ఏ భారత పౌరుడైనా ఓటరు కావచ్చు. తన అర్హతను రుజువు చేసుకోవడానికి వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇస్తే సరిపోతుంది. గత SIR లిస్టులో మీ తల్లిదండ్రులు లేదా తాతల పేర్లు ఉన్నాయా?” అనే ప్రశ్నను తప్పనిసరి చేయడం అంటే.. ఒక రకంగా అది పౌరుడిపై ‘తమ వంశపారంపర్య ఉనికిని రుజువు చేసుకోవాలనే’ అదనపు భారాన్ని మోపడమే అవుతుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 కింద ఉన్న Registration of Electors Rules, 1960 ప్రకారం ఎన్నికల ఫారాలను మార్చాలంటే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, పార్లమెంట్ పరిశీలనకు పెట్టాలి. కమిషనర్లు వ్యతిరేకించినా, ప్రభుత్వం నిబంధనలు మార్చకుండానే ఐటీ విభాగం నేరుగా ఆన్‌లైన్ ఫారంలో ఈ మార్పు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కమిషనర్లు వాదించారు.
ఎన్నికల వ్యవస్థలో మోసాలు జరగకుండా గతంలో ఒక బ్రహ్మాండమైన రక్షణ కవచం ఉండేది. అదేంటంటే.. ఏ ఒక్క అధికారికీ దేశం మొత్తం ఓటర్ల జాబితాను మార్చే అధికారం ఉండదు. నియోజకవర్గానికి బాధ్యుడైన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఆ జాబితాను ఆమోదించే తుది చట్టబద్ధమైన అధికారం ఉంటుంది. ERONet స్థానంలో వచ్చిన కొత్త క్లౌడ్ ఆధారిత వ్యవస్థలో సర్వర్ల నియంత్రణ మొత్తం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లిపోయింది. అక్కడ కూర్చున్న ఒక అధికారి ఒక కమాండ్ ఇస్తే లక్షలాది పేర్లు ప్రభావితమయ్యే పరిస్థితి వచ్చింది. గోవాలో స్థానిక మెజిస్ట్రేట్ 97 మందిని చేర్చాలని అనుకున్నా, ఢిల్లీ సర్వర్‌లో ‘బటన్’ లేకపోవడం వల్లే సాధ్యం కాలేదంటే.. క్షేత్రస్థాయి అధికారుల చేతులెత్తేయించి, అధికారాన్ని ఢిల్లీ టెక్నాలజీ విభాగం ఎలా గుప్పిట్లోకి తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ఎవరికీ జవాబుదారీ కాదు కేవలం భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టులకు తప్ప. అది ప్రభుత్వానికి లోబడి పనిచేయదు. కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఐఏఎస్ అధికారి ‘కేబినెట్ సెక్రటరీ’. ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర మంత్రిమండలికి పరిపాలనాపరమైన అధిపతి. ఎన్నికల సంఘం అంతర్గతంగా నిర్ణయాలు తీసుకోలేక, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేక, సీఈసీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని భావించి.. ఇద్దరు కమిషనర్లు కేబినెట్ సెక్రటరీకి లేఖ రాయడం అంటే.. స్వయంగా రాజ్యాంగ సంస్థే కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం) జోక్యాన్ని కోరినట్టయింది. ఇది ఎన్నికల సంఘం స్వతంత్రతను ప్రాథమికంగానే ప్రశ్నార్థకం చేసింది.
అంతేకాదు పోలింగ్ శాతాలపై ప్రభావం చూపుతుంది. అర్హులైన కోట్ల మంది పేర్లు జాబితాల నుంచి తొలగిపోతే, పోలింగ్ రోజున ఓటరు కార్డు ఉన్నా ఓటు వేయలేని పరిస్థితి ప్రజలకు ఎదురవుతుంది. పశ్చిమ బెంగాల్ ఉదాహరణ చూస్తే, 49 స్థానాల్లో గెలుపు మార్జిన్ కంటే SIR తొలగించిన ఓట్లే ఎక్కువ. రేపు దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. గెలుపోటములను ఓటర్లు నిర్ణయించారా లేక సాఫ్ట్‌వేర్ తొలగించిన పేర్లు నిర్ణయించాయా అనే బలమైన అనుమానం ప్రజల్లో మిగిలిపోతుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ తన సహచర కమిషనర్ల మాట వినకపోవడం, మెజారిటీ నిర్ణయాలను పక్కనబెట్టడం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

ఓటు హక్కు అనేది రాజ్యాంగం భారత పౌరుడికి ప్రసాదించిన అత్యంత పవిత్రమైన ఆయుధం. ఎన్నికల సంఘం స్వతంత్రత, నిష్పక్షపాత వైఖరిపై ఏ చిన్న అనుమానం వచ్చినా అది దేశ ప్రజాస్వామ్య విశ్వసనీయతనే దెబ్బతీస్తుంది. ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన 14 రాతపూర్వక అభ్యంతరాలేంటి? తొలగించిన 13 కోట్ల ఓట్ల పరిస్థితి ఏమిటి? డిజిటల్ వ్యవస్థలను ఎవరు నియంత్రిస్తున్నారు? అనే అంశాలపై కమిషన్ మౌనం వీడాలి. వెంటనే సమగ్ర వివరాలతో కూడిన శ్వేతపత్రం లేదా స్వతంత్ర న్యాయ విచారణ ద్వారా వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచినప్పుడే భారత ఎన్నికల వ్యవస్థపై పౌరులకు నమ్మకం పునరుద్ధరించబడుతుంది.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్,