- రూ.1.01 కోట్లు పలికిన గణపతి లడ్డూ
- హైదరాబాద్ రిచ్‌మండ్ విల్లాస్‌లో రికార్డు వేలం!
హైదరాబాద్, సెప్టెంబర్ 26: త్రికాల తెలుగు: గణేశ్ నిమజ్జనోత్సవాల వేళ భాగ్యనగరంలో లడ్డూ వేలం పాటలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బండ్లగూడ జాగీర్‌లోని ప్రముఖ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో నిర్వహించిన లడ్డూ వేలం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ స్వామివారి వద్ద ఉంచిన 5 కిలోల లడ్డూ ప్రసాదం ఏకంగా ₹1.01 కోట్ల (ఒక కోటి ఒక లక్ష రూపాయలు) రికార్డు ధరకు అమ్ముడైంది.

లడ్డూ కోసం స్థానిక నివాసితులు, భక్తులు పెద్ద ఎత్తున వేలంలో పోటీపడ్డారు. అయితే ఏ ఒక్క వ్యక్తో కాకుండా, విల్లా యజమానుల బృందం ఉమ్మడిగా పూల్ అయి ఈ భారీ మొత్తాన్ని వెచ్చించి పవిత్ర ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో పాటు సమాజ హితం కోసం వీరంతా కలిసి ముందుకు వచ్చారు.
గత కొన్నేళ్లుగా రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూ వేలం ద్వారా పోగైన మొత్తాన్ని స్వచ్ఛంద, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈసారి వచ్చిన రూ.1.01 కోట్లను కూడా పేద విద్యార్థుల చదువు, వైద్య సాయం, పర్యావరణ పరిరక్షణతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోట్లు వెచ్చించి దైవ ప్రసాదాన్ని దక్కించుకోవడమే కాకుండా, ఆ మొత్తాన్ని పేదలకు చేరవేస్తున్న విల్లా వాసుల చొరవపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.