జూలై వచ్చినా కరువేనా? అన్నదాతల ”ఆక్రందన!”

త్రి.విశ్లేషణ : మృగశిర కార్తె దాటిపోయింది.. జూన్ గడిచిపోయింది. జూలై నెల చివరికి వచ్చేసాం.. అయినా ఆకాశంలో మబ్బుల జాడే లేదు! వరుణ దేవుడు కరుణించడా? కాలం కలిసిరాదా? అని తెలంగాణ అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. నాగళ్లు పట్టి దుక్కి దున్నిన చేతులు..ఆకాశం వైపు దీనంగా చూస్తున్నాయి. ఎల్‌నినో ఎఫెక్టా? లేక రుతుపవనాల మందగమనమా? అసలు ఎందుకు తెలంగాణలో వర్షాలు కురవడం లేదు? ఎండిపోతున్న నారుమడులతో రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

సాధారణంగా జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకుతాయి. జూన్ ఆఖరి నాటికి రాష్ట్రమంతా నాట్లతో బిజీగా ఉండాలి. కానీ, ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. జూలై నెల ముగింపులో ఉన్నా… రాష్ట్రంలో 50 శాతానికి పైగా వర్షపాత లోటు కనిపిస్తోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షాలు లేక దారుణ పరిస్థులు నెలకొన్నాయి. వర్షాల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.. దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సైతం బోర్ల కింద పోసిన వరి నారుమడులు ఎండ తీవ్రతకు మాడిపోతున్నాయి. వర్షాలు పడతాయనే ఆశతో విత్తనాలు వేసిన రైతులు.. ఇప్పుడు మొలకలు ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పలు జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. జూన్ మొదటి వారంలోనే వానలు పడతాయని ఆశించి, రైతులు ఎకరాకు వేల రూపాయలు ఖర్చు పెట్టి నారు పోశారు. రెండు నెల రోజులుగా చుక్క వాన లేదు. ఎండలు మే నెలలా దంచికొడుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు కూడా మొరాయిస్తున్నాయి. నారు పోసి ముప్పై రోజులు దాటిపోతోంది. వర్షం లేక నారంతా ఎర్రబడి చచ్చిపోతోంది. బోర్లల్లో కూడా నీళ్లు రావడం లేదు. ఈ ఏడాది తమ బతుకులు ఏం కావాలో అర్థం కావడం లేదు. గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. జూన్, జూలై నెలల్లో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు పెరగంలేదు. దీనివల్ల గతంలో 200–300 అడుగుల్లో పడిన నీళ్లు, ఇప్పుడు 500 అడుగులు వేసినా పడటం లేదు. వర్షాలు లేకపోవడం వల్ల రైతులంతా ఒకేసారి బోర్ల వైపు మొగ్గుచూపారు. దీనివల్ల అగ్రికల్చర్ ఫీడర్లపై లోడ్ పెరిగి, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, లో-వోల్టేజ్ సమస్యలు రావడం తలెత్తుతున్నాయి.

ఈ ఏడాది అంతర్జాతీయంగా వాతావరణంలో వచ్చిన మార్పులు, ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్‌నినో’ తీవ్రత కారణంగా భారత ఉపఖండంలో రుతుపవనాలు బలహీనపడ్డాయి. ఎల్‌నినో వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి, మన వైపు రావాల్సిన చల్లటి తేమ గాలులు రాకుండా అడ్డుపడుతున్నాయి. సాధారణంగా జూన్, జూలై నెలల్లో బంగాళాఖాతంలో కనీసం రెండు లేదా మూడు బలమైన అల్పపీడనాలు ఏర్పడాలి. అవి ఏర్పడితేనే తెలంగాణ గుండా మేఘాలు ప్రయాణించి విస్తారంగా వర్షాలు పడతాయి. కానీ ఈసారి బంగాళాఖాతంలో ఎలాంటి వ్యవస్థలు ఏర్పడకపోవడం వల్ల రుతుపవన ద్రోణి తూర్పు వైపునకు కదలడం లేదు. నైరుతి నుంచి రావాల్సిన తేమ గాలులకు బదులు, మధ్య భారతదేశం నుండి పొడి గాలులు తెలంగాణపైకి వీస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి, మబ్బులు పట్టినా కూడా వర్షంగా మారకుండానే కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా వర్షాలు మందగించడంతో కృష్ణా, గోదావరి నదుల ద్వారా తెలంగాణ ప్రాజెక్టుల్లోకి రావాల్సిన ‘ఇన్‌ఫ్లో’ పూర్తిగా నిలిచిపోయింది.

తెలంగాణలో ప్రస్తుతం రుతుపవనాలు మందగించాయి. జూలై నెలలోనూ భారీ వర్షాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడినా… భారీ వర్షాలు మాత్రం ఇప్పటి వరక ఎక్కడా పడలేదు. ఈ నేపథ్యంలో తొందరపడి విత్తనాలు వేయకండి అంటూ పడవచ్చు అని వాతావరణ శాఖ అధికరులు సూచిస్తున్నారు. ఇంకా విత్తనాలు వేయని రైతులు కనీసం 50 నుండి 60 మి.మీ వర్షపాతం నమోదయ్యే వరకు విత్తనాలు వేయకూడదని చెబుతున్నారు. వర్షాలు పడకపోతే, ఎక్కువ నీరు కావాల్సిన వరికి బదులు తక్కువ కాలపరిమితి గల ఆరుతడి పంటలైన పెసర, మినుము, జొన్న లేదా సజ్జలు వేసుకోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. బోర్ల కింద నారు పోసిన రైతులు.. లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయడం వల్ల నారు ఎండిపోకుండా కొంతకాలం కాపాడుకోవచ్చు అని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.

రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కేవలం వాతావరణ నివేదికలు చూస్తూ కూర్చోలేవు. తక్షణమే కరువు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఉంది. బోర్ల కింద పంటలు కాపాడుకోవడానికి రైతులకు కరెంట్ కోతలు లేకుండా పగటిపూట ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలి. ఒకవేళ పంటలు ఎండిపోతే, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి వీలుగా 80% సబ్సిడీతో ఆరుతడి పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. వ్యవసాయం నడవకపోతే కేవలం రైతులు మాత్రమే కాదు, దానిపై ఆధారపడ్డ లక్షలాది మంది వ్యవసాయ కూలీల బతుకులు రోడ్డున పడతాయి. పల్లెల్లో పనులు లేక మళ్లీ ‘వలసల బాట’ పట్టే ప్రమాదం పొంచి ఉంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. వర్షం వస్తేనే దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటాడు. జూలై వచ్చినా వరుణుడు ముఖం చాటేయడంతో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతుల గుండెల్లో ఆందోళన మొదలైంది. ప్రకృతి సృష్టించిన ఈ విపత్తులో అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.

-జి.మహేష్‌ కుమార్ ✍️
సీనియర్ జర్నలిస్ట్-9491383455

ట్రెండింగ్ న్యూస్