
త్రికాల తెలుగు: హైదరాబాద్: హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారులతో సమీక్షించారు.
అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణ జరపకుండా టెండర్లను పిలవొద్దని, భూ సేకరణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో పనుల అనుమతుల కోసం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమన్వయ సమావేశం నిర్వహించాలని చెప్పారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ పనులను వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (NIUM) భవన నమూనా, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నమూనాను పరిశీలించి పలు సూచనలు చేశారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్ , GHMC కమిషనర్ అర్వీ కర్ణన్ , CMC కమిషనర్ జి సృజన, MMC కమిషనర్ టి వినయ్ కృష్ణారెడ్డి, HYDRAA కమిషనర్ ఏవీ రంగనాథ్, MRDCL మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి గారు, జల మండలి ఎండీ అశోక్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.