విపక్ష కూటమిలో ప్రకంపనలు !

దేశ రాజకీయాల్లో జరిగిన ఒక ఆసక్తికర పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు నీట్‌ పేపర్‌ లీక్‌పై విద్యార్థుల ఆందోళనలు, విపక్ష ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రతరం చేసిన సమయంలోనే, ఆ కూటమిలోని కీలక నేత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సమావేశం జరగడం విశేషం. ఈ భేటీతో మహారాష్ట్ర రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

మోదీతో భేటీ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయానికి విచ్చేసిన పవార్‌ను మోదీ ఆత్మీయంగా ఆహ్వానించారు. స్వయంగా గుమ్మం వద్దకు ఎదురెళ్లి స్వాగతించారు. నీట్ లీకేజీతో పాటు పలు అంశాలపై పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తుంటే… ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ కీలక భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోదీ, శరద్ పవార్‌ను చిరునవ్వుతో చేతిని పట్టుకుని ఆహ్వానించడం, ఇద్దరు నాయకులు ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ చర్చించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపారు. రైతుల సమస్యలు, నీటిపారుదల రంగానికి సంబంధించిన పలు అంశాలపై పవార్ ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం.

అయితే, ఇదే సమయంలో ఎన్డీయే కూటమికి పవార్‌ పార్టీ మద్దతు ఇవ్వనుందనే చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్‌లో రెండొంతుల మెజార్టీ కోసం మోదీ సర్కార్… మద్దతు కూడగట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఎన్సీపీ (ఎస్పీ) కూడా అధికార ఎన్డీఏకు మద్దతిచ్చే అవకాశాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ పార్టీ మద్దతు ప్రభుత్వానికి చాలా కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా 50 శాతం సీట్ల పెంపుపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఇటీవలే సుప్రియా సూలే సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య శరద్ పవార్ పార్టీ ఎన్‌డీఏ కూటమిలో చేరుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

శరద్ పవార్ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసి మద్దతు తెలిపి, పోలీసు చర్యను ఖండించిన మరుసటి రోజే ప్రధాని మోదీని కలవడం చర్చనీయాంశమైంది. ప్రజా సమస్యలపై పోరాడుతూనే, మరోవైపు ప్రభుత్వ పెద్దలను కలిసి చర్చించడం ప్రజాస్వామ్య హుందా తనానికి నిదర్శనం అన్న చర్చ కూడా జరుగుతోంది. పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన నిరసనను కొనసాగిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు ఆ పార్టీ మద్దతు తెలిపింది. నిరసన తెలుపుతున్న విద్యార్థుల డిమాండ్లను శరద్ పవార్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులను అణచివేయకుండా, ప్రభుత్వం వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించి చర్చలు జరపాలని ఆయన కోరినట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్న వేళ, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు, పెండింగ్ బిల్లులు, రాజకీయ సమీకరణాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. శరద్ పవార్, సుప్రియా సూలే ప్రధానిని కలవడం వెనుక కేవలం విద్యార్థుల సమస్యలే కాకుండా, రాబోయే పార్లమెంటరీ బిల్లులపై మద్దతు కోరే లేదా తెలిపే విషయాలపై కూడా చర్చ జరిగి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. విపక్షాల తరఫున అనుభవజ్ఞుడైన శరద్ పవార్ నేరుగా ప్రధానిని కలవడం ద్వారా అధికార పార్టీపై యువత సమస్యల విషయంలో తీవ్రమైన నైతిక ఒత్తిడిని పెంచగలిగారని విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్న సమయంలో, ప్రతిపక్ష సీనియర్ నేత జోక్యం చేసుకుని నేరుగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఈ ఆందోళనలను కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా, విధానపరమైన అంశంగా పరిగణించి పరిష్కారం చూపాల్సిన వాతావరణాన్ని ఈ భేటీ సృష్టించింది. అయితే, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు అన్నీ కలిసికట్టుగా ఏకీకృత పోరాటం చేస్తున్న తరుణంలో, ఈ భేటీ ఇండియా కూటమి సమైక్యతపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తావిచ్చింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంటి పార్టీలు ఈ విద్యార్థి నిరసనలకు మద్దతుగా నిలిచాయి. ప్రధాని నివాసం సమీపంలో నిరసన తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు రాਹੁల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులను పోలీసులు నిర్బంధించారు. అలాగే, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరె కూడా జంతర్ మంతర్‌లోని నిరసన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రితో పవార్ జరిపిన భేటీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముందు ఎన్సీపీ (ఎస్పీ) రాజకీయ వ్యూహం ఏమిటనే దానిపై ప్రశ్నలను రేకెత్తించింది.

ఒకవైపు నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నిలుస్తూనే, మరోవైపు రైతుల సమస్యలపై ప్రధానితో చర్చించడం పవార్ రాజకీయ అనుభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమా లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా అనేది రాబోయే పార్లమెంటరీ సమావేశాలు, రాజకీయ పరిణామాలు తేల్చనున్నాయి. దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి సమీకరణాలు మారుతాయో చెప్పలేనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, శరద్ పవార్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, భేటీలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తున్న సమయంలో, సీనియర్ నేతగా పవార్ తనదైన శైలిలో భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది.

– జి.మహేష్‌ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్-94913 83455

ట్రెండింగ్ న్యూస్