
చట్టాన్ని రక్షించాల్సిన కంచెయే చేను మేస్తే, ఆ కంచెను పీకిపారేసే అధికారం రాజ్యాంగం కేవలం న్యాయస్థానాలకే ఇచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో, న్యాయ వర్గాల్లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ హైడ్రా (HYDRAA)పరిణామాలు. హైదరాబాద్ మహానగరంలో అక్రమ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా వ్యవస్థ, దాని సారథి ఏవీ రంగనాథ్ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఒకవైపు ప్రజా ప్రయోజనాలంటూ దూకుడుగా వెళ్తున్న ప్రభుత్వానికి, మరోవైపు రాజ్యాంగ పరిధి, చట్టబద్ధ పాలన (Rule of Law) గుర్తుచేస్తున్న హైకోర్టుకు మధ్య నడుస్తున్న ఈ హైడ్రామా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యదర్శిని ఆదేశించడం సంచలనం సృష్టించింది.

చెరువులను మింగిన గద్దలను వేటాడాల్సిన ‘హైడ్రా‘.. చివరకు కోర్టు ధిక్కరణల సుడిగండంలో చిక్కుకుని తానే తలలు మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. బుల్డోజర్ల మోతతో మార్మోగిన హైడ్రా కార్యాలయానికి, ఇప్పుడు న్యాయస్థానం మొట్టికాయలతో అసలుసిసలు ‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే గుణపాఠం నేర్పింది. ఒక వైపు చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా దూకుడుగా వెళ్తున్న హైడ్రాకు, మరోవైపు కఠినంగా మారుతున్న న్యాయస్థానాల నిబంధనలకు మధ్య నడుస్తున్న ఈ వార్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
హైకోర్టు ఆగ్రహం వెనుక అసలు కథ ఏమిటి?
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని సుమారు 40 ఎకరాల వివాదాస్పద భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలను, ఇచ్చిన హామీలను ఉల్లంఘించి హైడ్రా అధికారులు ఆ భూముల్లోకి ప్రవేశించారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్ పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న అధికారి అదే పదవిలో కొనసాగితే ‘రూల్ ఆఫ్ లా’ (చట్టబద్ధ పాలన) దెబ్బతింటుందని స్పష్టం చేసింది.

ప్రభుత్వ వ్యూహం ఏంటి?
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జన పడుతోంది. అయితే హైడ్రా విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే యోచనలో లేనట్లు తెలుస్తోంది. న్యాయ పోరాటం వైపే మొగ్గు చూపుతోంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది. హైడ్రా దూకుడు వెనుక ప్రభుత్వ రాజకీయ సంకల్పం ఉంది. ముఖ్యంగా ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో రంగనాథ్ సమర్థవంతంగా పనిచేశారని సర్కార్ భావిస్తోంది. అందుకే ఆయనను సులభంగా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయపోరాటంలోనూ ఎదురుదెబ్బ తగిలితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఐజీ స్థాయి అధికారి పేరును పరిశీలించే అవకాశం ఉంది, ప్రస్తుతానికి మాత్రం న్యాయపరమైన మార్గాల ద్వారానే ఈ ఉచ్చు నుంచి బయటపడాలని ప్రభుత్వం భావిస్తోంది.

రంగనాథ్‌ను కొనసాగిస్తారా?
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఒక నిజాయితీ గల, నిబద్ధత కలిగిన పోలీసు అధికారిగా మంచి పేరుంది. దూకుడున్న పోలీస్ అధికారిగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలోనూ ఆయన చేపట్టిన అనేక బాధ్యతల్లో తన ముద్ర వేసారు. హైదరాబాద్‌లో దశాబ్దాలుగా పాతుకుపోయిన పెద్ద పెద్ద కబ్జాదారుల గుండెల్లో హైడ్రా దడ పుట్టించిందంటే, దాని వెనుక రంగనాథ్ దూకుడు ప్రధాన కారణం. సామాన్యుల ఫిర్యాదులపై తక్షణ స్పందన, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో వెలిసిన అనధికార భారీ భవనాల కూల్చివేతలతో ఆయన ప్రజల్లో ఒక ‘ట్రబుల్ షూటర్’ ఇమేజ్ తెచ్చుకున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఆయన చూపిన చొరవను పలువురు ప్రశంసించారు. మరోవైపు, వేగం ఎక్కువై వ్యవస్థల పరిధులను దాటారనే విమర్శలు మూటగట్టుకున్నారు. కోర్టు స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులు ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఆవేశంతో కూడిన చర్యలకు దిగడం వల్లనే ఇన్ని కోర్టు ధిక్కరణ కేసులు మూటగట్టుకోవాల్సి వచ్చిందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చట్టాన్ని అమలు చేసేవారే కోర్టు ఆదేశాలను లైట్‌గా తీసుకుంటే అది చివరికి ప్రభుత్వానికే పెద్ద తలనొప్పిగా మారుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.

రాజకీయ విమర్శలు
ఈ హైకోర్టు తీర్పుతో విపక్ష పార్టీలకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి అస్త్రం దొరికినట్లయింది. హైడ్రా కూల్చివేతలపై గతంలోనే హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం తీరు మారలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హైడ్రా పేరుతో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందువల్లే న్యాయస్థానం మొట్టికాయలు వేయాల్సి వచ్చిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అసలు ఈ హైడ్రా వ్యవస్థే అప్రజాస్వామికమని, ఇది కేవలం రియల్ ఎస్టేట్ రాజకీయాల కోసం పుట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ మాత్రం హైడ్రా లక్ష్యం పేదలను ఇబ్బంది పెట్టడం కాదని, లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రజా ఆస్తులను కబ్జాదారుల చెర నుంచి విడిపించడమేనని సమర్థించుకుంటోంది.

ప్రజాదరణ పొందాలనే తపనతో లేదా ప్రభుత్వ మెప్పు కోసం హైడ్రా అధికారులు పద్ధతులు, ప్రొసీజర్స్‌ను గాలికి వదిలేశారనేది నిపుణుల మాట. కోర్టు స్టే ఇచ్చిన భూముల్లోకి కూడా బుల్డోజర్లతో వెళ్లడం వల్లనే న్యాయస్థానం తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఒకవైపు హైడ్రా ద్వారా ఇమేజ్ పెంచుకోవాలని చూసిన రేవంత్ రెడ్డి సర్కార్‌కు, ఇప్పుడు హైకోర్టు తీర్పుతో డిఫెన్సివ్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమిషనర్‌ను మార్చాలని కోర్టు కోరడం ద్వారా, ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మొత్తం మీద రేవంత్ సర్కార్ తదుపరి చర్య ఏంటి ? అన్నది రాజకీయ వర్గాలతోపాటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక వేళ రంగనాథ్‌ను తొలగిస్తే.. కొత్త కమిషనర్ రంగనాథ్ స్థాయిలో హైడ్రాకు, ప్రభుత్వానికి పేరు తీసుకొస్తారా ? అన్నది ప్రశ్న. బుల్డోజర్లతో చెరువుల కబ్జాదారులను బెదిరించిన హైడ్రా, చివరికి కోర్టు ధిక్కరణ సుడిగండంలో చిక్కుకుని తానే బేజారైంది!
-జి.మహేష్ కుమార్ ✍️
సీనియర్ జర్నలిస్ట్-949 1383 455