తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరొందిన జగ్గారెడ్డి..శైలి, మాట్లాడే తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా రాజకీయాలకు సంబంధించి తనకు ఓ ఆసక్తి ఉందని, దాన్ని సాధించేందుకు యాక్షన్ ప్లాన్ కూడా ఉందని ప్రకటించారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి రేపుతోంది. ఆయన ఏం చేబోతున్నారు ? అన్నది ఉత్కంఠగా మారింది.

జగ్గారెడ్డి రాజకీయ ప్రయాణం ఎక్కువగా సంగారెడ్డి కేంద్రంగా సాగింది. అయితే గత ఎన్నికల్లో ఓటమి ఆయనను తీవ్రంగా కలచివేసింది. స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినప్పటికీ ఓడిపోవడం పట్ల ఆయన బహిరంగంగానే తన ఆవేదనను వెలిబుచ్చారు. సంగారెడ్డి గడ్డపై ఇక ఎప్పటికీ తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే సిద్దిపేట లాంటి స్థానాల నుంచి లేదా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే పార్టీ విజయానికి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ఆకాంక్షలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సంగారెడ్డిలో నిర్వహించిన నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డి… తన రాజకీయ లక్ష్యానికి సంబంధించి పూర్తి వివరాలను నవంబరు నెలలో కార్యకర్తల సమక్షంలోనే బహిరంగంగా వెల్లడిస్తానని చెప్పారు. రానున్న మూడు నెలల్లో రాజకీయంగా తను చేపట్టాల్సిన బాధ్యతలపై పూర్తి స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఇప్పుడు ఇదే అంశంపై ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ రసవత్తరంగా ఉండే పేరు జగ్గారెడ్డి. “రాజకీయ కోరిక ఉంది.. నవంబర్‌లో ప్రకటిస్తా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీభవన్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, పార్టీలో అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో జగ్గారెడ్డి పెట్టిన ఈ “నవంబర్ డెడ్‌లైన్” వెనుక అసలు ప్లాన్ ఏంటో ! జగ్గారెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్‌కు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కావడం కంటే, రాష్ట్ర స్థాయిలో పార్టీలో కీలక పాత్ర పోషించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేదా పార్టీ సంస్థాగతంగా రాష్ట్ర స్థాయిలో తన స్థాయికి తగిన సముచిత స్థానం దక్కాలనే ఆకాంక్ష ఆయనలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో కేవలం సాధారణ ఎమ్మెల్యేగా ఉండటం కంటే, పార్టీ సర్వతోముఖాభివృద్ధికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా లేదా కీలక బాధ్యతల్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఏ ప్రకటసనైనా ఒక సరైన సమయం చూసి చేయడంలో జగ్గారెడ్డి దిట్ట. నవంబర్ నాటికి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడం వెనుక కొన్ని రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, మంత్రులు, పార్టీ కేడర్ మధ్య సమన్వయం, భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ స్పష్టత రావడానికి నవంబర్ సరిగ్గా సరిపోతుంది. సంగారెడ్డి కాకుండా వేరే స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉంటే, ఆ ప్రాంతంలో గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి, క్యాడర్‌ను ప్రిపేర్ చేయడానికి ఆయన కొంత సమయం కోరుకుంటున్నారు. తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై గాంధీ భవన్, హైకమాండ్ నుంచి రావాల్సిన సంకేతాల కోసం ఆయన వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి లాంటి మాస్ లీడర్ తీసుకునే నిర్ణయం కేవలం ఆయన వ్యక్తిగత భవిష్యత్తును మాత్రమే కాకుండా, ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఆయన తన తదుపరి లక్ష్యం ఏంటో నవంబర్‌లో ఏ రూపంలో ప్రకటిస్తారనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడిన తమలాంటి సీనియర్లకు ప్రభుత్వంలో తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి జగ్గారెడ్డిలో లోలోపల ఉడుకుతూనే ఉంది. కేబినెట్ విస్తరణ జరిగితే మంత్రి పదవి లేదా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పేలా ఏదైనా పవర్ఫుల్ పోస్ట్ ఆయన టార్గెట్ కావొచ్చు. సంగారెడ్డిలో ఓటమి తర్వాత అక్కడ ఇక చాలు అనుకుంటున్న ఆయన, ఫ్యూచర్లో తెలంగాణ వ్యాప్తంగా తన మార్క్ పాలిటిక్స్ చూపించడానికో లేక వేరే సేఫ్ సీట్ వెతుక్కోవడానికో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జగ్గారెడ్డి ఏదీ యాదృచ్ఛికంగా మాట్లాడరు. నవంబర్ నాటికి రాజకీయంగా కొన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హీట్, కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల భర్తీ తుది దశకు చేరేది అప్పుడే. అప్పటిదాకా పార్టీ పెద్దల రియాక్షన్ ఏంటో చూడాలని ఆయన వెయిట్ చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై హైకమాండ్ లేదా పీసీసీ నుంచి స్పష్టమైన హామీ రాకపోతే, తనదైన శైలిలో అన్‌కంట్రోల్డ్ పాలిటిక్స్ స్టార్ట్ చేయడానికి ఆయన నవంబర్‌ను ముగింపు లేదా ప్రారంభ ఘట్టంగా ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు టెన్షన్‌గా మారింది. ఒకవేళ ఆయన పార్టీ లైన్‌కి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. అదే సమయంలో “నేను సైలెంట్ అయ్యానంటే నాలో మరో కోణం ఉందని అర్థం” అని చెప్పకనే చెప్పడం ద్వారా ఆయన పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు. నవంబర్ నాడు జగ్గారెడ్డి వేసే అడుగు కేవలం ఆయన వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు.. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ల అసంతృప్తికి, ఆకాంక్షలకు ఒక అద్దం పట్టనుంది. ఆ రోజు ఆయన చేసే ప్రకటన స్టేట్ పాలిటిక్స్‌లో ఎలాంటి టర్నింగ్ ఇస్తుందో వేచి చూడాలి!
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455