ఒకప్పుడు చీకట్లను తరిమే నల్లటి దీపం..ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తివంతమైన ఇంజిన్! భారతీయ బొగ్గు రంగం తాజాగా నమోదు చేసిన గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కావు.. దేశ పారిశ్రామిక వేగానికి, ప్రగతి రథచక్రాల హోరుకు అద్దం పట్టే సరికొత్త విజయ కేతనాలు.

2026, జులై నెలలో బొగ్గు రంగం సాధించిన ప్రగతి అటు విద్యుత్ రంగంలో వెలుగులు నింపుతుండగా, ఇటు దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టిస్తోంది. 2026 జులైలో దేశంలో బొగ్గు ఉత్పత్తి 69.75 మెట్రిక్ టన్నులకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో ఇది 64.88 మెట్రిక్ టన్నులుగా మాత్రమే ఉండేది. అంటే డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచడంలో గనుల రంగం ఎంత వేగంగా దూసుకుపోతుందో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఉత్పత్తి చేయడమే కాదు.. దానిని సరైన సమయంలో వినియోగదారులకు చేర్చడంలోనూ రికార్డు సృష్టించారు. జులై నెలలో బొగ్గు రవాణా ఏకంగా 86.33 మెట్రిక్ టన్నులకు ఎగబాకింది. గత ఏడాది ఇది 64.88గా కాకుండా 73.57గా ఉంటూ ఇప్పుడు 17.34% భారీ వృద్ధిని నమోదు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (జులై నాటికి) చూస్తే.. దేశవ్యాప్తంగా కూడబెట్టిన బొగ్గు ఉత్పత్తి 302.24 మెట్రిక్ టన్నులు కాగా, రవాణా 354.70 మెట్రిక్ టన్నులుగా నమోదైంది.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. పరిశ్రమలకు, విద్యుత్ కేంద్రాలకు ఏమాత్రం విద్యుత్ కొరత రాకుండా చూడాలంటే బొగ్గు సరఫరా నిరంతరం జరగాలి. రవాణాలో నమోదైన 17% పైచిలుకు వృద్ధి.. థర్మల్ ప్లాంట్లు ఎక్కడా ఇంధన కొరతతో మూతపడకుండా ఉండేలా ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు నిదర్శనం. విదేశాల నుంచి దిగుమతులను తగ్గించుకుంటూ, స్వదేశీ గనుల ద్వారానే అవసరాలను తీర్చుకోవాలనే లక్ష్యానికి ఈ గణాంకాలు బలమైన ఊతమిస్తున్నాయి. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరియు కోల్ ఇండియా చేపట్టిన ఆధునిక సాంకేతికత, యంత్రాల వినియోగం ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. ఉత్పత్తి అయిన బొగ్గును ఎక్కడా నిల్వ ఉండిపోకుండా, సకాలంలో రవాణా చేయడానికి రైల్వే శాఖతో కూడిన సమన్వయం అద్భుతంగా పనిచేస్తోందని రవాణాలో వృద్ధి స్పష్టం చేస్తోంది. గ్రీన్ ఎనర్జీ (సౌర, పవన విద్యుత్) వైపు అడుగులు వేస్తున్నప్పటికీ.. దేశ బేస్‌లోడ్ ఎనర్జీ అవసరాలు తీర్చడంలో థర్మల్ విద్యుత్ ఇప్పటికీ వెన్నెముకే. ఈ బొగ్గు ప్రవాహమే దేశంలోని ప్రతీ ఇంటికి, ప్రతీ పరిశ్రమకు నిరంతరం వెలుగులను పంచుతోంది.

ఈ నల్ల బంగారం కేవలం భూమిలో దొరికే ఖనిజం కాదు.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఈ వేగంతో గనుల రంగం దూసుకుపోతుంటే, రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ పారిశ్రామిక దిగ్గజంగా మారడాన్ని ఆపడం ఎవరివల్లూ కాదు! ఇది కేవలం బొగ్గు గనుల్లో యంత్రాల చప్పుడు కాదు.. భారతదేశ పారిశ్రామిక భవిష్యత్తు కోసం మోగుతున్న విజయ దుందుభి! “ఖనిజం ఏదైనా, చెమటోడ్చే శ్రమ ఏదైనా.. దేశాభివృద్ధే ధ్యేయంగా సాగితే ఫలితాలు ఎలా ఉంటాయో” చెప్పడానికి 2026 జులై నెల బొగ్గు రంగ గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ నల్లని మట్టి రేణువుల వెనుక లక్షలాది కార్మికుల చెమట, ప్రభుత్వ సరైన విధానాల ముద్ర ఉంది. ఈ వేగం ఇలాగే కొనసాగితే, దేశ ఆర్థిక రథం ఎలాంటి వేదిక మీదయినా అజేయంగా దూసుకుపోవడం తథ్యం.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455