చీకటి సూర్యుడు @ క్రికెట్ చరిత్ర

చీకటి సూర్యుడు @ క్రికెట్ చరిత్ర

భారతీయ క్రికెట్ చరిత్రలో వెలుగులు చిమ్మే సూర్యుడిలా ప్రకాశించిన క్రికెటర్లకు కొదవ లేదు. సచిన్ టెండూల్కర్ కవర్‌డ్రైవ్, విరాట్ కోహ్లీ అగ్రెసివ్ బ్యాటింగ్, రోహిత్ శర్మ సిక్సర్ల సునామీ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాయి. కానీ ఆ భానుడి కాంతి వెనుక నిశ్శబ్దంగా నిలబడి, జట్టుపై చీకటి కమ్ముకున్న ప్రతిసారీ కాపాడే రక్షక కవచంలా ఒక క్రీడాకారుడు ఉండేవాడు. అతడే అజింక్య మధుకర్ రహానే. అతడి ఆటలో ఆర్భాటాలు ఉండవు, వికెట్ పడినప్పుడు ఆవేశకావేశాలు కనిపించవు. తనను తక్కువ చేసి మాట్లాడినా చెక్కుచెదరని చిరునవ్వు, విమర్శకుల పదునైన బాణాలకు బ్యాట్‌తోనే జవాబిచ్చే నిశ్శబ్ద శైలి. ఒక విధంగా చెప్పాలంటే అతడు చీకటి సూర్యుడు’

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు అజింక్య రహానే వీడ్కోలు పలికాడని తెలుసుకున్న క్రీడా ప్రపంచం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. 15 ఏళ్లకు పైగా భారత క్రికెట్‌కు అతడు అందించిన నిస్వార్థ సేవలు, క్లిష్టమైన పిచ్‌లపై అతడు సాధించిన పరుగులు, నాయకుడిగా సాధించిన విజయాలు క్రికెట్ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.

డోంబివ్లీ వీధుల నుంచి లార్డ్స్ వరకు
1988 జూన్ 6న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా చందోడి గ్రామంలో జన్మించిన రహానే.. ముంబైలోని డోంబివ్లీ అనే చిన్న పట్టణంలో పెరిగాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. చిన్నతనంలో తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొడుకు క్రికెట్ కల నెరవేర్చడానికి పడే శ్రమను రహానే కళ్లారా చూశాడు. ముంబైలోని క్రికెట్ మైదానాలకు వెళ్లడానికి లోకల్ రైళ్లలో పడిన కష్టాలు అతడికి ఆత్మస్థైర్యాన్ని, కష్టపడే తత్వాన్ని నేర్పాయి. ముంబై డొమెస్టిక్ క్రికెట్ సంస్కృతి నుంచి వచ్చిన రహానే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఓ రికార్డుల యంత్రంలా మారాడు. రంజీ ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ సెలెక్టర్ల తలుపులను తట్టాడు. ప్రతిష్టాత్మక ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించినప్పటికీ, అప్పటికే భారత జట్టులో దిగ్గజాలు ఉండడంతో అతడు సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చింది.

  • అంకెల్లో క్రికెట్ మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రీడలలో రహానే సాధించిన రికార్డులు అతడి ప్రావీణ్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు.
  • టెస్టుల్లో భారత్‌కు రహానే అసలైన రక్షకుడు. సవాళ్లతో కూడిన విదేశీ పిచ్‌లపై అతడు చూపిన ధీరత్వం అపూర్వం. 85 మ్యాచుల్లో 144లో బ్యాటింగ్ చేశాడు. 5,077 పరుగులు సాధించాడు. అతని సగటు 38.46. టెస్టుల్లో 12 శతకాలు, 26 అర్థశతకాలు చేశాడు. అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికాపై చేసిన 188 పరుగులు.
  • వన్డేల్లో మిడిల్ ఆర్డర్‌లో, ఓపెనర్‌గా ఎక్కడ బ్యాటింగ్ కి రమ్మన్నా జట్టు కోసం సిద్ధపడే మనస్తత్వం రహానేది. తన కెరరీలో రహానే 90 మ్యాచులాడిన రహానే 35.26 సగటుతో 2,962 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలున్నాయి. 24 అర్ధ శతకాలు చేశాడు.

అంతర్జాతీయ టీ20
అవకాశాలు తక్కువగా వచ్చినప్పటికీ కీలకమైన మ్యాచుల్లో తన వంతు పాత్ర పోషించాడు. 20 మ్యాచుల్లో 375 పరుగులు చేశాడు. ఒకే ఒక్క అర్థశతకం సాధించాడు. స్ట్రైక్ రేట్: 113.29.

ఇండియన్ ప్రీమియర్ లీగ్
రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్‌జైంట్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు. 2023లో CSK తరుపున అతడు చూపిన ‘రహానే 2.0’ అవతారం టీ20 ప్రపంచానికి అతడి విస్ఫోటక సామర్థ్యాన్ని పరిచయం చేసింది. 180కు పైగా మ్యాచుల్లో 4,600 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

ఫస్ట్ క్లాస్ క్రికెట్

రహానే అసలైన సత్తా ఫస్ట్ క్లాస్ మైదానాల్లోనే కనిపించింది. 180కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో దాదాపు 13,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అందులో 39 శతకాలు ఉన్నాయి. ముంబై జట్టును నాయకుడిగా ఉండి 2023-24లో 42వ రంజీ ట్రోఫీ విజేతగా నిలిపాడు.

నాయకుడిగా రికార్డు
అజింక్య రహానే కెప్టెన్సీ ప్రయాణం చాలా స్వల్పమైనదే అయినా, అది భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సువర్ణాధ్యాయం. భారత టెస్టు కెప్టెన్‌గా కనీసం 5 మ్యాచులకు ప్రాతినిధ్యం వహించిన నాయకుల్లో అత్యధిక గెలుపు శాతాన్ని కలిగి ఉన్న ఘనత రహానేదే.

6 టెస్టుల్లో సారథ్యం వహించగా..4 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. రెండు టెస్టులు డ్రా అయ్యాయి. ఓటమి శాతం సున్నా.

గబ్బా చారిత్రాత్మక విజయం
రహానే నాయకత్వ పటిమకు ప్రపంచం జేజేలు పలికిన క్షణం 2020-21 ఆస్ట్రేలియా పర్యటన. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయం పాలైంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై భారతదేశానికి తిరిగి వచ్చాడు. జట్టు తీవ్ర మనోధైర్యాన్ని కోల్పోయింది. సీనియర్ ఆటగాళ్లు షమీ, ఉమేష్ యాదవ్ గాయపడ్డారు. అటువంటి అత్యంత క్లిష్ట సమయాల్లో అజింక్య రహానే జట్టును భుజానకెత్తుకున్నాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ప్లాటినమ్ లాంటి సెంచరీ కొట్టి జట్టును విజేతగా నిలిపాడు. ఆ తర్వాత సిడ్నీ టెస్టును డ్రా చేసుకుని, చివరగా ఆస్ట్రేలియాకు 32 ఏళ్లుగా ఓటమి లేని గబ్బా కోటలో భారత్‌ను గెలిపించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు.

రహానే కెప్టెన్సీ స్టైల్ చదరంగం క్రీడాకారుడిలా ఉండేది. మైదానంలో నిశ్శబ్దంగానే వ్యూహాలు పన్నడం, యువ బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనివ్వడం అతడి శైలి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత కంగారూ దిగ్గజం నైథాన్ లియోన్ 100వ టెస్టు ఆడుతున్నందుకు గుర్తుగా అతడికి భారత జట్టు సంతకం చేసిన జెర్సీని ఇచ్చి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు.

రహానే అసాధారణ సేవలు
రహానే చేసిన శతకాల్లో మెజారిటీ శతకాలు ఇంగ్లాండ్ లోని లార్డ్స్, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, దక్షిణాఫ్రికాలోని డర్బన్, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి మైదానాల్లోనే నమోదయ్యాయి. హోమ్ కండిషన్ల కంటే కష్టతరమైన ఫారిన్ కండిషన్లలోనే అతడు ఎక్కువ రాణించాడు.

స్లిప్‌లలో సూపర్ ఫీల్డర్
భారతదేశం కన్న గొప్ప స్లిప్ ఫీల్డర్లలో రహానే ఒకడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్రపంచ రికార్డు ఇప్పటికీ అతడి పేరిటే ఉంది. శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో రహానే 8 క్యాచ్‌లు పట్టాడు. అప్పట్లో
విరాట్ కోహ్లీ అతడిని “ది సేఫెస్ట్ పేర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ది స్లిప్స్” అని కొనియాడాడు.

జట్టు ప్రయోజనాలే ముఖ్యం
మూడో స్థానంలో ఆడమన్నా, ఐదో స్థానంలో ఆడమన్నా ఫిర్యాదు చేయకుండా ఆడాడు. సుదీర్ఘ కాలం పాటు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉంటూ కోహ్లీకి అత్యంత నమ్మకమైన భాగస్వామిగా నిలిచాడు. కోహ్లీ-రహానే జంట టెస్టుల్లో అత్యుత్తమ భాగస్వామ్యాలను నెలకొల్పింది.

అనుకున్నంత పేరు రాలేదు
అజింక్య రహానే సాధించిన విజయాలతో పోలిస్తే అతడికి రావలసినంత ప్రజాదరణ లేదా స్టార్‌డమ్ రాలేదనేది పచ్చి నిజం. అందుకు అనేక కారణాలున్నాయి. సోషల్ మీడియా ప్రచారాలు, అగ్రెసివ్ సెలబ్రేషన్లు, వివాదాస్పద వ్యాఖ్యలకు రహానే ఎప్పుడూ దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సూపర్ స్టార్స్ ఏలిన యుగంలో రహానే ఆడాడు. వెలుగులన్నీ వారిపై పడినప్పుడు, రహానే నేపథ్యంలో ఉండిపోయేవాడు. విదేశాల్లో అద్భుత స్కోర్లు చేసిన రహానే, భారతదేశంలో జరిగిన కొన్ని టెస్టు సిరీస్‌లలో అనుకున్న స్థాయిలో పరుగులు చేయలేకపోయాడు. దీంతో అతడి కెరీర్ సగటు కొంత పడిపోయింది.

చరిత్ర నిలబెట్టే పాఠం
అజింక్య రహానే కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు. పట్టుదలకు, నిశ్శబ్ద సమర్థతకు, నిస్వార్థ స్వభావానికి అద్దం పట్టే ఒక వ్యక్తిత్వం. పేరు ప్రఖ్యాతుల కోసం పరుగెత్తకుండా, తాను చేసే పనిపై మాత్రమే దృష్టి సారిస్తే చరిత్ర మనల్ని ఎలా గుర్తుపెట్టుకుంటుందో నిరూపించిన మహానీయుడు.

ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు దక్కిన ఆ చారిత్రాత్మక సిరీస్ విజయం ఉన్నంతవరకు, లార్డ్స్ మైదానంలో ఆకుపచ్చని పిచ్‌పై అతడు చేసిన ఆ పోరాట శతకం గుర్తుకొచ్చినంత కాలం… అజింక్య రహానే పేరు భారత క్రికెట్ గుండె చప్పుడుగా మారుమోగుతూనే ఉంటుంది. నిశ్శబ్దంగా వచ్చి, అద్భుతాలు చేసి, అంతే ప్రశాంతంగా నిష్క్రమించిన ఈ చీకటి సూర్యుడికి క్రీడా ప్రపంచం సగర్వంగా వీడ్కోలు పలుకుతోంది.

కానుగుల కిషన్ ✍️
సీనియర్ జర్నలిస్ట్, 99 4959 3416

ట్రెండింగ్ న్యూస్