మర్మబావి ఎక్కడ? అసలు రహస్యమేంటి?  నీరు తొట్టెల వలె ఎందుకు ఊగుతోంది?▶️

  • మర్మబావి ఎక్కడ అసలు రహస్యం ఏమిటి 
  • బావిలో ని నీరు ఎందుకు తొట్టెల వలె ఊగుతోంది?
  • అసలు ఈ మర్మబావిలో ఏముందో తెలుసా?  ఎందుకు అలా ఊగుతోంది?

ఎవడూ ముట్టుకోకపోయినా.. గాలి వీయకపోయినా.. ఆ బావిలో నీళ్లు మాత్రం ఉప్పొంగుతూనే ఉన్నాయి! భూమి గుండెల్లో ఏదో గుబులు రేగినట్టు, లోలోపల నుంచి వస్తున్న ఆ అంతుచిక్కని అలికిడి ఇప్పుడు దేశం మొత్తాన్ని నిద్రపోనివ్వడం లేదు. ఎవడూ రాయి వేయలేదు.. ఈదులాడే చేపలూ లేవు.. అయినా ఆ బావి నీళ్లు మాత్రం ఉప్పెనలా ఎగిసిపడుతున్నాయి! గుజరాత్ నేలతల్లి పొట్టలో అసలేం జరుగుతోంది? భూమి తనలో దాచుకున్న రహస్యాన్ని బయటపెడుతోందా? లేక ప్రకృతి తనదైన శైలిలో మనతో ఆడుకుంటున్న పజిల్ ఇదా? వింటే వెన్నులో వణుకు పుట్టించే ఈ మిస్టరీ స్టోరీ. గుజరాత్‌లోని ఆ మర్మమైన బావి చుట్టూ ఇప్పుడు అలుముకున్న టెన్షన్ మాములుగా లేదు బాసూ! “బాయిలోనే బల్లి పలికే.. బండసారం శిలలొదిలే” అంటూ సింగర్ మంగ్లీ ఊపిన ఊపునకు సోషల్ మీడియా షేక్ అయిపోయినట్టే.. సరిగ్గా అదే సీన్ అసలు సిసలు పల్లెటూరి బావి వద్ద రిపీట్ అయింది..

గుజరాత్‌లోని మోర్బీ జిల్లా, వీర్‌పర్దా గ్రామంలోని ఒక రైతన్న పొలంలో ఉన్న 18 అడుగుల అడుగు లోతైన బావి ఇప్పుడు యావత్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సాధారణ పురాతన బావి ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీకి అడ్రస్‌గా మారింది. ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఆ బావిలోని నీళ్లు దానంతట అవే కదులుతూ, భయపెట్టే అలలతో ఉప్పొంగుతున్నాయి. ఆ బావిలోని నీరు దానంతట అదే అలలతో ఉప్పొంగుతూ, అల్లకల్లోలంగా మారుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రెండు రోజుల క్రితం మొదలై కొద్దిగా శాంతించిన ఈ నీటి అలజడి…మళ్లీ మొదలైంది. ఆ నీళ్లలో మళ్లీ అదే కదలిక! ఇంకేముంది, కరెంట్ షాక్ తగిలినట్టు గ్రామం మొత్తం ఆ బావి చుట్టూ వచ్చి పడింది. “అరే బాబోయ్, ఇదేమైనా భూకంపానికి ముందస్తు హెచ్చరికా? లేక భూమి పొరల్లో దాగున్న దేవుడి కోపమా?” అంటూ జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూసేవాళ్లకు మాత్రం ఇదొక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా సీన్ లాగా కనిపిస్తోంది. ఈ వింతను కళ్లారా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, హైవేపై వెళ్లే ప్రయాణికులు సైతం తమ వాహనాలను ఆపి మరీ బావి చుట్టూ గుమిగూడారు. బావి నీళ్లు పొర్లిపోతుండటంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక గ్రామంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.

గుజరాత్ ప్రాంతం భూకంపాలకు సున్నితమైనది కావడంతో, ఈ వింత ఘటన వెనుక భూకంప సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరికొందరైతే ఇదో అతీంద్రియ శక్తుల మహిమంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఈ హడావుడి చూసి రంగంలోకి దిగిన జియాలజిస్టులు, సైంటిస్టులు అసలు నిజం బయటపెట్టారు. భూగర్భంలో పేరుకుపోయిన గాలి (Trapped Air) పీడనం తట్టుకోలేక ఒక్కసారిగా బయటకు రావడంతోనే ఈ నీటి అలజడి సృష్టిస్తోందని తేల్చిచెప్పారు. భారీ వర్షాల కారణంగా భూగర్భ జలాలు భారీగా రీఛార్జ్ అయ్యాయని, రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన గాలి ఒక్కసారిగా పైకి విడుదలవుతుండటం వల్ల నీటిలో ఈ తరహా అలజడి, కెరటాలు ఏర్పడుతున్నాయని జియాలజిస్ట్ జె.ఎస్. వాధేర్ తెలిపారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మి భయపడవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. భూకంప భయాలు లేవని అధికారులు క్లారిటీ ఇచ్చినా.. ఆ బావి దగ్గరికి వెళ్తే మాత్రం వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

శాస్త్రీయంగా కారణం తెలిసినప్పటికీ.. కంటికి కనిపించే ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు మాత్రం జనం ఇంకా బారులు తీరుతూనే ఉన్నారు. సైన్స్ ఎంత క్లారిటీ ఇచ్చినా.. భయం నీడలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. సైంటిస్టులకు అది ‘ట్రాప్డ్ ఎయిర్’ కావచ్చు, కానీ సామాన్యులకు మాత్రం అది నేలతల్లి గుండె చప్పుడు! రేపు పొద్దున ఆ బావిలో ఇంకే వింత చూడాలో అని వీర్‌పర్దా జనం బిక్కుబిక్కుమంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎవడూ రాయి వేయలేదు.. ఈదులాడే చేపలూ లేవు.. అయినా ఆ బావి నీళ్లు మాత్రం ఉప్పెనలా ఎగిసిపడుతున్నాయి.

నేల లోపలి నుంచి వస్తున్న ఈ వింత అలికిడికి ముగింపు ఎక్కడో తెలియదు కానీ.. వీర్‌పర్దా ప్రజలకు మాత్రం ఈ బావి మిస్టరీ జీవితంలో మర్చిపోలేని థ్రిల్‌ను మిగిల్చింది! మరి ఈ నేల రహస్యం ఇంకెన్ని ట్విస్ట్‌లు ఇస్తుందో కాలమే నిర్ణయించాలి!.

– జి.మహేష్‌ కుమార్ ✍️

సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455  

ట్రెండింగ్ న్యూస్