మీ ఓటు సేఫేనా ? ‘సర్‌’!

  • మీ ఓటు సేఫేనా ? ‘సర్‌’!
  • ఓటర్ల జాబితాలో రాజకీయ వల!
  • జాబితా నుంచి గల్లంతుపై ప్రజల్లో గుబులు!
  • ఓటరు బాబు జాగ్రత్త… మీ ఓటుకు ‘సర్‌’ కత్తెర!
  • సర్‌’ ప్రక్రియ తెస్తున్న ఆందోళన!
  • ఈవీఎంల కంటే ముందే ‘జాబితా’లో ఎన్నికల యుద్ధం!

భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది పౌరుడి అత్యంత బలమైన అస్త్రం. అలాంటి ఓటరు జాబితా ప్రక్షాళన పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ-2026’ (Special Intensive Revision – SIR) ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భారతీయ రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే శక్తి ఒక్కోసారి ఈవీఎంల కంటే ‘ఓటర్ల జాబితా’ చేతుల్లోనే ఉంటుందని అంటారు. SIR ప్రక్రియ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సాంకేతికంగా ఇది ఓటర్ల జాబితా ప్రక్షాళన అయినప్పటికీ, దీని వెనుక జరుగుతున్న రాజకీయంపై ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తోంది.

ఎన్నికల జాబితాలో దొంగ ఓట్లు, డూప్లికేట్లు, మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి, పకడ్బందీగా ఓటరు జాబితాను రూపొందించడమే ఈ ‘సర్‌’ (SIR) ప్రధాన ఉద్దేశం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకమైన ఓటింగ్ హక్కు దక్కుతుంది. ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉండే అక్రమాలకు తెరపడుతుంది.ఎన్నికల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితా ఖచ్చితంగా మారుతుంది. అయితే, సరైన అవగాహన లేని నిరుపేదలు, వలస కార్మికులు, శ్రామిక వర్గం తమ చిరునామాలు లేదా పత్రాలను సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. బీఎల్‌ఓల (BLO) సర్వేలో గైర్హాజరైన వారి పేర్లు ఏకపక్షంగా తొలగిపోవడం పెద్ద సమస్యగా మారుతోంది.

దేశవ్యాప్తంగా సాగిన ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. రాష్ట్రంలో కోట్లాది మంది ఓటర్ల వివరాలను సేకరించి మ్యాపింగ్ చేయగా, సరైన ఆధారాలు అందకపోయినా, శాశ్వతంగా వలస వెళ్లినా, మరణించినా లేదా డూప్లికేట్ ఎంట్రీలుగా తేలినా భారీ సంఖ్యలోనే ఓట్లను తొలగింపు జాబితాలో చేర్చారు. ఉదాహరణకు ఖమ్మం లాంటి జిల్లాల్లోనే లక్షన్నరకు పైగా ఓట్లు తొలగింపునకు గురికావడం ఈ ప్రక్రియ ఏ స్థాయిలో జరిగిందో అద్దం పడుతోంది. అయితే, ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత అధికారులు మరోసారి అభ్యంతరాలను స్వీకరించి, సరైన పత్రాలు ఇస్తే ఓట్లు పునరుద్ధరించే అవకాశం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా సాగిన ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. రాష్ట్రంలో కోట్లాది మంది ఓటర్ల వివరాలను సేకరించి మ్యాపింగ్ చేయగా, సరైన ఆధారాలు అందకపోయినా, శాశ్వతంగా వలస వెళ్లినా, మరణించినా లేదా డూప్లికేట్ ఎంట్రీలుగా తేలినా భారీ సంఖ్యలోనే ఓట్లను తొలగింపు జాబితాలో చేర్చారు.

రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రాథమికంగా లెక్క తేల్చారు. సేకరించిన సమాచారంలో ఇప్పటి వరకు దాదాపు 2.64 కోట్ల ఫారాలను డిజిటలైజేషన్ పూర్తి చేసారు. మొత్తం 73.39 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించలేకపోయినట్లు అధికారులు ‘అన్‌కలెక్టబుల్’గా వర్గీకరించారు. అయితే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొందరి ఓట్లు తొలగింపునకు గురికావడం ఈ ప్రక్రియ ఏ స్థాయిలో జరిగిందో అద్దం పడుతోంది. అయితే, ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత అధికారులు మరోసారి అభ్యంతరాలను స్వీకరించి, సరైన పత్రాలు ఇస్తే ఓట్లు పునరుద్ధరించే అవకాశం కల్పిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కర్ణాటకలోని బెంగళూరులో తన ఓటు హక్కు తొలగిపోయిందని సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేయడం దుమారం రేపింది. తాను పుట్టి పెరిగిన నియోజకవర్గంలోనే తన ఓటును ఎలా తొలగిస్తారంటూ ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలు ఈ ‘సర్‌’ ప్రక్రియను తీవ్రంగా తప్పుబడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే వర్గాల పేర్లను టార్గెట్ చేసి తొలగిస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ లాంటి గళం వినిపించే ప్రముఖుల ఓట్లు తొలగిపోవడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని విపక్షాలు వాదిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములను కేవలం కొన్ని వేల ఓట్ల తేడా శాసించే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, ఓటర్ల జాబితా రూపకల్పన అనేది ఏ పార్టీకైనా అత్యంత కీలకం. ‘సర్‌’ (SIR) ప్రక్రియ ముసుగులో కేంద్రంలోని అధికార బీజేపీ తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందనేది ప్రధాన ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. మెట్రోపాలిటన్ నగరాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వలస కార్మికులు, నివాసాలు మారుతుండే మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉంటారు. ఈ వర్గాలే సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగానీ లేదా ప్రత్యామ్నాయ రాజకీయాలకు అనుకూలంగానీ మరుతుంటాయి. ‘సర్‌’ సర్వేలో ఈ అన్‌-మ్యాప్డ్, వలస ఓటర్ల పేర్లను నిబంధనల పేరుతో ఏకపక్షంగా తొలగిస్తే, అది నేరుగా తమ ఓటు బ్యాంకుకు గండి కొట్టడమేనని విపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వారి ఓట్లు కూడా జాబితా నుంచి గల్లంతు కావడం కేవలం యాదృచ్ఛికం కాదని, ఇదొక హెచ్చరిక లాంటి సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతులను, మేధావి వర్గాన్ని, సెక్యులర్ ఓటర్లను పరోక్షంగా నిరుత్సాహపరిచేందుకు ఈ టూల్ ఉపయోగపడుతోందనేది విమర్శకుల వాదన. కేవలం సాంకేతిక ప్రక్షాళనగా కనిపిస్తున్న ఈ ప్రక్రియ వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయనే ఆరోపణలు వస్తుండటంతో, ఇది లాభమా నష్టమా అనే కోణంలో సర్వత్రా విశ్లేషణలు సాగుతున్నాయి.

మరోవైపు, బీజేపీ, ఎన్నికల సంఘం వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దేశంలో దొంగ ఓట్లు, అక్రమ వలసదారుల ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను ఏరివేయకుండా పారదర్శక ఎన్నికలు సాధ్యంకావని వారు స్పష్టం చేస్తున్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన తప్పులను సరిదిద్దడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని, ఇందులో ఎలాంటి రాజకీయ దుర్మార్గం లేదని పాలకపక్షం చెబుతోంది. అయితే, ఈ ప్రక్రియ వల్ల నిజమైన అర్హులైన పేదలు, శ్రామికులు తమ ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లడం వల్ల బీఎల్‌వో సర్వేకు అందుబాటులో ఉండక ఓటు హక్కును కోల్పోతున్నారనే వాస్తవాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి.

రాజకీయ అండదండలు లేని సామాన్య ఓటర్లు, నిత్యం ఉపాధి కోసం వలస వెళ్లే కూలీలు, ప్రభుత్వ విధానాలపై నిరంతరం గళం ఎత్తే మేధావులు ఈ ప్రక్షాళన ఉచ్చులో పడి ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటరు గైర్హాజరు కావడం అంటే, ఆటోమేటిక్‌గా ప్రశ్నించే గొంతు మూగబోవడమే. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో సాగుతున్న ఈ మ్యాపింగ్ క్రీడలో, అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థను వాడుకుంటున్నారనే ఆరోపణలు బలపడుతున్న తరుణంలో… ఓటర్లు మరింత అప్రమత్తంగా ఉండి, తమ ప్రజాస్వామ్య హక్కును కాపాడుకోవడం ఒక్కటే దీనికి అసలైన విరుగుడు.

ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, దొంగ ఓట్లను ఏరివేయడానికి ఎన్నికల సంఘానికి ఇలాంటి కఠినమైన ప్రక్రియలు అవసరమే. దీన్ని కేవలం రాజకీయ కుట్రగా చూడలేం. అయితే, అర్హులైన సామాన్యులు కేవలం అధికారులు సరిగ్గా ఇంటికి రాకపోవడం వల్ల లేదా డాక్యుమెంట్ల మ్యాపింగ్ లోపం వల్ల ఓటు హక్కును కోల్పోతే అది అతిపెద్ద ప్రజాస్వామ్య అపచారమవుతుంది. ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం దీనిపై మరింత స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఓటు అనేది రాజ్యాధారిత హక్కు. దానిని నిబంధనల పేరుతో కొల్లగొట్టడం ఎంత ప్రమాదకరమో, తప్పుడు ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి, ఈ ‘సర్‌’ ప్రక్రియలో పేర్లు కోల్పోయిన ప్రతి ఒక్కరూ చైతన్యంతో స్పందించి, గడువులోగా దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును కాపాడుకోవడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455 

ట్రెండింగ్ న్యూస్