కాంగ్రెస్‌లో పొలికేక..’కొండా’పై ‘కన్నెర్ర’!

  • కాంగ్రెస్‌లో పొలికేక.. ‘కొండా’పై ‘కన్నెర్ర’!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చుట్టూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కుటుంబ సభ్యుల వివాదాస్పద వ్యాఖ్యలు, సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, వరుస వివాదాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పరకాల నియోజకవర్గంలో రాజకీయ వేడెక్కుతున్న తరుణంలో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన కామెంట్స్‌పై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. మంత్రి కొండా సురేఖ వివరణపై అసంతృప్తిగా ఉన్న దాదాపు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పారు. కుమార్తె వ్యాఖ్యలను కనీసం ఖండించకపోవడాన్ని తప్పుపడుతూ, ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. సినీ ప్రముఖులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో పాటు పరువు నష్టం దావాలు కూడా నమోదయ్యాయి. అప్పట్లో ఆ వివాదం పార్టీకి మచ్చ తెచ్చిందని భావించిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు కూతురి రూపంలో మళ్లీ వివాదాలు తెరపైకి రావడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల కాలంలో కొండా సురేఖ కుటుంబం నుంచి వస్తున్న బహిరంగ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరుకన పెడుతున్నాయి. విపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రంగా మారుతోంది. గతంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే, తాజాగా ఒక కార్యక్రమంలో ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన కామెంట్లు పార్టీలో పెద్ద కలకలమే రేపాయి. సొంత ప్రభుత్వ నాయకత్వంపైనే వ్యాఖ్యలు చేయడం, అది కూడా స్థానిక రాజకీయాల నేపథ్యంలో సాగడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి బలమైన కేడర్ ఉన్నప్పటికీ, ఇతర నేతలు, ముఖ్యంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి, కొండా వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈ విభేదాలు రగులుతూనే ఉన్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. పరకాల, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల నాయకులు కొండా కుటుంబం ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో పార్టీ మారిన నేతలపై కొండా మురళి చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ అంతర్గత కుమ్ములాటలను తారాస్థాయికి చేర్చాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై కొండా కుటుంబ తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కొండా సుస్మిత ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డినే టార్గెట్‌ చేస్తూ ఘాటైన విమర్శలు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ స్పష్టం చేసినప్పటికీ, పార్టీలో ఈ వివాదం చల్లారలేదు. కొండా కుటుంబ సభ్యుల నుంచి వరుసగా వస్తున్న విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

పరకాల రాజకీయాల్లో కొండా సుస్మిత క్రియాశీలకంగా మారడం, రాబోయే రోజుల్లో ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గంతోనూ కొండా కుటుంబం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి తలపిస్తోంది. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ ఇచ్చిన వివరణ పట్ల అధిష్టానం సంతృప్తిగా లేదు. ఎమ్మెల్యేల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఆమె మంత్రి పదవికి ఉద్వాసన పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలను బయటపెట్టడంతో, హైకమాండ్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం హవాను తగ్గించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు కొందరు ఏకమైనట్లు స్పష్టమవుతోంది. పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేల వర్గాలకు, కొండా కుటుంబానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. క్రమశిక్షణ కమిటీ స్పందించడం, మంత్రి కొండా సురేఖ వివరణ కోరడం వంటి పరిణామాలు పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదనే సంకేతాలను పంపుతున్నాయి. అయితే, ఈ విషయంలో పార్టీ సీనియర్ నేతల మధ్యే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం విశేషం. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే… బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఓ వర్గం అంటోంది. ఓవైపు తాము బీసీల రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుంటే… అదే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే అసలుకే మోసం వస్తుందని కొందరు సీనియర్లు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కూడా క్రమంగా బలపడుతోంది ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూసే అవకాశం ఉంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం సొంత కేడర్‌తో బలంగా ఉన్నప్పటికీ, అధికార పార్టీలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు రాబోయే రోజుల్లో వారి రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేల తీవ్ర వ్యతిరేకత, హైకమాండ్ సీరియస్ అయిన నేపథ్యంలో కొండా సురేఖ మంత్రి పదవిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రాబోయే కాలంలో పార్టీ నాయకత్వం క్రమశిక్షణా చర్యల రూపంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి ఉమ్మడి వరంగల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కొండా కుటుంబం సొంత పార్టీలోనే ఒంటరవుతుందా లేక ప్రత్యామ్నాయ వ్యూహాలతో నిలదొక్కుకుంటుందా అన్నది కాలమే నిర్ణయించాలి. హైకమాండ్ తీసుకునే కఠిన నిర్ణయాలు, కొండా కుటుంబం వేయబోయే తదుపరి రాజకీయ అడుగులు ఉమ్మడి వరంగల్ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేయడం ఖాయం.

 

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్