- MGM:”సర్కార్ దవాఖానా”కు రోగం!
- సర్కార్ వైద్యరంగం ఇక బాగుపడదా?
- ఎంజీఎం ఆసుపత్రిలో రోడ్డున పడ్డ మానవత్వం
- నిద్రమత్తులో యంత్రాంగం.. నిత్యం రోగుల నరకం
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అందరి నోటా వచ్చే ఒకే ఒక్క పేరు మహాత్మా గాంధీ మెమోరియల్ (MGM) ఆసుపత్రి. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానాల్లో ఒకటిగా పేరుగాంచిన ఎంజీఎం, ప్రస్తుతం రక్షించాల్సిన వైద్యాలయం కాస్తా రోగుల పాలిట ‘ప్రాణ సంకటం’గా మారుతుందనే అపవాదును మూటగట్టుకుంటోంది. ప్రభుత్వం మారుతున్నా, పాలకులు మారుతున్నా.. ఎంజీఎం దైన్యం మాత్రం ఎక్కడి గొడ్డలి అక్కడే అన్నచందంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు వైద్యపరంగా ప్రధాన దిక్కయిన వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వసతి గృహాలు, ఆసుపత్రులు నిరుపేదలకు ప్రాణసంకటంగా మారుతున్నాయనే విమర్శలకు ఎంజీఎం ఆసుపత్రిలో తరచూ వెలుగు చూస్తున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. సామాన్యుడి ప్రాణాలకు ప్రభుత్వాలు ఇస్తున్న విలువ ఏపాటిదో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కళ్లకు కడుతున్నాయి. వైద్యం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వస్తే.. చివరికి కనీసం మంచం కూడా దొరకక ఆసుపత్రి బయటే నేలపై పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే, మన ప్రభుత్వ వైద్య రంగం ఎక్కడుందో ఇట్టే అర్థమవుతోంది. తాజాగా ఎంజీఎం ఆసుపత్రికి వచ్చిన ఒక తీవ్ర అనారోగ్య బాధితుడికి ఆసుపత్రిలో కనీసం బెడ్ కూడా దొరకని దయనీయ పరిస్థితి తలెత్తింది. నడిచే శక్తి లేక, వార్డుల్లో అడుగుపెట్టే వీలులేక సదరు రోగి ఆసుపత్రి బయటే నేలపై పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని వచ్చే రోగులకు కనీస మౌలిక వసతులు, స్ట్రెచర్లు లేదా బెడ్లు కూడా కరవు కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎంజీఎం ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్య ఘటనలు కొత్తేం కాదు. గడచిన కొద్ది కాలంలో ఇక్కడ జరిగిన అనేక ఘటనలు ప్రభుత్వ వైద్య వ్యవస్థ పనితీరుపై తీవ్ర నీలి నీడలను కమ్ముకునేలా చేశాయి. గతేడాది అక్టోబర్ లో పీడియాట్రిక్ వార్డులో ఆక్సిజన్‌పై ఆధారపడిన ఇద్దరు పసికందులకు ఎక్స్‌రే తీసుకెళ్లే సమయంలో ఆసుపత్రి సిబ్బంది ఒకే ఒక్క ఆక్సిజన్ సిలిండర్‌ను అమర్చడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ తీవ్ర వైఫల్యంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్పట్లో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను తొలగించాల్సి వచ్చింది. ఇక గత డిసెంబర్లో ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఒక రోగి వేలిపై ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటన ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య లోపాలను, సెక్యూరిటీ వైఫల్యాలను బట్టబయలు చేసింది. 75 ఏళ్లు దాటిన భవన నిర్మాణం, మూసుకుపోయిన డ్రైనేజీ లైన్లు, ఎలుకలు, పిల్లులు సంచరించే వాతావరణం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో, ఇంక్యుబేటర్‌లో ఉన్న తన బిడ్డను చూసుకునేందుకు ఓ బాలింత ఆసుపత్రి ఆవరణలోని చెట్టు కింద, వార్డుల బయట నేలపై గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఒకవైపు అధికారంలో ఉన్న పెద్దలు ప్రైవేట్ ఆసుపత్రి నెట్‌వర్క్‌లను విస్తరించాలని, వందలాది కొత్త బ్రాంచ్‌లను తెప్పించాలని లక్ష్యాలు నిర్దేశిస్తుండగా, మరోవైపు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా పటిష్టమైన చర్యలు కరువవుతున్నాయి. పాలకుల ప్రాధాన్యతలు ప్రైవేట్ వైద్య వ్యాపారాల వైపు ఉంటున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు ఉంటున్నట్లు ప్రకటనలు వస్తున్నా, క్షేత్రస్థాయిలో నాణ్యమైన వైద్యం, పారిశుద్ధ్యం, మందులు, వైద్య పరికరాలు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. ప్రతి చిన్న ఘటన జరిగినప్పుడు అధికారులను సస్పెండ్ చేయడం లేదా బదిలీ చేయడం మినహా, వ్యవస్థాగతమైన శాశ్వత సంస్కరణలు మాత్రం అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇలా రోగులను గాలికొదిలేస్తే, నిరుపేదలు అప్పులపాలై ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల పాలు కావాల్సి వస్తోంది. ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ, సామాన్యులకు అది ఎండమావిలా మారుతోంది.
ఎంజీఎం ఆసుపత్రిలో రోజురోజుకు క్షీణిస్తున్న వసతులకు ప్రధాన కారణం కేవలం నిధుల కొరత మాత్రమే కాదు, అంతర్గత పర్యవేక్షణ లోపించడం, సమన్వయం లేకపోవడమే అసలు సమస్య. రోజురోజుకు వేలాది మంది ఓపీ (OP) రోగులు, వందలాది మంది ఇన్‌పేషెంట్లు వస్తున్నప్పటికీ.. అందుకు తగినట్లుగా పడకల సంఖ్య, వార్డుల విస్తరణ జరగడం లేదు. ఉన్న బెడ్లు సరిపోక ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులు పడుకోవడం, ఫ్లోర్‌పై గిలగిలలాడటం ఇక్కడ నిత్యకృత్యమైంది. అత్యవసర విభాగంలో స్ట్రెచర్లు లేక కుటుంబ సభ్యులే రోగులను భుజాలపై మోసుకుంటూ వెళ్లాల్సిన దయనీయ దృశ్యాలు ఈ ఆసుపత్రిలో తరచూ కనిపిస్తుంటాయి. రోగి ఆసుపత్రి గడప తొక్కిన క్షణం నుంచి మళ్లీ సురక్షితంగా ఇంటికి వెళ్లే వరకు ప్రతి దశలోనూ వేధింపులు, సిబ్బంది ఉదాసీనత కళ్లముందే కనిపిస్తాయి. ఎంజీఎం ఆసుపత్రి లాంటి చారిత్రక పెద్ద ఆసుపత్రుల్లో పరిస్థితులు మారకపోతే, ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, సర్కార్ దవాఖానాల్లో మౌలిక వసతులు మెరుగుపడేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే సామాన్యుల బతుకులు ఇలాగే రోడ్డున పడే ప్రమాదం ఉంది. “సర్కార్ దవాఖానా” అంటే భయపడే పరిస్థితి పోయి, పేదవాడు సగర్వంగా వైద్యం పొందగలిగే రోజు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం దక్కుతుంది.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455
మారని వరంగల్ ఎంజీఎం దుస్థితి
బెడ్లు లేక నేలపైనే పడుకున్న రోగివరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీవ్ర అస్వస్థతతో, నిలబడలేని పరిస్థితిలో వచ్చిన ఓ రోగిని బెడ్లు ఖాళీ లేవని బయటే నిలిపివేసిన సిబ్బంది
సెక్యూరిటీ సిబ్బందిని ఎంత వేడుకున్నా స్పందించలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ.#warangal #mgm #tg pic.twitter.com/WpM9GC72Pm
— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) August 12, 2026