- రాజగోపాల్ రెడ్డి స్టైలే వేరు!
- పదవి లేకపోతే ఏంటి ?
- రాజగోపాల్ చేతిలో విమర్శల తూటాలు
- స్వపక్షంలోనే ‘విప్లవం’గా మునుగోడు ఎమ్మెల్యే
- ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగుల గొంతుక..
- తెర వెనుక రాజగోపాల్ అసలు వ్యూహం ఏంటి?
తెలంగాణ పాలిటిక్స్‌లో ఎప్పుడూ వేడి పుట్టించే పేరు… కోమటిరెడ్డి బ్రదర్స్! అందులోనూ రాజగోపాల్ రెడ్డి పేరు వస్తే చాలు, రాజకీయ వాతావరణంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టే ఉంటుంది. సొంత పార్టీ సర్కారే అధికారంలో ఉంది, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ జెండానే ఎగురుతోంది. పైగా స్వయంగా కడుపున పుట్టిన అన్నేమో రాష్ట్రానికి మంత్రి! అయినా సరే… రాజగోపాల్ రెడ్డి గారి గుండెల్లో మాత్రం నిత్యం ఏదో ఒక రగిలే నిప్పు కనిపిస్తూనే ఉంటుంది. అన్నే ఏకంగా మంత్రిగా ఉన్నా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు వేసే విమర్శల బాంబులు రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి. అసలు రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు? ఈ రాజకీయ డ్రామా వెనుక అసలు కథేంటి?

రాజకీయ రంగుల ప్రపంచంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాత్ర ఎప్పుడూ రసవత్తరమే! అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన గొంతు వినిపించకపోతే ఆయనకు నిద్ర పట్టదు. రాజగోపాల్ రెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. ఎప్పుడూ ఒకేలా ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు. ప్రభుత్వంపై, సొంత పార్టీ పెద్దలపై విమర్శలు గుప్పిస్తే చాలు.. మరుసటి రోజు పేపర్లలో హెడ్‌లైన్స్ అవే అవుతాయి. ఆయన ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం ఆ పార్టీ నేతలకు మింగ్గుడు పడడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొంతమంది నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండటం బాధాకరమని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు.
రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక మంత్రి పదవి దక్కకపోవడం కూడా ఒక ముఖ్య కారణం అనేది బహిరంగ రహస్యమే. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సీనియర్ నాయకుడిగా, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన నేతగా ఆయన మంత్రివర్గంలో చోటు ఆశించారు. కానీ కేబినెట్ విస్తరణలో అవకాశం రాకపోవడం, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ, తనకంటూ ప్రభుత్వంలో ప్రత్యేకమైన పవర్ సెంటర్ ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆ ఆంకాక్ష నెరవేరకపోవడంతోనే ఆయనలో రగిలిన అసంతృప్తి క్రమంగా ఇలా విమర్శల రూపంలో బయటపడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చింది. అయితే, తనకు మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ భావించారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ తను హామీ కూడా ఇచ్చిందని గతంలో చాలా సందర్భాంలో బహిరంగా ఆయన చెప్పారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం నిజమేనని అంగీకరించారు. అయితే, మారిన రాజకీయ పరిణామాలు, సామాజిక అంశంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు.

ఇంట్లో అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిలో ఉన్నప్పటికీ, తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఎమ్మెల్యే కుర్చీ సరిపోనట్లే కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎవరి అంచనాలు వారివి, ఎవరి ఆశయాలు వారివి. అన్న మంత్రి అయ్యాడని తమ్ముడు సైలెంట్‌గా ఉండిపోవడానికి రాజగోపాల్ రెడ్డి స్వభావం ఒప్పుకోదు. తనకంటూ ఒక సపరేట్ పవర్ సెంటర్ ఉండాలి, తన మాటనే చెల్లాలి అనే కసి ఆయనలో బలంగా ఉంది. మంత్రి పదవి దక్కకపోవడమే ఈ అసంతృప్తికి అసలు సిసలైన ట్రిగ్గర్ పాయింట్!
లోకంలో చాలామందికి అన్న మంత్రి అయితే చాలు, ఆయన కూర్చుని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పేయాలని చూస్తారు. కానీ, రాజగోపాల్ రెడ్డి ఆలోచన వేరు, ఆయన మనస్తత్వం వేరు! “నాకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యం ఉండాలి, నా నియోజకవర్గాన్ని నేను శాసించాలి” అనుకునే స్వతంత్ర భావాల మనిషి ఆయన. మంత్రి పదవి తనకు రాలేదన్న అసంతృప్తో, లేక పవర్లో తన మాట చెల్లలేదన్న కోపమో తెలియదు కానీ… ఆ పెదవులపై చిరునవ్వు కంటే, ప్రభుత్వ తీరుపై పడే విమర్శల తూటాలే ఎక్కువయ్యాయి. హైకమాండ్ దృష్టిలో పడాలన్నా, ప్రభుత్వం తనను లైట్ తీసుకోకూడదన్నా ఇలాంటి సంచలన వ్యాప్తులు చేయడం ఆయనకు బాగా తెలుసు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న చిన్న చిన్న వ్యతిరేకతను తన వైపునకు తిప్పుకుని, తాను నిజమైన ప్రజానాయకుడిని అని నిరూపించుకునే మాస్టర్ ప్లాన్ ఇది. రాజకీయాల్లో సైలెంట్‌గా ఉంటే ఎవరూ పట్టించుకోరు. అదే రేవంత్ రెడ్డి సర్కార్‌పై, పార్టీలోని పెద్దల తీరుపై బాంబు పేల్చితే చాలు… మీడియా మైకులు ఆయన చుట్టూ మూగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులు, లబ్ధిదారుల గొంతుకను నేనేనని భుజాన వేసుకుని, ప్రజల్లో పర్మినెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనే వ్యూహం రాజగోపాల్‌ది.
గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి, మళ్లీ సొంతూరికి తిరిగొచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. ప్రస్తుతం అయితే ఆయన పార్టీ మారే ఆలోచనలో లేనప్పటికీ.. రేవంత్ రెడ్డి మార్కు పాలనలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోతే, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్‌లోనే ఉంటూ, ప్రభుత్వానికి అప్పుడప్పుడు హెచ్చరికలు జారీ చేయడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా! గతంలో బీజేపీ జంప్, మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ లీడర్ గుండెల్లో ఏముందో ఎవరికీ అంతుచిక్కదు. ప్రస్తుతానికైతే “నేను కాంగ్రెస్‌లోనే ఉంటా, ప్రజల కోసమే మాట్లాడుతున్నా” అని చెబుతున్నప్పటికీ.. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారితే, ఆయన వేసే తదుపరి అడుగు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతానికి మాత్రం పార్టీ మారడం కంటే, పార్టీ లోపలే ఉంటూ తన వాయిస్‌ని గట్టిగా వినిపించడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

ఒకవైపు అన్న వెంకట్ రెడ్డి మంత్రిగా ప్రభుత్వానికి గుడ్ నేమ్ తెచ్చే ప్రయత్నం చేస్తుంటే… తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు విమర్శల విల్లును సంధించి ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ అన్నదమ్ముల పొలిటికల్ డ్రామా మున్ముందు ఏ టర్న్ తీసుకుంటుందో, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి ఎలాంటి రాజకీయ సునామీ సృష్టిస్తుందో కాలమే నిర్ణయించాలి! తనకు తగిన గుర్తింపు దక్కకపోతే భవిష్యత్తులో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చనే సంకేతాలను అప్పుడప్పుడు ఆయన ప్రత్యర్థులకు పంపుతుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన “తాను ఎవరికీ భయపడను, ప్రజల గొంతుకనే వినిపిస్తాను” అనే ముద్ర వేసుకోవాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా మారినప్పటికీ, రాజగోపాల్ రెడ్డి మాత్రం తన రాజకీయ మనుగడ కోసం, తన వర్గాన్ని కాపాడుకోవడానికి ఈ ‘అసంతృప్తి అస్త్రాన్ని’ నిరంతరం ప్రయోగిస్తూనే ఉంటారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అన్నట్లుగా.. ఈ హైడ్రామా మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి!
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్, 949 1383 455