తెలుగు భాషా ప‌రిర‌క్ష‌ణ‌లో “నామాల”కు కీల‌క‌ బాధ్య‌త‌

తెలుగు భాషా ప‌రిర‌క్ష‌ణ‌లో “నామాల”కు కీల‌క‌ బాధ్య‌త‌

  • తెలంగాణ తెలుగు భాషా సంర‌క్ష‌ణ సాంస్కృతిక‌ కార్య‌ద‌ర్శిగా ఏక‌గ్రీవం
  • సూర్యాపేట జిల్లా వాసి ర‌వీంద్ర సూరికి అరుదైన గౌర‌వం 

హైద‌రాబాద్ ప్ర‌తినిధి, (ఆగ‌స్ట్ 15): ఇటీవ‌ల సినారె (సింగిరెడ్డి నారాయ‌ణ రెడ్డి) సాహితీ అత్యున్న‌త పుర‌స్కారం అందుకున్న నామాల ర‌వీంద్ర సూరికి తెలుగు భాషా ప‌రిర‌క్ష‌ణ‌లో కీల‌క బాధ్య‌త ల‌భించింది. సూర్యాపేట (ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌) జిల్లా నూత‌న‌క‌ల్ మండ‌లం చిల్ప‌కుంట్ల గ్రామానికి చెందిన ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యిత‌, సినీ ద‌ర్శ‌కులు నామాల ర‌వీంద్ర సూరికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. తెలంగాణ తెలుగు భాషా సంర‌క్ష‌ణ సాంస్కృతిక కార్య‌ద‌ర్శిగా సూరి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన సంఘం రాష్ట్ర స్థాయి స‌మావేశంలో స‌భ్యులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ర‌వీంద్ర సూరి త‌న ర‌చ‌న‌ల‌తో ప్రజలను చైతన్యవంతం చేశారు. ఉద్య‌మం ఉవ్వెత్తున సాగుతున్న త‌రుణంలో రవీంద్ర సూరి రచించి జ‌న బాహుళ్యంలోకి తెచ్చిన ర‌చ‌న “రణ‌న్నినాదం నా తెలంగాణ” పుస్తకం విశేష ఆదరణ పొందింది. ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ పుస్తకం అప్పట్లో “కరెక్ట్ టైం లో కరెక్ట్ బుక్” అంటూ పలువురు ప్రశంసించారు. నిత్యం సాహిత్యంలో మమేకమయ్యే ర‌వీంద్ర‌, 2019లో “అనాహత” అనే కవితా సంపుటిని వెలువరించారు. ఆయన చేసిన సాహితీ సేవలకు గాను అంత‌ర్జాతీయ‌, జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక పురస్కారాలు అందుకున్నారు. సాహిత్యంతో పాటు సినీ రంగంలోనూ రవీంద్ర సూరి తన ప్రతిభా పాట‌వాల‌ను చాటారు. సంభాషణల రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు పది సినిమాలకు, టెలివిజన్ సీరియల్ లకు కథ మాటలు అందించారు. తెలంగాణ భాష యాసలపై ఉన్న ప్రత్యేక అభిమానంతో యూట్యూబ్ వేదికగా వేలాదికి పైగా షార్ట్ ఫిలిమ్స్ కు రచనలు చేశారు. అంతే కాకుండా “చింబు చిన సత్యం” అనే చిత్రానికి దర్శకత్వం వహించి త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నారు. తెలుగు భాషా పరిరక్షణతో పాటు తెలంగాణ భాష వైభవాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ఈ సంఘంలో రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా బాధ్యతలు దక్కడం పట్ల రవీంద్ర సంతోషం వ్యక్తం చేశారు.

తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన సంఘం అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి లకు సూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్రెండింగ్ న్యూస్