విజయసాయి రెడ్డి “యూటర్న్” వ్యూహం ఏంటి?

విజయసాయి రెడ్డి యూటర్న్..వ్యూహం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం తెరపైకి వస్తోంది. మరో కొత్త ప్రాంతీయ పార్టీ ఉద్భవించనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నీడలా ఉంటూ దశాబ్దాల పాటు తెరవెనుక, తెరముందు చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వయంగా కొత్త పార్టీని స్థాపించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమై, కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే తాను ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ నెలలోనే విజయవాడ వేదికగా కొత్త పార్టీ పేరు, విధివిధానాలు, పూర్తి రాజకీయ ప్రణాళికను వెల్లడించనున్నట్లు ఆయన స్పష్టం చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

రాజకీయాలకే శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నానని, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన ఆయన, ఇప్పుడు యూటర్న్ తీసుకుని సరికొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి ప్రధాన నేతల్లో ఒకరిగా, అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా విజయసాయి రెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభలో పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా సుదీర్ఘకాలం సేవలందించారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పరిణామాలు మారాపాయి. పార్టీ ఆదేశాల మేరకు ఆయన నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ అధికార మార్పిడి జరగడం, పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన క్రమంగా వైఎస్సార్‌సీపీకి దూరం కావడం ప్రారంభమైంది.

ఎన్నికల తర్వాత అనూహ్య నిర్ణయాలు తీసుకున్న విజయసాయి రెడ్డి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెబుతున్నానని, ఇకపై ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో కాలం గడుపుతానని ఆ సమయంలో ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో అందరినీ విస్మయానికి గురిచేసింది. క్రియాశీల రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు అందరూ భావించారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పినప్పటికీ, కొద్దికాలంగా ఆయన పునరాగమనంపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చాక, ఆయనకు ఇతర ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన లేదా బీజేపీ వైపు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా బీజేపీ లేదా ఇతర జాతీయ పార్టీల్లోకి వెళ్దామన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఆయన తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవడం ద్వారానే ఉనికిని చాటుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం(ఆగస్ట్ 19) ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విజయసాయి రెడ్డి తన రాజకీయ రీ-ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రజల తరఫున నిలబడి, వారి సమస్యలపై పోరాడేందుకు ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీకి సంబంధించి ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీకి సంబంధించి ‘భారత్ జన వికాస్’ అనే పేరు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ నెలలో విజయవాడ వేదికగా జరిగే ప్రకటనలో దీనిపై అధికారిక స్పష్టత రానుంది.

వైఎస్సార్‌సీపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఆయనకు ఇతర ప్రధాన పార్టీల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకోవడమే ఉత్తమ మార్గంగా భావించినట్లు తెలుస్తోంది. చార్టెడ్ అకౌంటెంట్‌గా కెరీర్ ప్రారంభించి, దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , విభజిత ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్సార్‌సీపీతో పొడమెత్తిన విభేదాలు లేదా వ్యూహాత్మక మార్పుల కారణంగా ఆయన బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకోవడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ స్థ్ధానాన్ని ఏర్పరచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తెరవెనుక ఉండి పార్టీని నడిపించిన ఆయన, ఇప్పుడు స్వయంగా ఒక ప్రాంతీయ పార్టీకి అధినేతగా మారి ప్రజల్లోకి వెళ్లడం ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద అగ్నిపరీక్షగా మారనుంది.

చార్టెడ్ అకౌంటెంట్‌గా, పరిపాలనా వ్యవహారాల్లో బలమైన పట్టున్న నేతగా ఆయనకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి, అసంతృప్తిలో ఉన్న వర్గాలను కూడగట్టడానికి ఈ వేదికను ఆయన వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన వెనుక వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో విభేదాలే ప్రధాన కారణమనేది సుస్పష్టం. వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును లేదా ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న నాయకులను, శ్రేణులను తన వైపునకు తిప్పుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా ఉండే అవకాశం ఉంది. అయితే, బలమైన సామాజిక సమీకరణాలు, కేడర్ బలం ఉన్న జగన్‌ను నేరుగా ఢీకొట్టడం ఏకపక్షంగా సాధ్యం కాకపోవచ్చు. జగన్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేకంటే, వైఎస్సార్‌సీపీ వ్యూహాలను దెబ్బతీయడంలో లేదా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక రాజకీయ శక్తిగా నిలదొక్కుకోవడానికి విజయసాయి రెడ్డి ఈ పార్టీని పావుగా వాడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఉమ్మడి రాష్ట్రంలో గానీ, విభజిత ఏపీలో గానీ ప్రాంతీయ పార్టీలు బలపడటం అంత తేలికైన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఏపీలో ద్విముఖ లేదా త్రిముఖ పోరు గట్టిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి పార్టీ మనుగడ అనేక సవాళ్లతో కూడుకుని ఉంది. పార్టీ పెట్టినంత మాత్రాన గ్రామస్థాయిలో కేడర్ తయారಾಗదు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎంతమంది అసంతృప్త నేతలు ఆయన వెంట నడుస్తారనేదానిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలన్నా, పార్టీని నిలబెట్టాలన్నా అపారమైన ఆర్థిక వనరులు, నిరంతరం ప్రజల్లో ఉండే తపన అవసరం. విజయసాయి రెడ్డికి కార్పొరేట్ వర్గాల్లో బలమైన నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, ప్రజాక్షేత్రంలో జనబలాన్ని ఓట్లుగా మల్చుకోవడం అంత సులభం కాదు.

“రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా” అని చెప్పి కొద్ది నెలలకే మళ్లీ పార్టీ పెట్టడం వల్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఆయన మాటలపై విశ్వసనీయత ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది. దీనిని ఆయన ఏ విధంగా కవర్ చేసుకుంటారనేది చూడాలి. విజయసాయి రెడ్డి రాజకీయ పునరాగమనం మరియు కొత్త పార్టీ ప్రకటన ఏపీ రాజకీయ సమీకరణాల్లో ఒక కొత్త మలుపు. మహిళలు, రైతులు, యువతను ప్రధాన అజెండాగా మలచుకుని ఆయన ఏ రకమైన ప్రత్యామ్నాయ రాజకీయాలను తెరపైకి తెస్తారనేదానిపైనే పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఈ నెలలో విజయవాడలో జరిగే సమావేశంలో ఆయన ప్రకటించబోయే పార్టీ విధివిధానాలు, అజెండా, ఆయన వెనక ఉండే ద్వితీయ శ్రేణి నాయకుల వివరాలే ఆయన పార్టీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఇది ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం తెస్తుంది అనేది రాబోయే కాలం తేల్చనుంది.

 

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్