కొండంత అండ… ఎవరిది?
“ఎవరొచ్చినా… ఎటోచ్చినా.. పీఠం మాత్రం మాదే! అధికారం ఎవరిదైనా అడుగుపెట్టేది మనమే!” అంటూ పరకాల నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రగులుతున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలు, ఆమె వ్యవహరిస్తున్న తీరు పెను ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. “ఎవరొచ్చినా తానే ఎమ్మెల్యే” అంటూ ఆమె బహిరంగంగా సవాల్ చేయడం, రాబోయే ఎన్నికల్లో పరకాల బరిలో నిలవడం ఖాయమని స్పష్టం చేయడం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి పెద్ద సవాల్‌గా మారింది. “ఎవరి అండ చూసుకొని ఈ ధిక్కార స్వరం? అధికార పీఠం నీడలో సొంత గూటికే ఎసరు పెడుతున్నదెవరు?” అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పరకాల రాజకీయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రోడ్డుకెక్కడంతో, ఈ పరిణామాలు పార్టీ వర్గాల్లో పెను కలకలం రేపుతున్నాయి.

ఇటీవల పరకాల బహిరంగ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం కొండా వర్గంలో తీవ్ర కలవరం రేపింది. తమ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో తమను సంప్రదించకుండా లేదా తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని సుస్మితా పటేల్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీ అధికారంలో ఉండి, ముఖ్యమంత్రే స్వయంగా ఒక నియోజకవర్గ అభ్యర్థి విషయంలో స్పష్టతనిచ్చిన తర్వాత, ఒక మంత్రి కుటుంబ సభ్యురాలే నేరుగా వ్యతిరేక గళం వినిపించడం పార్టీ కేడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది. వరంగల్ రాజకీయాల్లో కొండా కుటుంబానికి ఉన్న ప్రత్యేక బలం, క్యాడర్ పట్టు తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి, కొండా కుటుంబానికి మధ్య చాలాకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇది భవిష్యత్తులో స్థానిక కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంలో కొండా కుటుంబం కీలక పాత్ర పోషించిందని వారు భావిస్తున్నారు. అయితే, పార్టీ అధికారంలోకి వచ్చాక తమ కుటుంబానికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తమను పక్కనపెడుతున్నారనే నిరసన వారిలో బలంగా ఉంది. పరకాల నియోజకవర్గం తమ రాజకీయ అడ్డా అని, దశాబ్దాలుగా ఇక్కడ తమ కుటుంబానికి బలమైన కేడర్ ఉందని సుస్మిత స్పష్టం చేశారు. అధిష్టానం లేదా సీఎం స్థాయి నుంచి వస్తున్న ఆదేశాలు తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పుగా మారుతున్నాయని భావించే ఆమె, భవిష్యత్తులోనూ ఇక్కడ తామే అభ్యర్థులమనే సంకేతాలను గట్టిగా ఇచ్చేందుకే సీఎంను నేరుగా టార్గెట్ చేయాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అసంతృప్తిగా కాకుండా, భవిష్యత్తు రాజకీయాల కోసమే వేసిన అడుగుగా పరిశీలకులు భావిస్తున్నారు. పరకాల బహిరంగ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కొండా క్యాడర్‌లో తీవ్ర కలవరం రేపింది. స్థానిక నాయకత్వంపై అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందనే భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. యోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గానికి, కొండా కుటుంబానికి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్‌ను క్షేత్రస్థాయిలో తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

అధికార పార్టీలో ఉంటూ, ముఖ్యమంత్రి ప్రకటనలను బహిరంగంగా వ్యతిరేకించడం, సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడం, కుటుంబ, ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆరోపణలు చేయడంపై టీపీసీసీ సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ పరిణామాలు పార్టీలో క్రమశిక్షణా చర్యలకు దారితీసే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.పార్టీ లైన్‌ను దాటి కూతురు చేస్తున్న వ్యాఖ్యలు, వివాదాలు మంత్రి కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుకు, పదవికి ఇబ్బందికరంగా మారుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఈ అంశాన్ని ఎంతవరకు సహిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గానికి, కొండా కుటుంబానికి మధ్య నడుస్తున్న ఈ బహిరంగ మాటల యుద్ధం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కేడర్‌ను చీలుస్తోందని, ఇది భవిష్యత్తులో పార్టీ బ్రాండ్‌ను దెబ్బతీస్తుందనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ తాజా రాజకీయ పరిణామాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయి అన్నది వేచి చూడాలి.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్
#సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ కుమార్తె #కొండా #సుస్మితా పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. #politics #trikalatelugu #news pic.twitter.com/SLBfU2DQUp
— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) August 20, 2026