జగన్ మార్క్ పొలిటికల్ గేమ్ ! అది కార్యరూపం దాల్చితే ?

  • జగన్ మార్క్ పొలిటికల్ గేమ్ !
  • ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు
  • దశాబ్ద కాలంగా వారితో అందుకే అలా ?
  • కొత్త మిత్రుల కోసం వేట మొదలెట్టారా?
  • ఇక నుంచి ఆ పార్టీకి దగ్గరవుతారా?
  • అది కార్యరూపం దాల్చితే తిరుగులేదా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాంతీయ పార్టీల మనుగడ కోసం జాతీయ పార్టీలతో సంబంధాల పునరాలోచన రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రచారాలు ఇప్పుడు ముమ్మర చర్చకు దారితీశాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వ్యూహాల్లో పెద్ద మార్పు వస్తోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత పదేళ్లుగా జాతీయ స్థాయిలో బీజేపీతో నడిచిన అండర్-స్టాండింగ్ సంబంధాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున పునరాలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా తన రూట్ మారుస్తున్నారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో భూకంపం పుట్టిస్తోంది. కొద్ది రోజుల కిందట బెంగళూరు వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వైఎస్ జగన్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

గత దశాబ్ద కాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్‌లోనూ, బయటా వైఎస్సార్‌సీపీ కీలక సందర్భాల్లో ఇన్‌డైరెక్ట్‌గా మద్దతు ఇస్తూ వస్తోందనేది బహిరంగ రహస్యమే. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం, ప్రత్యేక హోదా లేదా ఇతర కేటాయింపుల పేరుతో కేంద్రంతో కయ్యానికి దిగకుండా సాన్నిహిత్య ధోరణినే జగన్ అవలంబించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీజేపీకి సంబంధించిన పలు కీలక బిల్లుల అంశంలో వైసీపీ పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా… కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మాత్రం జగన్ అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కాని, కాలం మారడంతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ముఖ్యంగా యువత (Gen Z) ఆలోచనా విధానంలో మార్పు వచ్చి కాషాయ పార్టీకి దూరం జరుగుతున్నారనే పక్కా అంచనాకు జగన్ వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, ఇకపై బీజేపీకి జగన్ ఆత్మీయుడు కాదనే సంకేతాలు ఇస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో యువత (Gen Z) ఆలోచనల్లో మౌలిక మార్పు వస్తోందని, కాషాయ పార్టీపై యువతలో క్రమంగా తిరుగుబాటు ధోరణి పెరుగుతోందని జగన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరగడం, యువత కాంగ్రెస్ వైపు ఆకర్షితులు కావడం గమనించిన జగన్.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త మిత్రుల కోసం వెతుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, ముఖ్యంగా రాహుల్ గాంధీ వైపు యువత ఆకర్షితులవుతున్నారనే అంచనాలతో వైసీపీ అధినేత కొత్త సమీకరణాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా లేదా ప్రత్యామ్నాయ రాజకీయ కూటముల వైపు జగన్ అడుగులు వేస్తున్నారనే సమాచారం ఎప్పుడైతే ఢిల్లీ పెద్దలకు చేరిందో, అప్పటి నుంచే కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రాంతీయ పార్టీలను అదుపులో ఉంచడానికి కేంద్రం మళ్లీ తన పాత వ్యూహాలనే తెరపైకి తెస్తోందనే చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల మీద కేంద్రం ఒత్తిడి పెంచడం వెనుక కేవలం పరిపాలనాపరమైన అంశాలే కాకుండా, ఈ రకమైన వ్యూహాత్మక మర్పులు కూడా కారణమనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్‌తో జగన్ టచ్‌లోకి వెళ్లారనే సమాచారం కేంద్ర పాలకులకు తెలియడం వల్లనే రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల (ED, CBI) దూకుడు మరింత పెరిగిందనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది.

మరోవైపు ఈ పొలిటికల్ ఈక్వేషన్స్‌లో అత్యంత కీలకమైన, ఉత్కంఠ రేకెత్తించే అంశం.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల. జగన్‌ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న సంగతి షర్మిలకు తెలుసా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. గత ఎన్నికల సమయంలో కుటుంబపరంగా, రాజకీయంగా ఇద్దరి మధ్య దూరం తారాస్థాయికి చేరింది. అయితే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని, శాశ్వత మిత్రులు గాని ఉండరనే నానుడికి తగినట్లుగా.. కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా తెరపైకి వస్తే, భవిష్యత్ అవసరాల రీత్యా అన్నచెల్లెళ్ల మధ్య రాజకీయ పునరేకీకరణ జరిగే అవకాశం ఉందా అనే కోణంలోనూ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో గనుక తెరవెనుక ఏదైనా పొత్తు లేదా అవగాహన కుదిరితే, ఏపీలో షర్మిల-జగన్ ఒకే తాటి కిందకు వచ్చే పరిస్థితి ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో జగన్ జాతీయ స్థాయిలో మాత్రమే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యే క్రమంలో కాంగ్రెస్‌తో పొత్తు లేదా స్నేహపూర్వక వైఖరి జగన్‌కు కొత్త బలాన్ని ఇస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై మరోసారి ఆలోచన చేయాలని వైసీపీలోని కొందరు సీనియర్లు జగన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా బీజేపీకి అనుకూలంగా ఉంటూ, కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన క్యాడర్‌కు ఈ ఒక్కసారిగా వస్తున్న యూటర్న్ జీర్ణించుకోవడం కొంచెం కష్టమైనా, హైకమాండ్ ఆదేశాల మేరకు మారుతున్న పరిణామాలకు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ రూపురేఖలను పూర్తిగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు వైఎస్ జగన్‌ మద్దతు ఇస్తారన్న ప్రచారం నిజమైతే, ఏపీలో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా తలకిందులయ్యే అవకాశం ఉంది. అధికార కూటమికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రతిపక్షాల మధ్య వ్యూహాత్మక మౌంటెడ్ అండ్‌ అండర్‌స్టాండింగ్ ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రాన్ని రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన, సాహసోపేతమైన మలుపు తిరిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పదేళ్ల మిత్రపత్రుడికి దూరమై, భవిష్యత్ జాతీయ రాజకీయాల సమీకరణాలను బట్టి కొత్త దారులు వెతుక్కోవాలనే నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సునామీ సృష్టించడం ఖాయం. ఒకవేళ ఈ రహస్య సంప్రదింపులు గనుక కార్యరూపం దాల్చితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుజ్జీవనం పొందడమే కాకుండా, వైఎస్సార్ కుటుంబ రాజకీయాల సమీకరణాలు పూర్తిగా తలకిందులవుతాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏపీ రాజకీయ రూపురేఖలను ఎలా మారుస్తాయో చూడాలి!

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్