- కొండా’ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్!
- రాజకీయ రంగస్థలంపై ఒక పొలిటికల్ డ్రామా
- అగ్గిని పుట్టించి చలి కాచుకోవాలని చూస్తే
- కుమార్తె చేసిన వ్యాఖ్యలతో నాకేం సంబంధం
- మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలు ఎలా?
తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఇప్పుడు ఒక పొలిటికల్ డ్రామా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కేవలం ఒక వివాదంలా కాకుండా, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న హై-వోల్టేజ్ ‘టీ కప్‌లో తూఫాన్’ లా మారింది. పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా, తెరవెనుక మాత్రం గ్రూప్ రాజకీయాల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కొండా సురేఖ మంత్రి పదవి భవితవ్యం ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.

“అగ్గిని పుట్టించి చలి కాచుకోవాలని చూస్తే, ఆ మంటలకే ఇల్లే కాలిపోతుంది” అన్నట్లుగా తయారైంది కొండా సురేఖ పరిస్థితి. ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేశాయి. సుస్మిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతూ పార్టీకి చెందిన దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకతాటిపైకి వచ్చి ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని హైకమాండ్‌కు గట్టి పట్టుపట్టారు. తప్పు ఎవరిదైనా, శిక్ష మాత్రం పదవి రూపంలో నాకే చుట్టుకుంటోంది అన్నట్లుగా మంత్రి సురేఖ ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారంపై నివేదికను సిద్ధం చేసి అధిష్టానానికి పంపడంతో, ఆమె పదవిపై వేలాడుతున్న కత్తి ఎప్పుడైనా తెగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేయడంతో, అధిష్టానం తీసుకునే తుది నిర్ణయంపైనే ఆమె మంత్రి పదవి ఆధారపడి ఉంది.
కొండా సురేఖ ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ వివాదంపై సీఎం రేవంత్ విదేశీ పర్యటన ముగించుకుని రాగానే, అంతర్గత విషయాలపై తాను నేరుగా మాట్లాడనని, క్రమశిక్షణ కమిటీ, పార్టీ హైకమాండ్ ఇచ్చే ఆదేశాలే శిరోధార్యమని అంటూ సింపుల్‌గా లైన్ క్లియర్ చేసుకున్నారు. పార్టీలో ముఖ్యమంత్రిని లేదా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సొంత కుటుంబ సభ్యులు విమర్శలు చేయడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. “పుట్టలో వేలు పెడితే పాము కరవక మానదు” అన్న చందంగా, సొంత కుటుంబ సభ్యులతోనే ముఖ్యమంత్రిని విమర్శింపజేయడంపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొండా సురేఖ బలమైన బీసీ, వర్గానికి చెందిన మహిళా నేత కావడంతో, తొందరపడి కఠిన చర్యలు తీసుకుంటే అది పార్టీకి తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అందుకే ఢిల్లీ పెద్దలు ఈ విషయంలో అడుగులు చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. రాష్ట్ర స్థాయిలో తనపై వస్తున్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల ఒత్తిడి, తనను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్ల నేపథ్యంలో సురేఖ నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. రాష్ట్రంలో గ్రూప్ రాజకీయాలు తారస్థాయికి చేరడంతో, మంత్రి సురేఖ నేరుగా ఢిల్లీ పెద్దల అభయం కోసం ఆమె ఖర్గేను కలవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొంతమంది కావాలనే తనను రాజకీయంగా అణగదొక్కడానికి ఒక వర్గంగా ఏర్పడి కుట్ర పన్నుతున్నారని ఖర్గేకు ఆమె వివరించినట్లు సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పదవిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆమె ఖర్గేతో భేటీ నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం తనపై చర్యలు తీసుకునేలోపు హైకమాండ్ పెద్దల జోక్యం కోరడమే ఆమె ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, కుటుంబ సభ్యులైనా సరే పార్టీ అధిష్టానాన్ని, ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటంక్షమించరాని నేరమని ఖర్గే హెచ్చరించినట్లు సమాచారం. ఈ వివాదం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు, ఇతర నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమయ్యాయి. తనపై చర్యలు తీసుకునే ప్రయత్నం వెనుక బలమైన సామాజికవర్గ సమీకరణాలు ఉన్నాయని, బీసీ నేత కావడంతోనే కొందరి నుంచి వ్యతిరేకత వస్తోందని కొండా సురేఖ వర్గం వాదిస్తోంది.
ప్రస్తుతం మంత్రివర్గంలో సామాజిక సమీకరణాల సమతుల్యత చాలా కీలకం. కొండా సురేఖ బలమైన బీసీ (పద్మశాలి) వర్గానికి చెందిన మహిళా నాయకురాలు. ఒకవేళ అధిష్టాన్యం ఆమెను తొలగించే సాహసం చేస్తే, రాజకీయంగా బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దీనిని బ్యాలెన్స్ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఖచ్చితంగా అదే సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడికి లేదా మహిళా నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి కేబినెట్‌ను విస్తరించేందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. కేవలం ఒక్క స్థానాన్ని భర్తీ చేయడమే కాకుండా, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఆశావహులకు అవకాశం కల్పించేలా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒకవైపు క్రమశిక్షణ ముఖ్యం అని భావిస్తున్నా, మరోవైపు ఎన్నికల హామీలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం దెబ్బతినకుండా చూసుకోవడం హైకమాండ్‌కు కత్తి మీద సాములా మారింది.

మరోవైపు కొండా సురేఖ పవర్ మొత్తాన్ని కట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటేషన్‌పై అటవీ శాఖలోకి తెచ్చుకున్న అనుకూల అధికారులందర్నీ ఉన్న పళంగా మాతృశాఖలోకి పంపేశారు. మంత్రిగా ఆమె ఆదేశాలను ఎవరూ పాటించకూడదని సంకేతాలు ఇచ్చారు! మరో వైపు మాజీ ఓఎస్డీ సుమంత్ సెటిల్మెంట్లన్నీ బయటకు తీస్తున్నారు. వరుస అరెస్టులు చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌ను ఇక్కడే కట్టడి చేయకపోతే, రాబోయే రోజుల్లో మిగతా నాయకులు కూడా బహిరంగ విమర్శలకు దిగే ప్రమాదం ఉందని అధిష్టానం సీరియస్‌గా యోచిస్తోంది. కొండా సురేఖ భవితవ్యంపై ఢిల్లీ పెద్దలు తీసుకునే తుది నిర్ణయం.. కేవలం ఆమె పదవిని మాత్రమే కాకుండా, రాష్ట్ర కాంగ్రెస్‌లో రాబోయే రోజుల్లో జరిగే మంత్రివర్గ విస్తరణ స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చేయనుంది! మున్ముందు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది లేదా ఈ వివాదానికి ఎలా ముగింపు పలకనుంది అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ టీ కప్ తూఫాన్ను ఎలా చల్లారుస్తుంది, కొండా సురేఖ భవిష్యత్తును ఎలా మలుస్తుంది అనేది వేచి చూడాలి!