కవిత ‘శకుని’ అస్త్రం..టార్గెట్‌ ఎందుకు మారింది?

  • కవిత ‘శకుని’ అస్త్రం..టార్గెట్‌ ఎందుకు మారింది?
  • నిజామాబాద్ కోటపై ‘శకుని’ యుద్ధం
  • హరీశ్‌పై మృదువైఖరి — వేములపై తీవ్ర దాడి
  • బీఆర్‌ఎస్‌కు సొంత కుంపటి సెగ
  • నిజామాబాద్ ఆధిపత్య పోరు
  • షాడో ఎమ్మెల్యేల ఎత్తుగడ
  • కవిత ప్రయాణం ‘గెలుపు’ కోసమా?

తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో రాజకీయం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ శక్తిని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ వేదికగా జరిగిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో కల్వకుంట్ల కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు కేవలం ఒక సాధారణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోయేవి కావు. “హరీశ్‌ రావు, సంతోష్‌ కుమార్‌లను ఎప్పుడైనా క్షమిస్తానేమో కానీ.. వేముల ప్రశాంత్‌ రెడ్డిని మాత్రం ప్రాణం ఉన్నంతవరకు క్షమించను” అంటూ ఆమె చేసిన శపథం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకప్పుడు హరీశ్ రావును ‘గుంట నక్క’తో పోల్చిన కవిత, ఇప్పుడు తన ప్రధాన రాజకీయ శత్రువుగా వేములను ఎంచుకోవడం వెనుక సున్నితమైన రాజకీయ, వ్యక్తిగత సమీకరణాలు దాగున్నాయి. వేముల ప్రశాంత్ రెడ్డిని ‘శకుని’గా టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయ, వ్యక్తిగత కారణాలున్నాయి. కుటుంబ కలహాలే కాకుండా, లోతైన రాజకీయ పునరేకీకరణ వ్యూహం దాగుంది.

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, కుటుంబంలో శకునిలా వ్యవహరించి తనను తండ్రికి దూరం చేశారనే భావోద్వేగ ఆరోపణను కవిత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తండ్రి కేసీఆర్‌కు, తనకు మధ్య దూరం పెంచడంలో ప్రశాంత్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారని కవిత భావిస్తున్నారు. కేసీఆర్ పెద్ద కొడుకుగా చెప్పుకునే ప్రశాంత్ రెడ్డి, మహాభారతంలో శకునిలా వ్యవహరించి సొంత ఇంట్లోనే కూర్చుని తండ్రీకూతుళ్లను విడదీశాడని ఆమె తీవ్రంగా ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన కేవలం రెండు రోజులకే ప్రశాంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులతో రహస్య మంతనాలు జరిపారన్న కవిత.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆరోపణులు చేసారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కవిత ప్రాభవాన్ని అణచివేయడంలో, బాల్కొండ కేంద్రంగా ప్రశాంత్ రెడ్డి తన రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడంలో తెరవెనుక వ్యూహాలు నడిపారనే పాత కక్షలు కవితను ఎక్కువగా రగిలిస్తున్నాయి.

గతంలో కవిత హరీశ్‌ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్‌లపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారంటూ వారిని టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు హరీశ్‌, సంతోష్‌లను వదిలేస్తానని, కేవలం ప్రశాంత్ రెడ్డినే టార్గెట్ చేస్తానని అనడానికి రాజకీయ లెక్కలున్నాయి. హరీశ్‌ రావు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఒక కీలక స్థానంలో బలమైన నేతగా కొనసాగుతున్నారు. కానీ ప్రశాంత్‌ రెడ్డి మాత్రం కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని పార్టీని, కుటుంబాన్ని మోసం చేశారనే కోణంపై కవిత ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది కేవలం రాజకీయ విభేదాల కంటే వ్యక్తిగత నమ్మకద్రోహానికి సంబంధించిన అంశంగా ఆమె ప్రొజెక్ట్ చేస్తున్నారు. తీహార్ జైలు అనుభవాలు, తండ్రికి దూరమగడం వెనుక ఉన్న కుట్రలను ప్రస్తావిస్తూ ఆమె ప్రజల్లోకి భావోద్వేగాలను తీసుకెళ్తున్నారు. దీనివల్ల సానుభూతి దక్కించుకోవచ్చని ఆమె భావిస్తున్నారు.

కవిత రాజకీయ భవిష్యత్తు నిజామాబాద్ జిల్లాతోనే ముడిపడి ఉంది. ఆమె ప్రారంభించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ మనుగడ సాగించాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నా ఆమెకు నిజామాబాద్‌లో స్పష్టమైన రాజకీయ శత్రువు కావాలి. హరీశ్ రావు రాజకీయం ప్రధానంగా సిద్దిపేట, మెదక్ జిల్లాలకు పరిమితం. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ తరఫున చక్రం తిప్పుతున్న బలమైన నేత వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాపై పట్టు సాధించాలంటే జిల్లా బీఆర్‌ఎస్ ముఖచిత్రమైన వేములను రాజకీయంగా బలహీనపరచడం కవితకు అత్యంత అవసరం. కేసీఆర్‌కు ‘పెద్ద కొడుకు’గా చెప్పుకుంటూ జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లోకి తీసుకున్న ప్రశాంత్ రెడ్డి వల్లే జిల్లా నేతలకు, తనకు మధ్య అగాధం పెరిగిందనేది కవిత అంతర్గత భావన. హరీశ్ రావు, సంతోష్ రావుల విషయానికి వస్తే వారు కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు. వారిపై ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా, కుటుంబ చట్రంలో ఏదో ఒక రోజు క్షమించవచ్చనే భావోద్వేగ వెసులుబాటును కవిత చూపించారు. కానీ వేముల ప్రశాంత్ రెడ్డి పరిస్థితి వేరు. బయటి వ్యక్తిగా వచ్చి, కేసీఆర్ వద్ద అసమాన ప్రాపకం సంపాదించి, చివరికి తండ్రీకూతుళ్ల మధ్య చిచ్చుపెట్టాడనే ‘శకుని’ ముద్రను ఆయనపై బలంగా వేస్తున్నారు. హరీశ్, సంతోష్‌లను క్షమించవచ్చని చెబుతూనే వేములను శకునిగా చిత్రించడం వెనుక ఒక సున్నితమైన అంతర్గత లెక్క ఉంది. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కేసీఆర్ కుటుంబం మళ్లీ ఏకతాటిపైకి రావడానికి ఒక సన్నని దారిని తెరిచి ఉంచుకుంటూనే, బయటి నుంచి వచ్చిన నాయకులను ‘విలన్లు’గా మార్చి పార్టీలో వారి ఆధిపత్యానికి తెరదించే వ్యూహమిది. అధికారం పోయిన 48 గంటల్లోనే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపారన్న ఆరోపణ చేయడం ద్వారా, వేములను ‘నమ్మకద్రోహి’గా ప్రజల్లో చిత్రిక పట్టే ప్రయత్నం చేస్తున్నారు.

నిజామాబాద్‌లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలను పెట్టి సిట్టింగ్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేయాలని కవిత ప్లాన్ చేశారు.
ఇది బీఆర్‌ఎస్ సంప్రదాయ ఓటు బ్యాంకును, స్థానిక క్యాడర్‌ను రెండుగా చీల్చే ప్రమాదం ఉంది. బీఆర్‌ఎస్ ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో కేసీఆర్ కూతురే నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం, బీఆర్‌ఎస్ మాజీ మంత్రులపై బహిరంగ దాడులు చేయడం పార్టీ నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. కవిత చేస్తున్న ఈ వ్యాఖ్యలు గులాబీ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బలు తింటున్న బీఆర్‌ఎస్‌కు.. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబం నుంచే ఇలాంటి తిరుగుబాటు రావడం నైతికంగా పార్టీని దెబ్బతీస్తుంది.

మరోవైపు కవిత వేస్తున్న ఈ ఎత్తుగడలు కేవలం నిరసనలకే పరిమితం కావు. రాబోయే స్థానిక సంస్థల (ZPTC, MPTC)ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ను రెండో స్థానానికి నెట్టి, తానే అసలైన ప్రతిపక్షంగా నిలబడాలన్నది ఆమె పక్కా వ్యూహం. ఒకవేళ కవిత సొంతంగా పెద్ద సంఖ్యలో సీట్లు గెలవలేకపోయినా.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓట్లను చీల్చి వారి ఓటమికి కారణమయ్యే ‘కింగ్ మేకర్ లేదా స్పాయిలర్’ పాత్రను ఆమె సమర్థవంతంగా పోషించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి ఉనికి చాటుకోవాలని చూస్తున్న కవిత, బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకుకు గండికొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆమె పార్టీ పెద్ద ప్రభావం చూపలేకపోయినా, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం గులాబీ పార్టీ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయికి కవిత రాజకీయ ప్రయాణం మారుతుందనడంలో సందేహం లేదు. రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ లేదా తిరుగుబాటు గొంతు ఎప్పుడూ రాత్రికి రాత్రే అధికారాన్ని చేజిక్కించుకోలేదు. కానీ ప్రత్యర్థిని ఓడించడానికి కావాల్సిన ఓటు బ్యాంకును చీల్చగలదు. నిజామాబాద్ జిల్లాలో కవిత ప్రస్తుతం చేస్తున్నది సరిగ్గా అదే.

కవిత తన కొత్త పార్టీతో తక్షణమే ఎన్నికల విజయాలు సాధించలేకపోయినా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును చీల్చి ‘స్పాయిలర్’గా మారే అవకాశం మెండుగా ఉంది. వేముల ప్రశాంత్ రెడ్డి లాంటి బలమైన నేతను నిరంతరం డిఫెన్స్‌లో ఉంచడం ద్వారా, ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ సంప్రదాయ కేడర్‌ను అయోమయంలో పడేయడమే ఆమె మొదటి లక్ష్యం. కవిత ప్రారంభించిన ఈ పోరాటం ఆమెకు ఎంత మైలేజ్ ఇస్తుందనేది పక్కనబెడితే, గులాబీ పార్టీని మాత్రం క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళంలోకి నెట్టడం ఖాయం. ఒకరకంగా చెప్పాలంటే.. కవిత వేసిన ఈ బాణం వేముల ప్రశాంత్ రెడ్డికి తగులుతుందా లేదా అన్నదానికంటే ముందు, బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును బలంగా చీలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్