సీఎం అయితేనే సభకు వస్తారా?

  • సీఎం అయితేనే వస్తారా? హోదాకు న్యాయమేది?

శాసనసభ ప్రజాస్వామ్యానికి దేవాలయం అంటారు. గెలిచిన పక్షం పాలన సాగిస్తే, ఓడిన పక్షం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాజ్యాంగం కల్పించిన వేదిక అది. శాసనసభ అనేది కేవలం అధికారంలో ఉన్న పాలకులకు మాత్రమే పరిమితమైన వేదిక కాదు. ఓటర్ల తరఫున ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే రాజ్యాంగబద్ధమైన సాధనం. అధికార పక్షం అయినా, ప్రతిపక్షం అయినా ప్రజల కోసమే పని చేయాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రతిపక్షం నిలదీయాలి. అందుకు అసెంబ్లీనే ఒక వేదిక. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అనేది ప్రత్యామ్నాయ ప్రభుత్వం లాంటిది. సభలో ప్రజాధనంతో ఏర్పాటైన ప్రతిపక్ష నేత హోదాను, సకల సౌకర్యాలను అనుభవిస్తూ… పాలకుడిగా ఉన్నప్పుడు మాత్రమే విధుల్లో ఉంటానని, ప్రశ్నించే స్థానంలో ఉంటే రాలేనని చెప్పడం ప్రజాప్రతినిధి ప్రాథమిక ప్రమాణానికే విరుద్ధం. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.

తెలంగాణలో అధికారంలో కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడి హోదాకే పరిమితం అయిన కేసీఆర్… అసెంబ్లీకి రావడం లేదు. గతంలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఒకటి, రెండు సందర్భాల్లో కాసేపు అలా వచ్చి ఇలా వెళ్లారు తప్ప… అసెంబ్లీలో పెద్దగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. దీనిపై సమయం చిక్కినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేతను ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటైన సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్ ‘చార్జ్‌షీట్’ విడుదల చేసిన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుదుమారాన్ని రేపాయి. “ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తేనే కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారు” అన్న ఆయన ప్రకటన కేవలం ఒక రాజకీయ శపథంగా కనిపించడం లేదు, అంతకుమించిన ఆత్మరక్షణ, సంక్షోభ వ్యూహం అందులో దాగి ఉందన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రావాలని విసిరిన సవాళ్లకు సమాధానంగా వచ్చిన ఈ వ్యాఖ్యలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రతిపక్ష నాయకుడి రాజ్యాంగబద్ధమైన పాత్రను లోతుగా పునఃసమీక్షించేలా చేస్తున్నాయి. అధికారం ఉంటేనే సభకు వస్తాం, విపక్షంలో కూర్చోవాల్సి వస్తే ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతాం అనుకోవడం రాజకీయ అహంకారాన్ని సూచించడమే కాక, ఓటు వేసి గెలిపించిన ప్రజలను నిలువునా మోసం చేయడమే అవుతుంది.

తెలుగు నేలపై అసెంబ్లీని బహిష్కరించి, “తిరిగి సీఎంగానే అడుగుపెడతాం” అని ప్రతిజ్ఞ చేసిన ఉదంతాలు కొత్తేమీ కాదు. 1989లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సభలో జరిగిన తీవ్ర పరిణామాలను నిరసిస్తూ బయటకు వచ్చి, 1994లో అఖండ మెజారిటీతో మళ్లీ సీఎం కుర్చీలో కూర్చున్నారు. 2017-19లో వైఎస్ జగన్ కూడా పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ చర్యలు తీసుకోలేదంటూ అసెంబ్లీని బహిష్కరించారు. ఆ వెంటనే 3,600 కిలోమీటర్ల ‘ప్రజాసంకల్ప యాత్ర’తో ఊరూరా తిరిగి 2019లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 2021లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటుంబంపై అధికార పక్ష సభ్యులు చేసిన వ్యక్తిగత దూషణలకు నిరసనగా కన్నీటితో సభను వీడారు. ఆ తర్వాత నిరంతరం ప్రజల్లోనే ఉంటూ 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా సభలోకి అడుగుపెట్టారు.

అయితే, గత ఉదాహరణలతో కేసీఆర్ వైఖరిని పోల్చడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు గానీ, జగన్ గానీ సభను బహిష్కరించినప్పుడు దానికి వెనుక నిర్దిష్టమైన సంఘటనలు, ప్రజల్లో సానుభూతి కలిగించే కారణాలు ఉన్నాయి. అన్నింటికీ మించి, వారు సభను వీడినప్పటికీ ప్రజలను వీడలేదు. నిరంతరం రోడ్ల పైనే ఉండి ప్రజా క్షేత్రంలో పోరాడారు. కానీ, కేసీఆర్ విషయంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. పదేళ్లు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన నేత, విపక్ష నాయకుడి హోదా దక్కినప్పటికీ సభ ముఖం చూడకపోవడం వెనుక ఎలాంటి నైతిక సమర్థన కనిపించడం లేదు. ఆయన సభకు రాకపోవడమే కాకుండా, ప్రజల మధ్యకు సైతం పూర్తిస్థాయిలో రాకపోవడం, ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం బీఆర్‌ఎస్ వాదనల్లోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ప్రజల తరఫున గొంతు వినిపించాల్సిన విపక్ష నేత, “మళ్లీ నన్ను పాలకుడిని చేస్తేనే వస్తా” అనడం ప్రజాతీర్పును అవమానించడమే. అధికారంలో ఉంటేనే సభకు వస్తామనడం బాధ్యతాయుత రాజకీయ లక్షణం అనిపించుకోదు.

కేటీఆర్ ప్రకటన వెనుక బీఆర్‌ఎస్ అంతర్గత వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సభలో రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల ఎదురుదాడికి కేసీఆర్ నేరుగా గురికాకుండా చూడటం, కేసీఆర్ స్థాయిని తగ్గకుండా కాపాడుకోవడం వారి ప్రధాన ఉద్దేశం కావొచ్చు. సభలో పోరాటాన్ని కేటీఆర్, హరీశ్‌రావులకు అప్పగించి, కేసీఆర్‌ను కేవలం ఒక దార్శనిక ప్రత్యామ్నాయ శక్తిగా మాత్రమే ప్రజల ముందుంచాలని వారు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో దశాబ్ద కాలం తిరుగులేని ‘సుప్రీం లీడర్’గా అధికారం చలాయించిన కేసీఆర్, నేడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చొని అధికార పక్షం వేసే నిందారోపణలను, విమర్శలను నిశ్శబ్దంగా వినాల్సి రావడం ఆయన వ్యక్తిత్వానికి ఇబ్బందికరం. సభలో రేవంత్ రెడ్డి శైలి దూకుడుగా, వ్యక్తిగతంగా ఉంటుంది. అక్కడ సాధారణ చర్చల్లో కేసీఆర్ ఇరుక్కుంటే ఆయనకున్న ‘రాష్ట్ర నిర్మాత’ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయం బీఆర్‌ఎస్ వ్యూహకర్తల్లో స్పష్టంగా ఉంది. కాలేశ్వరం ప్రాజెక్ట్ రీ-డిజైనింగ్, విద్యుత్ కొనుగోళ్ల విచారణలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై శాసనసభలో కేసీఆర్‌ను బోనులో నిలబెట్టాలని కాంగ్రెస్ నిరంతరం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే చర్చకు ఆహ్వానిస్తూ వ్యూహాత్మక ట్రాప్ వేశారు. కేసీఆర్ సభకు హాజరైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్ల వైఫల్యాలపైనే చర్చను నడిపిస్తుంది తప్ప, ప్రస్తుత సమస్యలపై మాట్లాడనివ్వదు. ఆ ఉచ్చులో పడకుండా తప్పించుకోవడానికే అసెంబ్లీని బహిష్కరించే కార్డ్ ముందుపెట్టారు. బీఆర్‌ఎస్ శాసనసభా పోరాట బాధ్యతను పూర్తిస్థాయిలో కేటీఆర్, హరీశ్‌రావుల భుజస్కంధాలపైనే ఉంచినట్లయింది. ఎన్నికల ఓటమి తర్వాత వరుసగా నాయకులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. “కేసీఆర్ సీఎం అయితేనే సభకు వస్తారు” అని చెప్పడం ద్వారా కార్యకర్తల్లో ‘మేం మళ్లీ గెలుస్తున్నాం’ అనే అభద్రతా భావాన్ని పోగొట్టే నైతిక ఉత్ప్రేరకం అందించాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్య చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే—ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేసినవారికే ప్రజలు మళ్లీ పాలనాధికారాన్ని అప్పగించారు. సభనూ తిరస్కరించి, ప్రజల్లోనూ పూర్తిస్థాయిలో తిరగకుండా ఫామ్‌హౌస్‌లో కూర్చొని ఇచ్చే ‘చార్జ్‌షీట్లు’ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేవు. కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకోకపోతే, ఆయన రాజకీయ ప్రస్థానానికిది ఒక చారిత్రక తప్పిదంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సక్రమంగా పోషించిన వారికే మళ్లీ పాలించే అవకాశాన్ని ప్రజాస్వామ్యం కల్పిస్తుంది. సభను తిరస్కరించి, కేవలం గత చరిత్రను చూపిస్తూ అధికారాన్ని డిమాండ్ చేస్తే ప్రజలు ఆమోదిస్తారా? లేక ప్రతిపక్ష విధులను సైతం సక్రమంగా నిర్వర్తించలేదని పక్కనపెడతారా? కాలమే దీనికి సరైన తీర్పు చెప్పాలి. కేసీఆర్ విషయంలో ఆ సానుభూతి ఆయుధం కనిపించడం లేదు; అసెంబ్లీకే కాక క్షేత్రస్థాయి ప్రజలకూ ఆయన దూరంగా ఉండటం గత పోలికలను పూర్తిగా అసంబద్ధం చేస్తోంది.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్