టీజీఎస్ఆర్టీసీకి అవార్డుల పంట

  • ​క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (QCFI) హైదరాబాద్ 40వ వార్షిక కన్వెన్షన్
  • టీజీఎస్ ఆర్టీసీ కి అవార్డుల పంట.
  • విశేష ప్రతిభ కనబరిచిన సిబ్బందికి టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి అభినందన
  • ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (QCFI) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన 40వ వార్షిక కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ (CCQC-2026) సెప్టెంబర్ 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లోని హోటల్ మేరీగోల్డ్‌లో ఘనంగా ముగిసింది. ఈ రెండు రోజుల సదస్సులో వివిధ సంస్థల నుండి 200 కంటే ఎక్కువ బృందాలు పాల్గొని నాణ్యతా ప్రమాణాల పెంపు, పని ప్రదేశంలో వినూత్న మార్పులు, ఉత్పాదకత పెరుగుదల , అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శించాయి.


​
ఈ కన్వెన్షన్‌లో టీజీఎస్ ఆర్టీసీ ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ నుండి పాల్గొన్న 4 బృందాలు విశేష ప్రతిభ కనబరిచాయి. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా వ్యయ నియంత్రణ (కాస్ట్ కంట్రోల్) పై టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను ప్రదర్శించి, 4 బృందాలు ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డులను గెలుచుకున్నాయి. త్వరలోనే ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో ఈ బృందాలు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాయి.


​
ఈ ముగింపు సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ఆర్‌టీఐ కమీషనర్ శ్రీ బి. అయోధ్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు అభినందనలు తెలిపారు. సామూహిక ఆలోచనలు, జట్టుకృషి మరియు ఉద్యోగుల భాగస్వామ్యంతో అసాధారణ ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. నాణ్యతను కేవలం ఒక లక్ష్యంగా కాకుండా రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని, ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వివిధ పరిశ్రమల మధ్య సహకారం పెరగాలని మరియు సంస్థాగత లక్ష్యాలను ‘ఆత్మనిర్భర్ వికసిత్ భారత్’ ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.


​అవార్డులు సాధించిన సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి అభినందించారు. నాణ్యత ప్రమాణాలను పెంపొందించి తెలంగాణలో మెరుగైన ప్రజా రవాణా ను ప్రజలకు చేరువ చేస్తామని ఎండీ నాగిరెడ్డి చెప్పారు.

​ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్.వెంకన్న, సిఎమ్ఈ జానీరెడ్డి, డబ్యూఎం జి.ఎన్ పవిత్ర, , QCFI హైదరాబాద్ ఛైర్మన్ దయానంద్ రెడ్డి, బాలకృష్ణ రావు, డైరెక్టర్ కె.మనోహర్ హెగ్డే తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్