- పార్టీ ఫిరాయింపుల కేసులో..దానం నాగేందర్‌కు హైకోర్టు షాక్!
- దానం నాగేందర్‌పై అనర్హత వేటు
- స్పీకర్ ఆర్డర్ కొట్టేసిన హైకోర్టు !
- ఏప్రిల్ 23, 2024 నుంచే ఎమ్మెల్యే పదవి రద్దు !
హైదరాబాద్ సెప్టెంబర్ 18 : త్రికాల తెలుగు : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం రేపిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసులో రాష్ట్ర హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి (Disqualified) అనర్హుడిగా ప్రకటిస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గతంలో దానంపై వచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా కొట్టేసింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే తెలంగాణ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా, కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. స్వచ్ఛందంగా రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నందున రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (యాంటీ డిఫెక్షన్ లా) ప్రకారం ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ మెగా తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్‌లోకి వెళ్లిన మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కూడా వణుకు మొదలైంది.