భూమి ఉంది..హక్కు పోయింది ! తెలంగాణ “ల్యాండ్ లాక్” కథ ! తెలుసా?

  • భూమి ఉంది..హక్కు పోయింది !
  • 22-A డీమోనిటైజేషన్ గేమ్ !
  • తెలంగాణ ‘ల్యాండ్ లాక్’ కథ !

నిన్న మొన్నటిదాకా నోట్ల రద్దు చూశాం…ఓట్ల రద్దు చూశాం… చివరకు పెట్రోల్‌లో ఇథనాల్ కల్తీ కూడా చూసేశాం! కానీ ఇప్పుడు తెలంగాణలో ఏకంగా “భూముల డీమోనిటైజేషన్” నడుస్తోంది. జెన్‌జీల సెటరికల్ గ్రూప్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పెట్టిన ఒక్క పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! రేవంత్ రెడ్డి తన బడే భాయ్ మోదీ లెక్కనే రూట్ మార్చిండు… రాత్రికి రాత్రే కోటి ఎకరాలను 22-A నిషేధిత లిస్టులో పడేసి రిజిస్ట్రేషన్లు ఆపేశారు… ఈ లొల్లి నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ముచ్చట తీశారు” అన్నది సీజేపీ పెట్టిన పోస్ట్ సారాంశం. టీకొట్టు నుంచి అసెంబ్లీ దాకా వినిపిస్తున్న ఒకే ఒక్క పదం: సెక్షన్ 22-A! కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాలా? 67 ఎకరాలా? అన్న రచ్చ నడుమ అసలు కోటి ఎకరాల సమస్య సైడ్ అయిపోయింది. అసలు ఈ ట్వీట్ వెనుక ఉన్న రాజకీయ మర్మం ఏంటి? తెరవెనుక నడుస్తున్న మైండ్‌గేమ్ ఏంటి? ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం!

నోట్ల రద్దు గుర్తుందా? జేబులో నోటుంటుంది కానీ బయట చెల్లదు. ఇప్పుడు సామాన్యుడి భూమి పరిస్థితి కూడా సరిగ్గా అలాగే తయారైంది. తాతల కాలం నాటి భూమి ఉంటుంది… పట్టాదారు పాస్‌బుక్ ఉంటుంది. కానీ తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పోతే “మీ భూమి 22-A లో పడింది, రిజిస్ట్రేషన్ కాదు” అని బోర్డు తిప్పేస్తున్నారు! అసలు ఏంటీ 22-A? అనేది తెలుసుకుందా. రిజిస్ట్రేషన్ చట్టం–1908 ప్రకారం… ప్రభుత్వ ఆస్తులు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి ప్రభుత్వం పెట్టే ‘నిషేధిత జాబితా’నే ఈ 22-A. ఉద్దేశం మంచిదే… కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే..ధరణిలో పాత రికార్డులను డిజిటలైజ్ చేసినప్పుడు పక్కపక్కనే ఉన్న ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి సర్వే నంబర్లు కలిసిపోయాయి. దాని ఫలితం? అక్రమార్కుల భూములతో పాటు… రెక్కలు ముక్కలు చేసుకుని కొనుక్కున్న సామాన్యుడి ప్లాట్లు, రైతుల పట్టా భూములు కూడా 22-A లో లాక్ అయిపోయాయి!

22-Aపై ప్రభుత్వం ఏమంటోంది? అనే విషయానికి వస్తే… అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లెక్కలు చెప్పారు. మొత్తం కోటి ఎకరాల్లో 98 లక్షల ఎకరాలు అటవీ, ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ భూములే అని ప్రకటించారు. నిజమైన ప్రైవేట్ రైతుల సమస్య కేవలం 3.73 లక్షల ఎకరాలే. పాత సర్కారు ధరణిలో చేసిన పాపాల వల్లే ఈ గందరగోళం వచ్చింది అన్నది రేవంత్ సర్కార్ చెబుతున్న మాట. మంత్రి పొంగులేటి కూడా కొన్ని ప్రైవేట్ భూములు పొరపాటున ఈ లిస్టులోకి చేరిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.

కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? లెక్కలు 3 లక్షల ఎకరాలా, కోటి ఎకరాలా అన్నది పక్కన పెడితే…కూతురి పెళ్లికి భూమి అమ్ముకోలేక, కొడుకు చదువుకు బ్యాంకు లోన్ రాక, ఆస్పత్రి ఖర్చుల కోసం రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతుకు, మిడిల్ క్లాస్ మనిషికి ఈ లెక్కలతో పనేంటి? వాళ్లకు కావాల్సింది పరిష్కారం! సరిగ్గా ఇక్కడే కాక్రోజ్ పార్టీ లాంటి జెన్‌జీ గ్రూపులు వేసిన సెటైర్లు ఆలోచింపజేస్తున్నాయి. ఢిల్లీలో మోదీ గారు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కొత్త అస్త్రాలు తీసినట్టే… ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సేమ్ రూట్ పట్టారన్నది వీరి ఆరోపణ. ప్రజల్లో 22-A అసంతృప్తి పెరుగుతున్న టైమ్‌లోనే… రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ‘ఎర్రవల్లి ఫామ్‌హౌస్’ బాంబు పేల్చారు! కేసీఆర్ కుటుంబానికి ఎర్రవల్లిలోనే 700 ఎకరాలుంది, అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి కలిసుంది, 30 రోజుల్లో ఎంక్వైరీ చేస్తాం” అని రేవంత్ ఎటాక్ చేశారు. దీనికి బీఆర్ఎస్ తక్కువ తిన్లే…”మాకున్నది 67 ఎకరాలే, 1000 ఎకరాలు ఎక్కడివి? దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయ్!” అని కేటీఆర్, హరీష్ రావు రివర్స్ సవాల్ విసిరారు.

ప్రభుత్వం డిఫెన్స్‌లో పడకుండా ఉండాలంటే… ప్రతిపక్షాన్ని అంతకంటే పెద్ద డిఫెన్స్‌లోకి నెట్టాలి! సామాన్యుడి భూముల సమస్య కాస్తా మీడియా హెడ్‌లైన్లలో ‘కేసీఆర్ ఫామ్‌హౌస్ వర్సెస్ రేవంత్ ఆరోపణలు’గా మారిపోయింది. పొలిటికల్ ఫోకస్ పక్కదారి పట్టింది! సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ వేస్తే రిపోర్ట్ రావడానికి ఏళ్లు పడుతుంది, అప్పటివరకు రాజకీయం చల్లారిపోతుంది. అదే రెవెన్యూ విచారణ అయితే ప్రభుత్వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజకీయంగా లీకులు ఇచ్చుకోవచ్చు, ప్రెస్‌మీట్లలో ప్రత్యర్థులను ఇరికించవచ్చు. అటు బీఆర్ఎస్ కూడా “మేం విచారణకు సిద్ధం” అంటూ పబ్లిక్ కోర్టులోనే మాటల యుద్ధం చేస్తోంది తప్పితే, ఇరువైపులా సమస్యను శాశ్వతంగా తేల్చే మూడ్ కనిపించడం లేదు. ఒకపక్క కాంగ్రెస్ తన రాజకీయ పట్టు కోసం కేసీఆర్ ఆస్తులను టార్గెట్ చేస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు 22-A అంశాన్ని వాడుకుంటోంది. కాక్రోజ్ పార్టీ లాంటి వాళ్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సాధారణంగా తెలంగాణ రాజకీయ విశ్లేషణలు స్థానిక కుల సమీకరణాలు, ప్రాంతీయ భావోద్వేగాల చుట్టూ తిరుగుతాయి. కానీ CJP లాంటి గ్రూపులు దీనిని జాతీయ అంశాలతో ముడిపెట్టాయి. ‘నోట్ల రద్దు’, ‘పెట్రోల్ ఇథనాల్ కల్తీ’, ‘ఓట్ల డీమోనిటైజేషన్’ వంటి జాతీయ నిరసన పదాలను రాష్ట్ర రెవెన్యూ సమస్యతో కలిపి సరికొత్త ట్రెడ్ సృష్టించారు. ఇది సాధారణ రాజకీయ ప్రకటనల కంటే సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తూ, న్యూ-ఏజ్ ఓటర్లలో ప్రభుత్వ నిర్ణయాలపై ఒక రకమైన అపనమ్మకాన్ని పెంచే ప్రమాదం తెచ్చిపెట్టింది.

ధరణి పోర్టల్ తెచ్చినప్పుడు తప్పులు జరిగాయని ఆరోపించిన వారు, ఇప్పుడు సరిదిద్దే ప్రక్రియలో కూడా పాత అవినీతి తలెత్తుతోందని భయపడుతున్నారు. 22-A నుంచి తమ పేరు తొలగించుకోవడానికి కలెక్టర్ , ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగే సమయంలో దళారులు, కింది స్థాయి సిబ్బంది రైతుల్ని పీల్చిపిప్పి చేసే అవకాశం ఉంది. డిజిటల్ పారదర్శకత లేకపోతే ఈ కమిటీలు వేసినా సామాన్యుడి జేబుకు చిల్లు పడక తప్పదు. సర్వే నంబర్లు కంప్యూటర్లలో మిస్ మ్యాచ్ అయ్యాయి సరే… కానీ దానివల్ల రోడ్డున పడ్డ రైతుల జీవితాల మ్యాచ్ ఎవరు ఫిక్స్ చేస్తారు? ఫామ్‌హౌస్‌లు, ప్యాలెస్‌లు ఎలాగైనా రక్షించబడతాయి… కానీ నిషేధిత లిస్టులో ఆగిపోయిన పేదవాడి అర ఎకరానికి న్యాయం ఎప్పుడు దక్కుతుంది? రాజకీయాల్లో ‘కమిటీ’ వేశారంటే చాలాసార్లు అర్థం… సమస్యను పరిష్కరించడం కాదు, వివాదాన్ని కొన్ని రోజులు వాయిదా వేయడమే! ఈ బడా నేతల నడుమ నలిగిపోతున్నది మాత్రం… తన భూమిని అమ్ముకోలేక, కాగితం మీద ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ కాక ఆగమవుతున్న సగటు తెలంగాణ పౌరుడే! ప్రభుత్వం ప్రకటించిన కమిటీ నిజంగానే సామాన్యుల భూములను 22-A నుంచి విముక్తి చేస్తుందా? లేక ఈ రచ్చ కేవలం ఫామ్‌హౌస్ పాలిటిక్స్‌తోనే ముగుస్తుందా? అన్నది సమాధానం లేని ప్రశ్నలే. మీ సర్వే నంబర్లు కూడా 22-A లో పడ్డాయా? మీ అనుభవాలు ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి.

-జి.మహేష్‌ కుమార్✍️
 సీనియర్ జర్నలిస్ట్

ట్రెండింగ్ న్యూస్