ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలి: SYF
ఏపీ ఒంగోలు, సెప్టెంబర్ 22: త్రికాల తెలుగు: ప్రకాశం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వివిధ పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని Socialist Youth Federation (SYF) డిమాండ్ చేసింది.

ఈ మేరకు SYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా NEET, IIT, Olympiad, ప్రత్యేక కోచింగ్, వివిధ వెర్షన్ల పేరుతో సాధారణ పాఠశాల ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్న మొత్తాలకు సంబంధిత పాఠశాలలకు అనుమతి, నిబంధనల్లో చట్టబద్ధమైన ఆధారం ఉందా అనే అంశాలను పరిశీలించాలని కోరారు.
ప్రతి పాఠశాల గుర్తింపు, అనుమతులు, ప్రకటించిన ఫీజులు, వాస్తవంగా వసూలు చేస్తున్న ఫీజులను రికార్డుల ఆధారంగా తనిఖీ చేయాలని, రసీదులు లేకుండా అదనపు వసూళ్లు, నిర్దిష్ట దుకాణాల నుంచే పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయాలనే ఒత్తిడి వంటి అంశాలపై కూడా విచారణ జరపాలని కోరారు.
నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, విచారణ వివరాలతో Action Taken Report (ATR) అందించాలని SYF కోరింది.