- రేవంత్ రెడ్డి..ఎలా సీఎం అయ్యారో తెలుసా?
ఢిల్లీ, సెప్టెంబర్ 28 : త్రికాల తెలుగు: అస్సాం దినపత్రిక ప్రతిదిన్ కాంక్లేవ్‌లో ఇండియాస్ నెక్ట్స్ చాఫ్టర్ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జర్నీని క్లుప్తంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ… ” తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్రభావం పెద్దగా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో రాజకీయాల శైలి వేరు… మా దగ్గర యూనివర్సిటీ లా కాలేజ్, ఆర్ట్స్ కాలేజీ నాయకునిగా ఏబీవీపీలో గెలిచిన వారు తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘంలో ఉన్నా, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదు. స్టూడెంట్ రాజకీయాల్లో ఏబీవీపీ ప్రభావం ఉంటే.. రాజకీయాల్లోకాంగ్రెస్ ప్రభావం ఉంటుంది..

నేను 2006లో జడ్పీటీసీ సభ్యునిగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా. ఆ రెండు సార్లు నేను కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్కడ రెండు పార్టీలే ఉన్నాయి.. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పెద్దగా సంబంధాలు పెద్దగా లేవు.. ప్రభుత్వంపై పోరాడాలంటే ప్రతిపక్షమే మేలని భావించా.. అందుకే నేను తెలుగుదేశంలో చేరా.. ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. 2017లో కాంగ్రెస్‌లో చేరాను. 2019లో ఎంపీగా గెలిచాను..
రాష్ట్ర విభజన తర్వాత నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉండడంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రాధాన్యం తగ్గిపోయింది. మీరు మంచి నాయకుడు, మీరు నాయుడుతో కలిసి పని చేస్తే తెలంగాణలో ఇబ్బంది అని ప్రజలు చెప్పారు.. దాంతో నేను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏతో ఉంది. ఏపీలో ఎన్డీఏ ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. నేను రెండింటితో పోరాడాల్సి ఉంది.. రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ తో పాటు నా శ్రేయోభిలాషులు కాంగ్రెస్‌లో ఉన్నారు… రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత పోటీ కేసీఆర్, రేవంత్ మధ్య పోటీగా మారింది. ఆయన నన్ను అనేక సార్లు జైలుకు పంపారు. నేను అసెంబ్లీకి కన్నా జైలుకే ఎక్కువ సార్లు పోయా… రాహుల్ గాంధీని కలిసిన తర్వాత 15 నిమిషాలు మాట్లాడాం.. ఆ రోజే ఆయన నా నాయకుడి అని నిర్ణయించుకున్నా… రాహుల్ గాంధీకి ఎటువంటి వ్యక్తిగత అజెండాలు లేవు.. ఆయనకు దేశమే ముఖ్యం.. నేను విద్యార్థి సంఘంలో ఉన్నా.. నాయుడు పార్టీలో ఉన్నా దేశం, రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనుకున్నా” అని చెప్పారు.