- తెలంగాణలో విద్యా సంస్కరణలకు శ్రీకారం..
- వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే విద్యా విధానం!
తెలంగాణలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు సమూల విద్యా సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక విద్యగా, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ విద్యగా, తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా విభజించాలని నిర్ణయించారు.
పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. ముఖ్యంగా బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నెండో తరగతి వరకు విద్య కొనసాగితే డ్రాపౌట్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

అంతేకాదు.. విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, సమాచార నైపుణ్యాలపై పట్టు కల్పించాలని, ఇంటర్ తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకుని నిపుణులుగా ఎదిగే అవకాశం కల్పించాలని సూచించారు. జూనియర్ కళాశాలల లెక్చరర్లు, సిబ్బంది పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఇకపై అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. అన్ని సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మించేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా పాలిటెక్నిక్‌ల ఆధునికీకరణకు నిధులు త్వరగా విడుదల చేయాలని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
మొత్తానికి.. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు మార్పులు తీసుకొచ్చి, తెలంగాణ విద్యార్థులను ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
-
తెలంగాణలో విద్యా సంస్కరణలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం!
-
వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం!
-
పదో తరగతి తర్వాత డ్రాపౌట్స్‌కు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం!
-
అద్దె భవనాల్లో ఇక సంక్షేమ హాస్టళ్లు ఉండకూడదు!
-
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి వేగం!
-
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలకు సీఎం ఆదేశాలు!