భవిష్యత్‌లో ఏ సర్పంచ్‌కి ఇలాంటి దుస్థితి రాకూడదు ! ▶️

  • సభా సాక్షిగా సర్పంచుల నిరసన..
  • మంత్రి వివేక్‌కు గ్రామ సమస్యలపై వినతి!

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో గ్రామాల సమస్యలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. మంత్రి వివేక్ సమక్షంలోనే సర్పంచులు తమ నిరసన గళాన్ని వినిపించారు. మా పల్లెల సమస్యలు పరిష్కరించండి.. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించండి అంటూ సభా వేదికపైనే తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని సర్పంచులు మంత్రిని కోరారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, అయితే ప్రభుత్వం నుంచి సరైన నిధులు, సహకారం అందకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

మాటలకే పరిమితం కాకుండా.. గ్రామాల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, పెండింగ్ నిధులు విడుదల చేసి పల్లెల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సర్పంచులు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఏ సర్పంచ్‌కి ఇలా వినతి పత్రాలు సమర్పించి..నిధులు అడుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి రాకూడదని సర్పంచ్‌లు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

మరి సర్పంచుల ఆవేదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? గ్రామాల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

ట్రెండింగ్ న్యూస్